మున్సి‘పల్స్’ పట్టేదెవరు?

548

టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపికి అగ్నిపరీక్ష
అసలు గెలిచిన తర్వాత నిలిచేదెవరు?
ఇరకాటంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు
తెలంగాణలో స్థానిక సమరంపై సస్పెన్స్

( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో స్థానిక పోరుకు తెరలేచిన నేపథ్యంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు అవి అగ్నిపరీక్షలా పరిణమించాయి. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, ప్రత్యామ్నాయం కోసం పోరాడుతున్న కాంగ్రెస్, బిజెపిలలో మున్సి‘పల్స్’ పట్టేదెవరన్న ఉత్కంఠ మొదలయింది. నామినేషన్ల పర్వానికి ముందే జంపింగులు మొదలయిన తీరు.. ఫలితాల తర్వాత అసలు ఎంతమంది విజే తలు ఆయా పార్టీల్లో ఉంటారన్న మరో బెంగ పార్టీ నాయకత్వాలకు పట్టుకుంది.
సచివులు, ఎమ్మెల్యేల సత్తాకు అగ్నిపరీక్ష
ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు… తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇరకాటంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు, ఓటములకు ఎమ్మెల్యేలదే బాధ్యత అని, పనితనం చూపని మంత్రులను తొలగిస్తానని కేసీఆర్ చేసిన హెచ్చరిక వారిలో మరింత ఆందోళన పెంచుతోంది. రిజర్వేషన్ల ఖరారు తర్వాత సొంత పార్టీలో పెరుగుతున్న ఒత్తిళ్లకు, ఎమ్మెల్యేలు తాళలేకపోతున్నారు. అటు పార్టీ నాయకత్వం అన్ని స్థాయిల్లోనూ యంత్రాంగాన్ని దింపి, ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తుండటం, ఇటు ఫలితం రాకపోతే తమ భవిష్యత్తేమిటన్న బెంగ తెరాస ఎమ్మెల్యేలకు పట్టుకుంది. అభ్యర్ధుల ఎంపికలో మంత్రుల సిఫార్సులను కూడా పట్టించుకోకుండా, గెలుపు గుర్రాలనే ఎంచుకోవాలని సీఎం కేసీఆర్ స్వేచ్ఛ ఇవ్వడమే వారికి కాస్త ఊరట కలిగిస్తోంది. అదే సమయంలో కేటీఆర్ రంగంలోకి దిగుతుండటం గుబులు పెంచుతోంది.
నియోజకవర్గాల్లో నిధులు ఇవ్వక పడకేసిన అభివృద్ధి
అయితే, గత ఏడాది నుంచి నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం, నిధులు లేక జనంలోకి వెళ్లలేని పరిస్థితిలో స్థానిక సమరానికి ఎలా వెళ్లాలో తెరాస ఎమ్మెల్యేలకు పాలుపోకుండా ఉంది. ఎమ్మెల్యేల కోసం నియోజకవర్గ అభివృద్ధి నిధులు 120 కోట్ల రూపాయలు, ప్రత్యేక అభివృద్ధి నిధులు 740 కోట్లు కేటాయించినా, నయాపైసా విడుదల చేయకపోవడంతో తెరాస ఎమ్మెల్యేలు స్థానికంగా విపక్షాల విమర్శలకు జవాబివ్వలేకపోతున్నారు. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఈ ఏడాదిలో సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ నిధులే ఎక్కువగా ఇచ్చారు. ఇక వాటిని ప్రచారం చేసుకోవడం తప్ప, వారికి మరో మార్గం కనిపించడం లేదని తెరాస వర్గాలే చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం ఖాయమని సర్వేలు స్పష్టం చేసిన విషయాన్ని కేసీఆర్ చెబుతున్నా.. స్థానిక ఎన్నికల్లో గెలుపే ప్రభుత్వ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. పైగా మరో రెండేళ్లలో దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. పైగా స్థానిక అభివృద్ధి, వ్యక్తుల ఆధారంగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు చాలా తెలివిగా తీర్పు ఇస్తారు. వీటికి మించి.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వ ప్రతిభకు ఇవి మరో పరీక్ష. సీఎం కేసీఆర్ ప్రచారానికి రానని చెప్పడంతో, ప్రచార బాధ్యతలు కేటీఆర్ నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్ ఎంపిలు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు నియోజకవర్గ పరిథిలోని మున్సిపాలిటీలు చేజిక్కించుకోవడం కేటీఆర్ నాయకత్వానికి పెద్ద సవాల్. ఇక ఈ ఫలితాలతో అటు సచివుల సత్తా ఏమిటన్నదీ బయటపడుతుంది.
కాంగ్రెస్ సీనియర్లకు సవాలే
ఇక కాంగ్రెస్ పార్టీ తన అదృష్టాన్ని రెండోసారి పరీక్షించుకుంటోంది. నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష. ఈ ఎన్నికల తర్వాత తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేసినందున, ఎన్నికల గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఆయనకు సంబంధం ఉండదు. ఇక ఉత్తమ్ వారసుడిగా ఎంపి రేవంత్‌రెడ్డి వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుండటం, ప్రచారంలో కూడా ఆయనే కీలకపాత్ర పోషిస్తుండటంతో… స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పరోక్షంగా అటు రేవంత్‌కూ పరీక్షగా మారనున్నాయి. జానారెడ్డి, మల్లు, జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు వంటి అగ్రనేతలంతా అప్పుడే కార్యక్షేత్రంలో దిగినందున.. ఎన్నికల్లో కాంగ్రెస్ సీరియస్‌గానే పనిచేస్తుందని స్పష్టమవుతూనే ఉంది. పైగా ఈ ఎన్నికలు వారికి సైతం స్థానికంగా సవాలే. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకోకపోతే, అసమర్థనేతలుగా ముద్రపడటం ఖాయం కాబట్టి, సీనియర్లంతా శ్రమటోడ్చాలిందే. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఫలితాలు రాబట్టకపోతే, మెజారిటీ కార్యకర్తలు, ద్వితీయ స్థాయి నేతలు తెరాసకు జంపయిపోవడం ఖాయం. అదే గెలిచి నిలిస్తే, తటస్థంగా ఉన్న వారితోపాటు, నిస్తేజంగా ఉన్న క్యాడర్‌లో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నది నిజం.
కమలం వికసిస్తేనే భవిష్యత్తు

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా, తెరాసకు తామే పోటీ అని ప్రచారం చేసుకుంటున్న బిజెపి సత్తాకు స్థానిక ఎన్నికలు అగ్నిపరీక్ష. ఎందుకంటే గత పార్లమెంటు ఎన్నికల్లో నాలుగుస్థానాల్లో విజయం, టిడిపి ఎంపి గరికపాటి మోహన్‌రావు, మాజీ మంత్రి డికె అరుణ, తాజాగా మోత్కుపల్లి, ఇతర టిడిపి అగ్రనేతలు ఆ పార్టీలో చేరిన తర్వాత ఉత్సాహం పొంగుతోంది. కేంద్రమంత్రులు కూడా ఇటీవలి కాలంలో తరచూ రాష్ట్రానికి వచ్చి, క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దూకుడుగా వెళుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విస్తృత స్థాయిలో పర్యటిస్తూ శ్రేణులలో ధైర్యం నూరిపోస్తున్నారు. ఎంపి బండి సంజయ్ ఇటీవలి కాలంలో తెరాసను లక్ష్యంగా చేసుకుని విసురుతున్న ఆరోపణాస్త్రాలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఇప్పుడున్న ఎంపీలలో సంజయ్ దూకుడుగా వెళుతున్నారు. ఇప్పటివరకూ అర్బన్ ప్రాంతాల్లోనే బలం ఉందని భావిస్తున్న బిజెపి ఫలితాలలో దానిని రుజువుచేసుకోవలసి ఉంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో బిజెపికి నోటా కంటే తక్కువ ఓట్లు రావడం తెలిసిందే.గతంలో టిడిపితో కలసి పోటీ చేసి, ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన బిజెపి, గత ఎన్నికల్లో ఒకటితోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో ఎన్నికలు లే కపోవడం, ఉమ్మడి రంగారెడ్డిలో కేవలం కొన్ని మున్సిపాలిటీలకే బలం పరిమితం కావడం, బిజెపి నాయకత్వానికి ఈ ఎన్నికలు సవాలుగా పరిణమించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోతే, ఆ ప్రభావం బిజెపిలో చేరాలనుకునే నేతలు, కింది స్ధాయిలో ఉన్న వివిధ పార్టీ నేతలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా గంగాపురం కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో, అటు ఆయనకూ ఇవి ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి.
సైకిల్ ఖాతా తెరిచేది ఎన్ని చోట్లనో?
ఇక తెలుగుదేశం పార్టీ అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేస్తానని చెప్పినప్పటికీ, ఎన్నిచోట్ల ఖాతా తెరుస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే 60 శాతం క్యాడర్ తెరాసలో చేరిపోగా, తాజాగా గరికపాటి మోహన్‌రావు చేరికతో 30 శాతం మంది బిజెపిలో చేరిపోయారు. పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ నాయకత్వంపై పార్టీలో వ్యతిరేకత ఉంది. గత ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలయినా, ఆయన రాజీనామా చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. నామమాత్రంగా మారిన పార్టీలో ఉత్సాహం పెంచాల్సింది పోయి, తానే ఓ వర్గానికి నాయకుడిగా వ్యవహరిస్తూ పార్టీ ఎదుగుదలకు అడ్డుగోడలా నిలిచారని, పార్టీలో మిగిలిపోయిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు చంద్రబాబు ఆదేశాలనూ బేఖాతరు చేసే స్థాయికి చేరిన రమణ నాయకత్వంలో, పార్టీ ఎన్నిచోట్ల ఖాతా తెరుస్తుందో చూడాలి.ఇదిలాఉండగా… నామినేషన్ల పర్వంలో ఎగసిపడుతున్న తిరుగుబాట్లు, కప్పదాట్లు చూస్తుంటే ఫలితాల తర్వాత వారిలో ఎంతమంది సొంత పార్టీల్లో ఉంటారో, ఎంతమంది ఇతర పార్టీలకు జంపయిపోతారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. కేసీఆర్, కేటీఆర్ స్థాయి నేతలు చేస్తున్న హెచ్చరికలనే పట్టించుకోని స్థానిక నేతలు, రేపు ఫలితాలు వచ్చిన తర్వాత తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరినీ ఖాతరు చేయరన్నది స్పష్టమవుతూనే ఉంది. చైర్మన్లు, మేయర్ల ఎంపిక సమయంలో, ఈ బాపతు నేతలంతా గోడ దూకరన్న గ్యారంటీ కనిపించకపోవడంతో అన్ని పార్టీలకూ ఈ అంశం తలనొప్పిలా తయారయింది.