అవును.. వాళ్లు పెయిడ్ ఆర్టిస్టులే.. అయితే ఏంటి?

637

పార్టీ గళమే విప్పానన్న పృధ్వీరాజ్
మరి పోసాని దారెటు?

(మార్తి సుబ్రహ్మణ్యం)

మెంటల్‌కృష్ణ.. పోసాని కృష్ణమురళీకి మహా చిక్కొచ్చి పడింది. సాటి నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీరాజ్ అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులని చేసిన వ్యాఖ్యలపై పోసాని అగ్గిరాముడయ్యారు. కమ్మవాళ్లను అంత మాటలంటావా? ముందు వాళ్లకు సారీ చెప్పమని కృష్ణమురళి ప్రెస్‌మీట్‌లో కన్నెర్ర చేశారు. అసలు పృధ్వీలాంటి వాళ్ల వల్లనే జగన్ బద్నాం అవుతున్నారని మండిపడ్డారు. ఒకవేళ పృధ్వీ వ్యాఖ్య పార్టీ విధానమయితే తన నిర్ణయమేమిటో చెబుతానని హెచ్చరించారు. ఇంకేముంది? ఎన్నికల సమయంలో తోటి కమ్మవారిని కాదని రెడ్డి పార్టీ అయిన తనకు మద్దతునిచ్చిన పోసానిని చల్లబరిచేందుకు, వైసీపీ అధినేత జగన్.. ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీని పిలిచి ముక్క చీవాట్లు పెట్టి, సారీ చెప్పిస్తారని పోసాని సహా అందరూ భావించారు. కానీ అది భ్రమేనని తేలిపోయింది.
అసలు తన వ్యాఖ్యలు పార్టీ విధానమేనని, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గానే తాను ఆ వ్యాఖ్యలు చేశానని పృధ్వీ కుండబద్దలు కొట్టారు. అంతేనా? వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులే. అందులో నాతో కలసి నటించిన వాళ్లూ ఉన్నారు. కాబట్టి సారీ చెప్పే సమస్యే లేదని పృధ్వీ లెక్కలేకుండా మాట్లాడి పోసానికి ఘాటు కౌంటరిచ్చారు. పోసాని విమర్శలను ఆశీర్వాదంగానే భావిస్తా. నా మాటలకు నేను కట్టుబడి ఉంటా. నేను కమ్మ వారిని అనలేదు. రైతులంటే నాకు గౌరవం. అమరావతిలో ఆందోళన చేస్తున్నది పెయిడ్ ఆర్టిస్టులే. అందులో నాతో పాటు నటించిన వారూ ఉన్నార’ని పృధ్వీ తన వైఖరిని సమర్ధించుకోవడం పోసానిని మరింత రెచ్చగొట్టినట్టయింది.
అసలే పోసాని ‘మెంటల్ కృష్ణ’. ఆయనను కెలికి లోకేష్, చంద్రబాబే డామేజయిపోయారు.ఆయన నోటికి జడిసి టిడిపి సోషల్ మీడియా జవాన్లే మనకెందుకని కూర్చున్నారు. మరి పృధ్వీ లాంటి సామాన్యుడు కెలికితే మన మెంటల్‌కృష్ణ ఊరకనే కూర్చుంటారా? మళ్లీ ఇంకో ప్రెస్‌మీటు పెట్టి, ఈసారి జగన్‌నే ఉతికి ఆరేయకుండా ఉంటారా? అలాంటి వాళ్లు నీ పక్కన ఉంటే నీ ఇమేజ్ సంగతేమిటని జగన్ననను కడిగేయకుండా ఉంటారా? పార్టీ కోసం అంత చేసి, తోటి కమ్మ వారితో కూడా కయ్యం పెట్టుకుని నీకు అంత శ్రమదానం చేస్తే.. నీ పార్టీ వాళ్లు నాకు ఇచ్చే మర్యాద, మన్నన ఇదేనా అంటూ ఏకంగా జగన్‌నే దూదేకినట్లు ఏకకుండా ఊరుకుంటారా? అన్నది మెంటల్ కృష్ణ స్వభావం, ఆయన గతంలో మాట్లాడిన అనుభవాలు చూసిన వారికి వచ్చే సందేహాలు.
మరి పోసాని తన సహజస్వభావానికి అనుగుణ ంగా వెళతారా? లేక మన పార్టీవాడే కదా.. జగన్ మొహం చూసి వదిలేస్తున్నానని చెబుతారా? అన్నది చూడాలి. ఒకవేళ పోసానికి ఎక్కడో కాలినా, దానిపై జగన్‌తో తేల్చుకోవాలనుకున్నా.. జగన్ మంత్రులకే దొరకరు. ఇక పోసానికేం దొరుకుతారు? అప్పుడంటే పాదయాత్ర కాబట్టి వెళ్లి సులభంగా కలసి ముచ్చట్లాడారు. ఇప్పుడు సీఎం కాబట్టి, మళ్లీ ఆయనను కలవడం అంత వీజీ కాదు. ఏదేమైనా పాపం పోసానికి మహా చెడ్డ ఇబ్బందే వచ్చింది. తన ప్రాంత రైతులను, తన సాటి కులస్తులను పెయిడ్ ఆర్టిస్టులన్న వైసీపీ నేతలను సహించి ఊరుకుంటే, తన వారి ముందు చేతకాని వారిలా మిగిలిపోతాడు. ఇప్పటికే సొంత కులంలో శత్రువయిపోయారు. అలాకాదని వైసీపీని విమర్శిస్తే, అటు ఉన్న కాస్త మద్దతుకూడా పోతుంది. మరి ‘మెంటల్‌కృష్ణ’ ఏం చేస్తారో చూడాలి!