జనసేన చర్చల్లో ఆ ముగ్గురూ ఏరీ?

576

బిజెపి-జనసేన చర్చలు నేడు
చర్చల్లో కనిపించని సుజనా, సీఎం రమేష్, పురంధీశ్వరి
జీవీఎల్ ఒక్కరినే ఎలా చేర్చారంటున్న సీనియర్లు
రాష్ట్ర ఎంపీలు ఆటలో అరటిపండ్లేనా?
కొత్త వారికి ఇచ్చే ప్రాధాన్యం ఇదేనా?
‘కమలం’లో చర్చల కలకలం

(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరిగే మార్గం ఆదిలోనే హంసపాదు అన్నట్లు అడుగులేస్తోంది. జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లి.. ఆ పార్టీ కాబోయే చీఫ్ నద్దా సహా, సంఘ్ ప్రముఖులతో చర్చలు జరపడం, వెంటనే బెజవాడ కేంద్రంగా బిజెపి-జనసేన చర్చలకు తెరలేవడం చకచకా జరిగిపోయాయి. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో జనసేనకు బిజెపి అవసరం చాలా ఉంది. అలాగే బిజెపికి మరొక పార్టీ తోడు కూడా అనివార్యం. పదిశాతం ఓటు బ్యాంకు సాధించిన జనసేన తోడయ్యే అవకాశం రావడం, ఒక్క శాతం ఓటు కూడా సాధించలేని బిజెపికి కచ్చితంగా సానుకూల అంశమే. ఇది కూడా చదవండి..అమరావతి ఆటలో బిజెపి గెలుస్తుందా?
అయితే.. గురువారం విజయవాడలో జరగనున్న బిజెపి-జనసేన కీలక భేటీలో బిజెపి నుంచి పాల్గొనే నేతలపై ఆ పార్టీలోనే ఆశ్చర్యం, అభ్యంతరం  వ్యక్తమవుతోంది. జనసేన నుంచి ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు. బిజెపి నుంచి రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి జీవీఎల్ నరసింహారావు పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచి స్వయంగా పవన్ పాల్గొంటున్నారు కాబట్టి, మిగిలిన వారు  ఎవరు పాల్గొన్నా ఆ పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోరు. కానీ బిజెపి నుంచి పాల్గొననున్న నేతల పేర్లపైనే, ఆ పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఇన్చార్జి, రాష్ట్ర అధ్యక్షుడు ఉండాలి కాబట్టి దానిపై ఎవరికీ అభ్యంతరాలు కనిపించడం లేదు. కానీ, అందులో జీవీఎల్ పేరు ఉండటమే ఈ వ్యవహారం చర్చకు కారణమవుతోంది. రాష్ట్రం నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక కేంద్ర మాజీ మంత్రి ఉండగా, వారిని కాదని అసలు రాష్ట్రానికి సంబంధం లేని జీవీఎల్ పేరు ఎలా చేర్చారన్న అభ్యంతరాలు సీనియర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని, అసెంబ్లీ, సెక్రటేరియేట్ అక్కడే ఉంచాలని బిజెపి రాష్ట్ర కమిటీ అధికారికంగా తీర్మానించకముందు వరకూ, జీవీఎల్ భిన్నంగా మాట్లాడిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒకవైపు సాక్షాత్తూ ప్రధాని మోదీ పవిత్ర జలాలు, మట్టి తీసుకువచ్చి రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చల్లితే.. అక్కడి నుంచి  రాజధానిని మార్చి, మోదీని అవమానిస్తున్న  ప్రభుత్వ వైఖరిని దునుమాడని జీవీఎల్ వైనైం పెనా పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమయింది. ఇది కూడా చదవండి..మోదీని అవమానిస్తున్నా,కమలంలో అవే కలహాలు‘ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని ఒకసారి, అమరావతి అక్కడే ఉంటుందని, తాను కేంద్రం-బిజెపి నాయకత్వంతో మాట్లాడిన తర్వాత ఆ మాట చెబుతున్నానన్న.. సొంత పార్టీ ఎంపి సుజనాచౌదరి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, జాతీయ అధికార ప్రతినిధిగా తాను చెప్పిందే ఫైనల్ అని ఇంకోసారి, అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని మరోసారి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దానితో ఆయన ప్రభుత్వ విధానానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర పార్టీ అంతా ఒకవైపు ఉంటే, జీవీఎల్ మరో వైపు ఉన్నారన్న వ్యాఖ్యలు పార్టీలోనే వినిపించాయి. పైగా అసలు జీవీఎల్‌కు యుపి నుంచి ఎన్నికైన ఎంపీ అయినందున, ఆ రాష్ట్ర పార్టీపై దృష్టి సారించాలే తప్ప, ఏపీకి సంబంధం ఏమిటన్న ప్రశ్నలు గత నెల రోజుల నుంచి పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

తాజాగా జనసేనతో జరిపే చర్చల్లో ఆయన పేరు ఎలా చేర్చారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన ఎంపీలయిన కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, కేంద్ర మాజీ మంత్రి, మహిళా మోర్చా జాతీయ నేత పురంధీశ్వరిని పక్కకుపెట్టి.. జీవీఎల్ ఒక్కరినే చర్చల్లో ఎలా చేర్చారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ఎంపీలకు ప్రాధాన్యం లేదన్న సంకేతాలు వెళతాయంటున్నారు. నిజానికి సుజనా చౌదరి, సీఎం రమేష్ టిడిపిలో ఉన్నప్పుడు.. చంద్రబాబు తరఫున పవన్‌కల్యాణ్, జనసేన నేతలతో చర్చలు జరిపిన అనుభవం వారిద్దరికీ ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వారిద్దరూ చర్చల్లో ఉంటే చర్చలు ఫలప్రదమవుతాయే తప్ప, అసలు జనసేనతో చర్చలు జరిపిన పూర్వానుభవం లేని జీవీఎల్ చర్చలో పాల్గొంటే, వచ్చే ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా జీవీఎల్ చర్చల్లో పాల్గొంటే.. రాజధానిపై ఆయన తన పాత వైఖరిని కూడా వెల్లడించే అవకాశం లేకపోలేదంటున్నారు. దానివల్ల రాజధాని రైతులు, రాజధాని కొనసాగింపు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో ఇరు పార్టీలు కలసి చేయనున్న జమిలి పోరాటాలకు సంబంధించిన చర్చలు, పట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషిస్తున్నారు. పైగా జీవీఎల్ ఇప్పటిదాకా  జగన్ సర్కారు విధానాలను.. రాష్ట్ర బిజెపి నేతల మాదిరిగా విమర్శించిన దాఖలాలు లేవని, ఆయన ఇప్పటికీ గత ప్రభుత్వ విధానాలనే విమర్శిస్తున్నారంటే.. జనసేనతో జరిపే చర్చలో కూడా,  జీవీఎల్ వైఖరి ఎలా ఉంటుందో పెద్దగా వివరించాల్సిన అవసరం లేదంటున్నారు.పైగా.. రాష్ట్రం నుంచి బిజెపిలో చేరిన ఇద్దరు ఎంపీలలో ఒకరైన సుజనాచౌదరి కేంద్రమంత్రిగా పనిచేయగా, మరొక ఎంపి సీఎం రమేష్ రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. వారిద్దరినీ చర్చలకు దూరంగా ఉంచడం వల్ల, కొత్తగా పార్టీలో చేరిన నేతలకు ప్రాధాన్యం లేదన్న సంకేతాలు వెళ్లే ప్రమాదం లేకపోలేదంటున్నారు. ఎంపి స్థాయి వ్యక్తులను పార్టీ సొంతం చేసుకుని, వారినే విశ్వసించకపోతే ఇక తమలాంటి వారి పరిస్థితేమిటని.. ఇతర పార్టీల నుంచి వచ్చే సీనియర్లు పునరాలోచిస్తే, ఇక పార్టీలో ఎవరు చేరతారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.