ఆంధ్రోళ్ల మౌనంపై…సుజనాకు కోపమొచ్చింది!

339

(మార్తి సుబ్రహ్మణ్యం)
కేంద్రమాజీ మంత్రి, బిజెపి నేత సుజనా చౌదరికి ఆంధ్రోళ్ల మౌనంపై కోపం వచ్చింది. రాజధాని తరలింపుపై వారి నిస్సహాయత, అనైక్యతపై చిరాకేసింది. రాజ్యసభ సభ్యుడైన సుజనా చాలాకాలం నుంచి రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఆ విషయంలో ఆయన కూడా బిజెపి దళపతి కన్నా లక్ష్మీనారాయణ బాటలోనే పయనిస్తున్నారు. రాజధానిని అంగుళం కూడా అక్కడి నుంచి కదిలించేది లేదని రాజధాని రైతులకు హామీ ఇచ్చారు. తాను కేంద్రం, బిజెపి నాయకత్వంతో మాట్లాడిన తర్వాతనే ఈ విషయం చెబుతున్నానన్నారు.
మళ్లీ తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, అమరావతి రాజధాని కోసం అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనకు, మిగిలిన వారు దూరంగా ఉంటున్న వైనం మనస్తాపం చెందినట్లున్నారు. ఇలా మౌనంగా ఉండటం మంచిదికాదని, ఇంత నియంతృత్వ పాలనను ఎదిరించకపోతే ఇక ఇక్కడ ఉండటం కూడా అనవసరమని, ఏదైనా ప్రాంతానికి వెళ్లడం మంచిదని భావోద్వేగానికి గురయ్యారు. అసలు తమకు ఈ పదవులు కూడా అనవసమని తేల్చాశారు. అలా ఆంధ్రుల పలాయనవాదంపై ఆయన ఉద్వేగ ప్రసంగం సాగింది. బహుశా.. 29 గ్రామాల రైతుల ఆందోళనకు మిగిలిన వారు మద్దతునివ్వకుండా మౌనంగా ఉండటం, మూడు రాజధానులకు సంబంధించి జగన్ ప్రతిపాదనపై మిగిలిన ప్రాంతాల వారెవరూ రోడ్డెక్కకపోవడాన్ని చూసి సుజనా ఆ విధంగా స్పందించి ఉంటారు. ఇది కూడా చదవండి.. ‘సిగ్గులేని సమాజమిది’! రైతులపై లాఠీచార్జి, మహిళలపై పోలీసుల దురుసు ప్రవర్తన చూసి, మనం ఆంధ్రలో ఉన్నామా? ఆప్ఘనిస్తాన్‌లో ఉన్నామా? అని ప్రశ్నించారు. అయితే, ఉదయం ఆయన ఆవేదనకు బిజెపి రాష్ట్ర కమిటీ స్పందించి, అమరావతిలోనే రాజధాని ఉండాలన్నది తమ పార్టీ విధానమని సాయంత్రానికి స్పష్టం చేసిందనుకోండి. అది వేరే విషయం.
నిజమే. సుజనా ఆవేదన, ఆవేశం, భావోద్వేగాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదు. కాకపోతే ఆంధ్రుల మనస్తత్వాన్ని అర్ధం చేసుకోకుండా, వారి స్వార్థపర వైఖరిని అంచనా వేయకుండా, వారి గురించి ఎక్కువగా ఊహిండమే తప్పు. ఆంధ్రులు ఎప్పుడూ తెలంగాణ ప్రజల మాదిరిగా చైతన్యశీలురు కాదు. పేదవారు అంతకన్నా కాదు. మా ఇంటికొస్తే ఏం తెస్తారు? మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అనే మనస్తత్వం నరనరాన జీర్ణించుకున్న వారు. నా చిన్న బొజ్జకు శ్రీరామరక్ష అనుకునేవాళ్లు. సమాజం గురించి కాకుండా కులం గురించి ఆలోచిస్తారు. సమైక్య రాష్ట్రం విడిపోయిన సమయంలో.. తెలంగాణ కోసం తెలంగాణ సమాజం యావత్తూ రోడ్డెక్కితే, ఆంధ్ర ప్రజలు మాత్రం ఎవరి వ్యాపారాలు వారు చేసుకున్నారు. ఉద్యమించిన ఎంపీలకూ వ్యాపారులుండటంతో, వారు దానిని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ తెలంగాణ నేతలు మాత్రం పార్టీలను పక్కనపెట్టి, తెలంగాణ కోసం పోరాడి అనుకున్నది సాధించారు.
ఇప్పుడు విడిపోయిన ఏపీని మళ్లీ రాజధానులుగా విడగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై, ఆంధ్రా ప్రజలు అదే చైతన్య రహితంగా ఉండటం బహుశా సుజనాకు నచ్చినట్లు లేదు. మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేస్తున్నా, ఆంధ్రా సమాజంలో చైతన్యం కనిపించకపోవడం ఆయనను మనస్తాపానికి గురి చేసి ఉండవచ్చు. కానీ, ఎప్పుడో హైదరాబాద్‌లో స్థిరపడిన సుజనా.. ఆంధ్రుల మనస్తత్వాన్ని అధ్యయనం చేయకుండా, వారిలో తెలంగాణ ప్రజలను చూడటమే తప్పున్నర తప్పు. రాజధానిపై 29 గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళన 30వ గ్రామానికి ఎందుకు విస్తరించలేదంటే దానికి కారణం… మన భూములు అక్కడ లేవు. మనం అక్కడ భూమి కొనేదీ లేదన్న సంకుచిత మనస్తత్వమేనన్న విషయం సుజనా గ్రహించకపోవడం విచారకరం. ఎంపీగా మరో ఐదేళ్ల పదవీ కాలం ఉండి, హైదరాబాద్‌లో ఉంటున్న ఆయనకే.. ఇంత అన్యాయం జరుగుతుంటే ఎదిరించకపోతే ఇక ఈ పదవులు ఎందుకన్న ఆవే శం వచ్చింది. మరి అక్కడే ఉండే ఆంధ్రా ప్రజల రక్తం ఇంకెంత మరిగిపోవాలి? పౌరుషం ఏ స్థాయిలో ముంచుకురావాలి? కానీ, అలా మరగడం బదులు అసలు తమలో రక్తం ఉందన్న విషయాన్ని కూడా వారు మర్చిపోతే, ఇక వారి నుంచి ధీరత్వం ఆశించడం అమాయకత్వం. గుడ్డిలో మెల్లగా… రాజధానిని అక్కడే ఉంచాలన్న తన వాదనను కన్నా లక్ష్మీనారాయణ అండ్ కో బలపరిచి.. ఆ మేరకు తీర్మానించినందుకు సుజనా మురిసిపోవాలి. జీవీఎల్ వంటి ఒకరిద్దరు నాయకుల అభ్యంతరాలను లెక్కచేయకుండా, రాజధాని విషయంలో కమలదళం ఒకే తాటిపైకి రావడం వరకూ సంతోషించాలి. కాబట్టి ఆంధ్రుల ఆత్మగౌరవం, పౌరుషం గురించి సుజనా ఎంత తక్కువ ఊహిస్తే అంత మంచిది. ఆశ మంచిదే. కానీ అత్యాశ పనికిరాదు. అదీ ఆంధ్రుల విషయంలో!