కమల-సేన కలిస్తే కదనమే!

674

బిజెపి-జేఎస్పీ కలయిక కొత్తమలుపే
వైసీపీకి ఇక రాజకీయంగా కష్టకాలం
కానీ కొత్త కూటమికి అధికారం కష్టమే
మూడుపార్టీల పోరులో జగన్‌కే లాభం
టిడిపి దూరంగా ఉంటే వైసీపీకే అధికారం

(మార్తి సుబ్రహ్మణ్యం)

మకర సంక్రమణ తర్వాత ఏపీ  రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఏపీలో పాగా వేయాలని అవకాశం కోసం ఎదురుచూస్తున్న బిజెపికి, జనాకర్షణ శక్తి ఉన్న జనసేనాధిపతి పవన్ కల్యాణ్ తోడవడం కలసివచ్చే అంశమే. పైగా కొత్తగా పొడిచిన పొత్తు బంధం ఆ రెండు పార్టీలలో కొత్త ఆశలు నింపేవే. విడిగా జీవిస్తున్న ఇరు పార్టీల ‘తోడు కలయిక’ రాజకీయ సహజీవనానికే కాకుండా, వారి లక్ష్యానికి చేరువయేలా కనిపిస్తుంది. రాష్ట్రంలో రెండూ విడి విడిగా ప్రభావం చూపించే శక్తులు కాకున్నా, రెండూ కలిస్తే కొంత ప్రభావమే కాదు, శ్రేణుల్లో కొండంత ధైర్యం నింపేదే. ఇది రాజకీయ ఎదుగుదల, విస్తరణకు పనికివచ్చేదయినా.. మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్ దారి మరింత సుగమం చేస్తుంది. ఎందుకంటే  వైసీపీ-బిజెపి;జనసేన-టిడిపి విడిగా పోటీ చేస్తే, చీలిపోయే ఓటు చివరకు ఎవరిని విజేతగా నిలబెడతాయన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తేనే,  వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. అంతకుముందు టిడిపి-జనసేన -బిజెపి కలిస్తేనే టిడిపి-బిజెపి కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ, వైసీపీ 67 స్థానాల్లో గెలిచి, కేవలం నాలుగున్నర లక్షల ఓట్ల తేడాతో అధికారం కోల్పోయింది.  క్రైస్తవ, దళిత, గిరిజన, ముస్లిం, రెడ్డి ఓటు బ్యాంకు ఇప్పటికీ వైసీపీతోనే ఉన్న విషయాన్ని విస్మరించకూడదు.
పవన్ సినిమాలోనే చెప్పినట్లు.. పవన్‌లో లెక్కుంది. దానికో తిక్కుంది. ఎప్పుడు ఏం మాట్లాడ తారో పవన్‌కే తెలియదు. పైగా ఆయన కాసేపు లెఫ్టిస్టుగా, ఇంకాసేపు రైటిస్టుగా కనిపిస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో తాను ఒంటరయ్యానని, జగన్ సర్కారు తన పార్టీ శ్రేణులను కూడా బతకనిచ్చేలా లేదని, చివరకు తన పార్టీ ఎమ్మెల్యేను కూడా తనకు దూరం చేసిందని గ్రహించిన తర్వాతనే బిజెపి శరణు కోరారు. తాను ఒంటరిగా ఉంటే ఎదుగుదల అటుంచి, రాజకీయ ఉనికి కూడా ప్రమాదమేనన్న వాస్తవాన్ని ఆయన ఆలస్యంగా గ్రహించినట్లున్నారు. అదే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో కలసి ఉంటే, ఇప్పటిలా జనసైనికులపై జగన్ పార్టీ కాళ్లు దువ్వే సాహసం చేయదని భావించి, అర్జంటుగా ఢిల్లీ ఫ్లైైటెక్కారు. అంటే పవన్ రాజకీయాలపై అవగాహన పెంచుకున్నట్లు కనిపిస్తోంది. అనుభవమయితే గానీ తత్వం బోధపడదు కదా మరి?
 కన్నా లక్ష్మీనారాయణ మాటల ప్రకారం చూస్తే పవనే బిజెపితో కలసి పనిచేయాలని కోరినట్లు అర్ధమయింది. ఇక ఇప్పుడు జనసైనికులు స్వేచ్ఛగా రాజకీయాలు చేయవచ్చు. వైసీపీని చూసి భయపడాల్సిన పనిలేదు. అది ఒకరకంగా జనసేనకు ఊరట. కానీ, ఇప్పటిదాకా జనసేన అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏ ఫ్రేము చూసినా పవనే కనిపిస్తారు. తాజా కలయికతోనయినా క్యాడర్‌ను పెంచుకుని, పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తేనే ఫలితం. ఆ పార్టీకి బిజెపి మాదిరిగా ఇప్పటిదాకా నగర, పట్టణ, గ్రామ, మండల కమిటీలు లేవు. పైగా అభిమానులే జనసేనకు వరం, శాపం. లేశమాత్రమైనా కనిపించని క్రమశిక్షణ, దురుసుతనం ఇత్యాది అవలక్షాలను పవన్ ఇక గాడిలో పెట్టాల్సి ఉంటుంది. తన ప్రసంగానికే అడ్డుపడేంత ‘క్రమశిక్షణ గల జనసైనికుల’ను నియంత్రించకపోతే, పవన్ కష్టానికి ఈలలు, చప్పట్లే తప్ప ఓట్లు రాలవు. అయితే, కాపుల పరిస్థితిలో ఇప్పుడు కొంత మార్పు రావచ్చు. మొన్నటివరకూ తాను కాపునని చెప్పడానికి పవన్ మొహమాటపడటం, అన్నయ్య చేసిన మోసం, జనసేన అభ్యర్ధుల్లో సమర్ధులు లేకపోవడటం వంటి కారణాలతో కాపులు జనసేనను సొంతం చేసుకోలేకపోయారు. బిజెపితో కలయిక తర్వాత ఆ పరిస్థితిలో మార్పు రావచ్చు. దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటారన్న దానిపైనే పవన్ సమర్థత ఆధారపడి ఉంటుంది.
తాజా పరిణామాలు అటు బిజెపి ఎదుగుదల, విస్తరణకు దోహదపడేవే. ఎందుకంటే గత ఎన్నికల్లో పది శాతం ఓట్లు సాధించిన జనసేనతో కలయిక, బిజెపికి రాజకీయంగా లాభించే అంశమే. ఇప్పుడు కాపులు గంపగుత్తగా బిజెపి వైపు రావచ్చు. ఎందుకంటే జనసేనాధితి పవన్, బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయ ఇద్దరూ ‘కాపు’లర్లే కాబట్టి! గత ఎన్నికల్లో తనకు ఒక శాతం కూడా ఓటు రాకపోయినా, తాను ఎదగడానికి కాకుండా టిడిపిని గద్దె దించేందుకు, వైసీపీని గద్దె నెక్కించేందుకే బిజెపి పాత్ర పరిమితమింది. అదీ కాకుండా ప్రస్తుతం జాతీయ స్థాయి తెలుగు ప్రముఖుడి పుణ్యాన ఏపీలో బిజెపి సమాధి అయింది.దానిని మళ్లీ జీరో నుంచి ఈ స్ధాయికి తీసుకురావడానికి, కన్నా లక్ష్మీనారాయణ కష్టపడాల్సి వస్తోంది. చివరకు ఆయన కూడా తన అనుభవం, కీర్తిని ఫణంగా పెట్టాల్సి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసీ, తాను పోటీ చేయకపోతే కింది స్ధాయి నేతల్లో ఆత్మస్ధైర్యం దెబ్బతింటుందన్న ముందుచూపుతో ఎన్నికల బరిలో దిగారు. ఇప్పటివరకూ ఏ అధ్యక్షుడు తిరగనన్ని జిల్లాలు, పట్టణాలు కన్నా పర్యటించారు. గతంలో హరిబాబు కనిపిస్తే విశాఖ, లేదా ఢిల్లీలో, ఈ రెండు కాకపోతే పత్రికల్లో మాత్రమే కనిపించేవారు.
అసలు బిజెపి రాష్ట్ర చరిత్రలో ఇన్ని పదవులు భర్తీ చేసిన అధ్యక్షుడెవరూ లేరు. కాంగ్రెస్ వంటి పార్టీ నుంచి వచ్చిన మాస్ లీడరయిన కన్నా లక్ష్మీనారాయణ.. పార్టీ పదవులపై క్యాడర్ ఎంత ఆశ పెట్టుకుంటుందో గ్రహించి, వాటిని పెద్ద స్థాయిలో భర్తీ చేయడం ద్వారా వందలమందికి పదవులు కల్పించారు. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా, వందలమంది కార్యకర్తలకు గౌరవం  కల్పించగలిగారు.పైగా.. పవన్ కల్యాణ్ కాపు సామాజికవర్గానికే చెందిన వాడు కావడంతో, భవిష్యత్తులో జనసేనతో సమన్వయం విషయంలో బిజెపికి కన్నా బాగా ఉపయోగపడతారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. ఒకశాతం ఓటు కూడా లేని బిజెపి, పది శాతం ఓటున్న జనసేన కలిస్తే అధికారం ఎలా సంపాదించుకుంటున్నదే ప్రశ్న. జీవీఎల్ నరసింహారావు వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని ధీమా వ్యక్తం చేశారు. ఆయన గత ఎన్నికల్లో కూడా అధికారం మాదేనని చెప్పారు. పైగా బిజెపి మాదిరిగా జనసేన నిర్మాణం ఉన్న పార్టీ కాదు. కేవలం పవన్ సినిమా ఇమేజ్‌పైనే ఆధారపడిన పార్టీ. కాపులు పూర్తి స్థాయిలో కలసి వస్తేనే తగిన ఫలితం ఉంటుంది. మరి కాపులు పవన్‌ను ఆ మేరకు ఎంతవరకూ సొంతం చేసుకుంటారో కాలమే నిర్ణయించాలి.
 చరిత్రలో తొలిసారి 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన జగన్.. భవిష్యత్తు రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకుని, తన పాత ఓటు బ్యాంకును సుస్ధిరం చేసుకోవడంతోపాటు, కొత్త పథకాలతో కొత్త ఓటర్లను సంపాదించుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు సుప్రీంకోర్టుతో వాయిదా పడేలా ఉన్నాయి కాబట్టి, ఈ అమరావతి రాజధాని గొడవ నుంచి బయటపడేందుకు వైసీపీకి ఒక అవకాశంగా మారింది. పైగా వైసీపీ అధికారంలో ఉందన్న విషయాన్ని విస్మరించకూడదు.
 ఒక వేళ స్థానిక సంస్థలు జరిగితే… వైసీపీ ఒకవైపు, బిజెపి-జనసేన మరొకవైపు, టిడిపి ఇంకో వైపు బరిలోకి దిగితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, అది అంతిమంగా వైసీపీకే లాభించడం ఖాయం. అయితే.. బిజెపి-జనసేన పొత్తు వైసీపీకి ప్రమాదఘంటికనే. అగ్నికి ఆజ్యం తోడయితే ఎవరికి మాత్రం భయం ఉండదు? బిజెపిలో కన్నా మినహా దూకుడుగా వెళ్లే నేతలు తక్కువ. పవన్ స్వతహాగా ఫైర్‌బ్రాండ్. ఇప్పటివరకూ ఆయనకు పైస్థాయిలో రాజకీయ దన్ను లేకపోవడంతో ఆయనలో ఫైర్ ఉపయోగం లేకుండా పోయింది. అయినా అధికార పార్టీని చికాకుపెడుతోంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీనే పక్కన ఉంటే ఇక పవన్ దూకుడును అడ్డుకోవడం వైసీపీకి కష్టమే. కొందరు అగ్రనేతలు పార్టీలు మారినా, మరికొందరు నేతలు అభద్రతా భావంతో ఉన్నప్పటికీ, 40 శాతం ఓటు శాతం సాధించిన టిడిపి ఒంటరిగా పోటీ చే స్తుంది. ఆ క్రమంలో  ప్రభుత్వ వ్యతిరేక ఓటును బిజెపి-జనసేన కొంతమేర చీలిస్తే, అది వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే. ఈ నేపథ్యంలో బిజెపి-జనసేన కొత్త పొత్తు వైసీపీని ఎలా పుట్టిముంచుతుందన్నది తెరపైకి వచ్చే ప్రశ్న.