అమరావతి ఆటలో బిజెపి గెలుస్తుందా?

652

రాజధానిపై మోదీకి జగన్ ముందస్తుగా చెప్పారా?
తరలింపుపై బిజెపి నేతల దారులు వేరు కూడా వ్యూహమేనా?
వచ్చిన అవకాశం విడుచుకుంటోందా?
ఏపీపై బిజెపి, సంఘ్‌కు అవగాహన లేదా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

అమరావతి రాజధాని తరలింపు ఆటలో బిజెపి గెలుస్తుందా? ఓడి ఆటలో అరటిపండవుతుందా? అసలు ఇదంతా కేంద్రంలోని బిజెపి ఆడిస్తున్న ఆటలో భాగమేనా? రాజధానిని తరలిస్తున్నానని జగన్ ముందుగానే మోదీకి చెప్పి, దానినే అమలు చేస్తున్నారా? రాజధానిపై బిజెపి నేతల విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? ఇది కూడా బిజెపి ఆటలో భాగమేనా? అలా కాకపోతే ఇప్పటివరకూ బిజెపి కేంద్ర నాయకత్వం, ఎందుకు అధికారంగా స్పందించడం లేదు. అసలు రాజధాని తరలింపు రూపంలో బిజెపికి వచ్చిన అవకాశాన్ని, ఆ పార్టీ నాయకత్వం ఆంధ్రపై అవగాహన లేకుండా దూరం చేసుకుంటోందా?.. ఇవీ ఇప్పుడు జరుగుతున్న చర్చ.అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలించే అంశంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో, ఇప్పటిదాకా దానిపై బిజెపి కేంద్ర నాయకత్వం పెదవి విప్పకపోవడం ఆశ్చర్యం. గతంలో విభజనకు ముందు ఒక ఓటు-రెండు రాష్ట్రాలు, ఆ తర్వాత రెండు రాష్ట్రాలపై స్పష్టమైన విధానం ప్రకటించిన బిజెపి నాయకత్వం, ఇప్పుడు రాష్ట్ర రాజధాని తరలింపు అంశంపై అలజడి చెలరేగుతున్నా, మౌనంగా ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు కూడా సాధించలేని బిజెపి.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కావాలనే వేచి చూస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు బిజెపినే రాజధాని సెగతో చలి కాచుకుంటోందన్న మరికొన్ని అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
రాజధానిపై రాష్ట్ర బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సహా సీమ, కోస్తా నేతలంతా ఒక దారిలో నడుస్తుంటే, టిజి వెంకటేష్ వంటి సీమ నేత మాత్రం కర్నూలు రాజధాని కావాలని గళం విప్పుతున్నారు. ఎంపి సుజనాచౌదరి కూడా కన్నా వైఖరినే బలపరుస్తుంటే, గుంటూరుకు చెందిన యుపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు మాత్రం భిన్నమైన ప్రకటలు చేస్తూ అయోమయం సృష్టిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు తోటి ఎంపీలను అవమానించేలా ఉన్నాయన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనివల్ల రాజధానిపై రాష్ట్ర బిజెపి నాయకుల్లో ఐకమత్యం లేదని, దానిపై చీలిపోయారని స్పష్టమవుతోంది. నిజానికి రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిళ్లపై పార్టీ నాయకత్వానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎలాంటి స్పందన లేక పోవడంతో.. హిందు సంస్థలే సొంతగా ఉద్యమాలు చేస్తున్నాయని బిజెపి నేతలు చెబుతున్నారు. బిజెపి ధార్మిక సెల్, అఖిల భారత హిందూ మహాసభ, వీహెచ్‌పి మాత్రమే మతపరమైన అంశాల పై వెంటనే స్పందిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.
రాజధాని తరలింపు అంశంపై తమ రాష్ట్ర నేతలు తలో దానిలో వెళుతున్నాయంటూ రాష్ట్ర, జాతీయ మీడియా కథనాలు రాస్తున్నా.. నాయకత్వంలో చలనం లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నిజానికి ఇలాంటి సున్నిత, రాజకీయ అంశాలపై కేంద్ర నాయకత్వం వెంటనే స్పందించి, తన వైఖరేమిటో స్పష్టం చేస్తుంది. మౌనంగా ఉందంటే దానర్ధం ఆ రాష్ట్రంపై నాయకత్వానికి అవగాహన లేకపోయినా ఉండాలి. లేదంటే తనకు అన్నీ తెలిసే జరుగుతూ ఉండాలి. అమరావతి అంశంలో బిజెపి వ్యవహారశైలి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండి తీరాలి. అలాకాకుండా..జరుగుతున్న పరిణామాలపై వేచిచూసి, తనకు రాజకీయ ప్రయోజనం చేకూరేవరకూ ఆటను కొనసాగించడమే మంచిదన్న రాజకీయ వ్యూహమైనా ఉండాలి. అయితే.. అమరావతి మార్పుపై సీఎం జగన్ ముందుగానే మోదీకి సమాచారం ఇచ్చారని, ఆయన అనుమతితోనే ఈ ప్రక్రియ కొనసాగుతోందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో మోదీ-జగన్ భేటీ సందర్భంలో.. అమరావతి రాజధాని కేంద్రంగా జరిగిన అవినీతి వివరాలను జగన్ ప్రధానికి వివరించారని, అప్పుడే జగన్ రాజధాని తరలింపుపై తన మనసులో మాట బయటపెట్టగా, ప్రధాని అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నది ఆ ప్రచార సారాంశం.
ఒకవేళ అదే నిజమైతే బిజెపి రాష్ట్ర నాయకత్వం, రాజధానిని అక్కడే ఉంచాలంటూ ఎందుకు ఆందోళన చేస్తుంది? జాతీయ నాయకత్వం అనుమతి లేకుండనే రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు అమరావతిలో ఎందుకు ధర్నా చేస్తారు? మరి అదే సమయంలో జీవీఎల్ అమరావతిపై చేసిన గందరగోళ ప్రకటనలను నాయకత్వం ఎందుకు ఖండించలేదు? రాజధాని అక్కడే ఉంటుందని ఎంపి సుజనా చౌదరి ఏ ధైర్యంతో ప్రకటించారు? అసలు బిజెపి జాతీయ దళపతి అమిత్‌షాగానీ, నద్దా గానీ ఇప్పటిదాకా పార్టీ వైఖరిపై పెదవి విప్పలేదంటే వారు రాజధాని తరలింపును ఆమోదిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? నిజంగా ఆమోదిస్తే దానిని అధికారికంగా ప్రకటి ంచవచ్చు కదా? అన్న ప్రశ్నలు పార్టీ శ్రే ణులను గందరగోళంలో పడేస్తున్నాయి. అయితే.. రాష్ట్రానికి చెందిన కొందరు అగ్రనేతలు జగన్ ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని, వారికి ప్రభుత్వపరంగా కావలసిన సదుపాయాలు సమకూరుతున్నాయన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లో అంతర్గతంగా వినిపిస్తున్నాయి. ఒక జాతీయ ప్రముఖుడు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా సర్కారీ సేవలు విస్తృతంగా లభిస్తున్నాయని, ఆయన వచ్చి ఢిల్లీ వెళ్లేవరకూ పోలీసు ఎస్కార్ట్, పైలట్ కార్లు ఉంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఆయన ఢిల్లీలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ప్రముఖుడితో టచ్‌లో ఉంటున్నారని, చంద్రబాబుపై ఉన్న వ్యక్తిగత కోపం ఇక్కడ వారి స్నేహానికి కారణమయిందంటున్నారు. అందుకే బాబు అధికారం కోల్పోయి ఏడు నెలలవుతున్నా, ఇప్పటికీ ఆయననే విమర్శిస్తున్నారని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
నిజానికి ఈ విషయంలో గతంలో జరిగిన గందరగోళమే కనిపిస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బిజెపిలో టిడిపి అనుకూల-వ్యతిరేక వర్గాలుండేవి. బాబు వ్యతిరేక వర్గం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేసేది. బాహాటంగానే మీడియాలో విమర్శలు గుప్పించేది. బాబు సర్కారులో పనిచేసిన ఒక బిజెపి మంత్రి మానసికంగా టిడిపి నేతగానే పనిచేసేవారన్న విమర్శలుండేవి. అనంతపురంలో ఆయన మరో బిజెపి ప్రముఖుడితో కలసి, భారీ స్థాయిలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసి బాగా గడించారన్న ఆరోపణలుండేవి. ఆ సమయంలో టిడిపి నేతలకంటే వారే ఎక్కువ సంపాదించుకున్నారన్న వ్యాఖ్యలు వినిపించాయి.
మధ్య తరగతి వర్గం నుంచి వచ్చిన మరో మంత్రి, తనకు పదవి వచ్చిన తర్వాత సొంత పట్టణంలో బావమరిదిని అడ్డం పెట్టి భారీగా సంపాదించారని, ప్రభుత్వంలో కూడా బాగా పనులు చేసుకున్నారన్న ఆరోపణలు అప్పట్లోనే వినిపించిన విషయం తెలిసిందే. నాడు ఈశాన్య రాష్ట్రాలు ఏపీ చేపలను నిషేధించినప్పుడు, ఈయనే ఆక్వా లాబీని ఢిల్లీకి తీసుకువెళ్లి, భారీ స్థాయిలో పైరవీ చేశారన్న ఆరోపణలు వినిపించాయి. వీరంతా బిజెపి జాతీయ నేత వద్దకు వెళ్లిన సందర్భంలో, ఆయనకు భారీగా ముట్టచెప్పినందుకే ఈశాన్య రాష్ట్రాలు చేపలపై నిషేధం ఎత్తివేశాయని ఆక్వాలాబీ వ్యాపారులు, బహిరంగంగానే తమ చర్చల్లో మాట్లాడుకున్న వైనం మీడియాలోనూ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా జగన్ అనుకూల-వ్యతిరేక వర్గాలుగా బిజెపి చీలిపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొందరు అగ్రనేతలు ప్రభుత్వానికి దగ్గరగా ఉంటూ పనులు చేసుకుంటుంటే, మరికొందరు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటున్నారు.
రాజధాని తరలింపుపై బిజెపి నాయకత్వ మౌనం వ్యూహాత్మకమా? కాదా? అన్నది పక్కకుపెడితే.. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో, విఫలమవుతున్నామన్న ఆవేదన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. నిజానికి శుక్రవారం మహిళా భక్తులను అడ్డుకున్న వైనం తర్వాత జరిగిన పరిణామాల్లో, తమ కంటే టిడిపినే ఎక్కువ రాజకీయ ప్రయోజనం పొందిందని బిజెపి నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ విషయంలో తాము వాడాల్సిన హిందూ మతం, ఆధ్మాత్మిక కార్డును టిడిపి వాడుతుందంటే తాము ఏ స్థాయిలో చైతన్యరహితంగా, దిశానిర్దేశం లేకుండా ఉన్నామో స్పష్టమవుతోందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నాటి ఘటన తర్వాత బిజెపి నేతల కంటే, ధార్మికసెల్ వేగంగా స్పందించింది. కనకదుర్గమ్మ గుడికి వెళుతున్న మహిళలను అడ్డుకున్నారని తెలిసిన తర్వాత.. ధార్మిక సెల్ అధ్యక్షుడు తూములూరి చైతన్య, బిజెపి అధికార ప్రతినిధి కోట శేష సాయి అమరావతికి వెళ్లారు. మతపరమైన అంశాలపై బిజెపి పార్టీ కంటే ధార్మిక సెల్ ఎక్కువగా స్పందిస్తోందని, హిందుమతంపై పేటెంట్ ఉన్న తమ పార్టీ కంటే.. ఆ అంశంలో కమలానంద భారతి స్వామి, అఖిల భారత హిందూమహాసభ అద్భుతంగా పనిచేస్తున్నారంటే, తమ పార్టీ ఎంత సైద్ధాంతిక గందరగోళంలో ఉందో అర్ధమవుతోందంటున్నారు.
కాగా బిజెపితో పాటు, దానికి మార్గదర్శి అయిన ఆరెస్సెస్‌కూ ఏపీపై పెద్ద అవగాహన లేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కొద్దికాలం క్రితం వరకూ తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ఒక జాతీయ నాయకుడి ఇష్టానికి వదిలేసిన ఫలితంగా, రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎదగలేకుండా చతికిల పడిందని గుర్తు చేస్తున్నారు. దానిని టిడిపికి తోక పార్టీగా మార్చారని, ఆయన పుణ్యమే ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాలలోని పార్టీ నేతలు జాతీయ స్థాయికి వెళ్లలేకపోయారని విశ్లేషిస్తున్నారు. పోనీ టిడిపి నుంచి విడిపోయిన తర్వాతయినా, పార్టీని సరైన దిశలో నడిపించారా అంటే అదీ లేదంటున్నారు. తొలిరోజుల్లో జగన్‌తో చెట్టపట్టాలేసుకుని, తర్వాత మళ్లీ యుద్ధం చేస్తున్నామంటున్నారు. ఎన్నికల ముందు మిత్రుడిగా ఉన్న జగన్ ఇప్పుడు శత్రుపక్షమో, మిత్రపక్షమో తమకే అర్ధం కావడం లేదని వాపోతున్నారు. ఇవన్నీ తమ జాతీయ నాయకత్వ అవగాహనరాహిత్యానికి నిదర్శనమంటున్నారు.
పార్టీని నడిపిస్తున్న సంఘ్ నేతలకు రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణలపై అవగాహనే లేదంటున్నారు. ఏపీలో ఉన్న కుల రాజకీయాలను అర్ధం చేసుకుని, దానికి ప్రత్యామ్నాయ ఎత్తుగడ దిశగా పార్టీని నడిపించడం సంఘ్‌కు సాధ్యం కావడం లేదంటున్నారు. ‘ దేశంలోని రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు. ఏపీ ఒక ఎత్తు. ఇక్కడ అంతా కులరాజకీయాలే. ఏపీలో హిందూవాదం పనిచేయదు. పనిచేసేదల్లా కులరాజకీయాలే. క్రైస్తవులు, ముస్లిములు జగన్‌కు బలమైన ఓటు బ్యాంకు. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడకూడదు. కానీ మా పార్టీ అసలు ఏ ఆట ఆడుతుందో కూడా అర్ధం కావడం లేదు. మత మార్పిళ్లు, శాఖల సంఖ్య పెంపుపై చేస్తున్న సంఘ్ చేస్తున్న కృషి అద్భుతం. కానీ రాజకీయ వ్యూహాల్లో మాత్రం సున్నా. నాలుగురోజుల క్రితం తెనాలిలో పౌరసత్వ సవర చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో సంఘ్ నేత శ్రీనివాస్‌పై దాడి జరిగితే, ఆశించిన ప్రతిస్పందన లేదు. ఈ రాష్ట్రంలో సంఘ్ సహజ విధానాలు పనిచేయవు. ఒక్కముక్కలో ఉండాలంటే ఒక ప్రాంతీయ పార్టీ మాదిరిగా, ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకునేలా ఉండాలి. ఢీ అంటే ఢీ అనే స్థాయిలో రాజకీయ పోరాటం ఉండాలి. ఆ స్థాయి నేతలను ఉండాలి. లేదా తయారుచేయాలి. అది చేసేవారే కాదు. ఆ తత్వం, రాజకీయ కోణం ఉన్న వారు కూడా సంఘ్‌లో లేరు. అది లేనంతవరకూ ఈ రాష్ట్రంలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కల్ల’ అని దశాబ్దాల నుంచి పనిచేస్తున్న ఓ బిజెపి సీనియర్ నేత స్పష్టం చేశారు.