కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా తమిళసై!

128

త్వరలో గవర్నర్ ప్రజాదర్బార్?
నాడు కుముద్‌బెన్ బాటలో..

(మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ గవర్నర్ తమిళసై ఇకపై ప్రజలను నేరుగా కలవనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కలవలేని పరిస్థితిని బిజెపి తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పరోక్షంగా రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఆమె త్వరలో ప్రజాదర్బార్ పేరిట ప్రతి రోజూ ప్రజలను కలుసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన కుముద్‌బెన్ జోషి కూడా, ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇదేవిధంగా పోటీగా ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. ఇప్పుడు తమిళసై కూడా ఆమె బాటలోనే నడిచేలా కనిపిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. ప్రజలను కలిసే వెసులుబాటు అసలే లేదు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు క్యాంపు కార్యాలయంలో ఉదయం తప్పనిసరిగా ప్రజల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించే వారు. తర్వాత వచ్చిన ఏ సీఎం కూడా దానిని అమలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ తలచుకుంటే తప్ప ఎవరూ ఆయనను కలిసే వీలు లేదు. ఈ నేపథ్యంలో గతంలో తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా పనిచేసి, తెలంగాణ గవర్నర్‌గా వచ్చిన తమిళసై చురుకుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజలు తమ సమస్యలు విన్నవించేందుకు ఎవరిని కలవాలన్న తర్జనభర్జనలో ఉన్న క్రమంలో, తమిళసై దానిని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాజ్‌భవన్‌కు వచ్చే ప్రజలను కలసి, వారి సమస్యలు వినేందుకు ఆమె త్వరలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఆ ప్రకారంగా..  గవర్నర్‌కు వచ్చే వినతిపత్రాలను గవర్నర్ కార్యాలయం సంబంధిత శాఖలకు పంపిస్తారు. పంపించడంతో సరిపెట్టుకోకుండా, దానికి నిర్ణీత సమయంలోగా స్పందన లేకపోతే నేరుగా గవర్నర్ కార్యాలయమే రంగంలోకి  దిగుతుంది. ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తప్పనిసరిగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరకంగా నేరుగా అధికారులు రాజభవన్ నియంత్రణలోకి రావడం అనివార్యమవుతుంది. అప్పుడు సహజంగా రాష్ట్ర ప్రభుత్వానికి , గవర్నర్ కార్యాలయానికి దూరం పెరుగుతుంది. ఇది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడమే అవుతుందని రాజ్యాంగ నిఫుణులు చెబుతున్నారు. ప్రభుత్వం విఫలమైన సమయంలో గవర్నర్ కార్యాలయం జోక్యం చేసుకుంటే, ఇక ప్రజలు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగడం మానుకుని, నేరుగా గవర్నర్ కార్యాలయ తలుపులు తట్టడం ఖాయం.
గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కుముద్‌బెన్ జోషి గవర్నర్‌గా వ్యవహరించేవారు.అప్పుడు ఆమె కూడా ప్రజాదర్బార్ నిర్వహించారు. రాజ్‌భవన్‌లో ఏకంగా పెళ్ళిళ్లు కూడా నిర్వహించిన సందర్భాలు లేకపోలేదు. అయితే, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోవడంపై నాటి టిడిపి సర్కారు ఆక్షేపించింది. నాటి రెవిన్యూ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గవర్నర్ జోషి పనితీరుపై బహిరంగంగా విమర్శలు ఎక్కుపెట్టారు.దేవదాసీలకు పెళ్లిళ్లు చేసే నిలయంగా రాజ్‌భవన్ తయారయిందని ధ్వజమెత్తారు. నాడు గవర్నర్‌గా పనిచేసిన జోషి గవర్నర్‌గా కాకుండా, కాంగ్రెస్ నేతగా వ్యవహరించారన్న విమర్శలుండేవి. అప్పుడు ఎన్టీఆర్‌కు ఎమ్మెల్యేలు, మంత్రులు భయపడేవారు. ఆయన తక్కువమందినే కలిసేవారు. ఇప్పుడు తమిళసై కూడా కుముద్‌బెన్ జోషి త రహాలో ప్రజాదర్బార్ నిర్వహించేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తికరంగా మారింది.