కాసు..శహ ‘బాసూ’

877

తీరనున్న పల్నాడు ‘పానీ’ పరేషానీ
వైఎస్‌తో మొదలై జగన్‌తో ముగిసిన ప్రయత్నం
బుగ్గవాగు వాటర్‌గ్రిడ్‌కు 2665 కోట్లు విడుదల
చిన్న వయసులోనే పెద్ద ప్రాజెక్టు సాధించిన ఎమ్మెల్యే కాసు మహేష్
పూర్తయితే పల్నాడులో ఇక కనిపించని ‘పానీ’పట్టు యుద్ధాలు

(మార్తి సుబ్రహ్మణ్యం)

ఒక పని కావాలంటే దానిని అనుకుంటే సరిపోదు. దేనికోసమయినా కలలు కంటే సరిపోదు. దాని కార్యాచరణకు ప్రయత్నించాలి. స్వప్నం సాకారానికి కృషి చేయాలి. ఒకవేళ ఆ కృషిలో సఫలమైతే చరిత్రలో నిలిచిపోతారు. ఒకవేళ సాధించకపోయినా.. పోరాటయోధుడిగా జనం గుండెలో నిలిచిపోతారు. పల్నాడు ప్రాంతంలోని ఏడు నియోజకవర్గాల ప్రజల దాహార్తికి శాశ్వతంగా తెరదించే  బుగ్గవాగు కోసం, తాజాగా జగన్ సర్కారు విడుదల చేసిన నిధులు.. గురజాల యువ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని పల్నాడు ప్రజల గుండెల్లో  చిరస్థాయిగా నిలబెడతాయి.
జగన్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో తొలిసారి ఒకేరోజు ఆరు జిల్లాల నీటి సరఫరా కోసం విడుదల చేసిన 12308 కోట్ల రూపాయలలో, ఒక్క పల్నాడు ప్రాంతానికి చెందిన నీటి ప్రాజెక్టుకే 2,665 కోట్ల రూపాయలు ఉండటం విశేషం. చివరకు సీఎం జగన్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కూడా ఇన్ని నిధులు ఈ జీఓలో విడుదల చేయకపోవడం ప్రస్తావనార్హం. నిజానికి నాగార్జున సాగర్-బుగ్గవాగు ప్రాజెక్టు ద్వారా  9 నియోజకవర్గాలకు ప్రతి ఇంటికీ తాగు నీరు ఇవ్వవచ్చని పేర్కొంటూ కాసు మహేష్‌రెడ్డి.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి 2008లోనే ఒక నివేదిక ఇచ్చారు. దానిని పరిశీలించి ఒక నివేదిక ఇవ్వాలని వైఎస్ ఆదేశించారు.అయితే ఆయన అకాల మరణంతో ఆ ప్రతిపాదన కాస్తా నిలిచిపోయింది. అయితే వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్రకు వచ్చిన సందర్భంగా.. మళ్లీ మహేష్‌రె డ్డి ఆ ప్రాజెక్టు ప్రాధాన్యం, పల్నాడు ప్రజల నీటి అవసరాలు వివరించారు. దానితో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా ప్రాజెక్టు చేపడదామని, నిధులు ఇస్తానని మహేష్‌కు అందరి సమక్షంలో  హామీ ఇచ్చారు.  ఆ ప్రకారంగా అధికారంలోకి వచ్చిన  ఏడు నెలల తర్వాత సీఎం జగన్,  తన మాటను జీఓ రూపంలో ఇచ్చి నిలబెట్టుకోవడం పల్నాడు ప్రజలను ఆనందపరిచింది. దానికి సంబంధించి గురజాల నియోజకవర్గ వైసీపీ నేతలు విడుదల చేసిన ఒక ఆసక్తికరమైన ఫొటో సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ వాటర్‌గ్రిడ్ పథకానికి యువ ఎమ్మెల్యే  కాసు మహేష్ చొరవతో నిధులు మంజూరైన నేపథ్యంలో.. గుంటూరు, నర్సరావుపేట ఎంపి నియోజకవర్గాల పరిథిలో 9 నియోజకవర్గాలకు క్రమం తప్పకుండా మంచినీరు అందనుంది. ఫలితంగా గురజాల, మాచర్ల, సతె్తనపల్లి, వినుకొండ, పెదకూరపాడు, చిలకలూరిపేట, నర్సరావుపేట నియోజకవర్గాల్లో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుంది. సాగర్ నుంచి కుడికాలువ ద్వారా, 18 మైళ్లు దూరంలో ఉన్న బుగ్గవాగు రిజర్వాయర్‌కు నీటిని తీసుకురానున్నారు. అయితే ఇప్పుడు నీటి నిలువ సామర్ధ్యం కూడా పెరగనుండటం విశేషం. ప్రస్తుతం రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 3.05 టీఎంసీలు మాత్రమే. దానిని 7.05 టీఎంసీకి పెంచనున్నారు. నాగార్జునసాగర్ నుంచి కుడికాలువ ద్వారా బుగ్గవాగు రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి పైప్‌లైన్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. మరో రెండేళ్లలో వాటర్‌గ్రిడ్ ద్వారా ఇంటింటికీ మంచినీరు సరఫరా కానుంది.
నిజానికి పల్నాడు ప్రాంతం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కాసు కుటుంబమే. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కాసు కుటుంబానిదే కీలకపాత్ర. కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు వెంగళరెడ్డి, కాసు కృష్ణారెడ్డి పల్నాడు ప్రాంతంపై తమదైన ముద్ర వేశారు. ఎమ్మెల్యే, ఎంపి, మంత్రులుగా చేసిన వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, పల్నాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వైఎస్ రాజకీయ ప్రస్థానంలో కాసు కుటుంబ బంధం ఈనాటిది కాదు. వైఎస్‌కు రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన ఘనత కాసు కుటుంబానిదే. వైఎస్ ఆప్తమిత్రుడైన కాసు కృష్ణారెడ్డి ఆయనను  ‘రాజా’ అని సంబోధిస్తే, వైఎస్ అందుకు ప్రతిగా ‘కృష్ణా’ అని పిలిచేవారు. ఢిల్లీలో కాసు కృష్ణారెడ్డి ఎప్పుడూ వైఎస్ నివాసంలోనే కనిపించేవారు. అంత విడదీయలేనంతగా పెనవేసుకున్న స్నేహ బంధం వారిది.
ఇప్పుడు కాసు వారసుడు మహేష్‌రెడ్డి కూడా వారి బాటలోనే పయనిస్తు, ప్రగతిబాటలో వెళుతున్నారు. కాకపోతే మహేష్‌రెడ్డిది తండ్రికి భిన్నమైన తత్వం. క్షేత్రస్థాయి వాస్తవాలు, నిశిత పరిశీలన, లోతైన విశ్లేషణలో ఆయనది ప్రత్యేక శైలి. తండ్రిలా బోళా తత్వం కాదు. అన్నీ బేరీజు వేసుకునే నిర్ణయాలు తీసుకునే ఈతరం యువనేత. అందుకే తనకు పెద్దగా పరిచయం లేని, టిడిపి కంచుకోటయిన గురజాల నుంచి అధిక మెజారిటీతో విజయం సాధించగలిగారు. తన తండ్రి కాసు కృష్ణారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే ఆయన బుగ్గవాగు ప్రాజెక్టు నిధుల కోసం వైఎస్ వద్దకు వెళ్లారంటే..  యువనేతగా ఆయన ప్రణాళిక, దూరదృష్టి ఏమిటన్నది స్పష్టమవుతోంది. జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాటను ఆయనకు గుర్తు చేసిన మహేష్‌రెడ్డి చివరకు అనుకున్నది సాధించారు. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, బుగ్గవాగు వాటర్‌గ్రిడ్‌కు మిగిలిన జిల్లాల కంటే మిన్నగా, 2665 కోట్లు విడుదల చేయించడం బట్టి.. కాసు మహేష్‌రెడ్డి పట్టుదల, జగన్ వద్ద ఆయనకు ఉన్న విలువేమిటన్నది స్పష్టమవుతోంది.