పోసాని పాటి దమ్ము తెలుగు హీరోలకేదీ?

546

మహేష్‌కు రాజధాని సెగ
(మార్తి సుబ్రహ్మణ్యం)

పోసాని కృష్ణమురళి… సినిమాలు చూసేవారికి, మీడియాను ఫాలో అయ్యేవారికి పరిచయం అవసరంలేని పేరు! ‘మెంటల్‌కృష్ణ’గా పేరున్న పోసాని ఎవరికీ భయపడరు. కాకానికి చెందిన ఈయన ఎవరినీ కాకా పట్టరు. ఎవరి మెప్పు కోసం పరితపించరు. అనుకున్నది మొహం మీద కుండబద్దలు కొడతారంతే. ఒళ్లు మండితే వాడూ వీడూ అని తేడా లేదు. అందరికీ సామూహికంగా చాకిరేవు పెట్టేస్తారు. ఎవరైనా ఆయనకు నచ్చాలి. నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. లేకపోతే అమాంతం నేలమీద విసిరికొడతారు. గుంటూరు కారం ఆయనలో కనిపిస్తుంటుంది. అంతే! సాటి కమ్మ సినీ ప్రముఖులంతా మానసికంగా టిడిపికి, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుకు జైకొడుతుంటే… పోసాని మాత్రం కమ్మవాళ్లంతా టిడిపికి, చంద్రబాబుకు మద్దతునివ్వాలా? అని నిర్మొహ మాటంగా ప్రశ్నిస్తారు. తనకు కమ్మ కులపిచ్చి, కులగజ్జి లేదని మీడియా ముందే చెప్పేస్తారు. తొలిరోజుల్లో చంద్రబాబుకు ఫుల్‌పేజీ యాడ్స్‌తో జైకొట్టినా, తర్వాత ప్రజారాజ్యంలో చేరి పోటీ చేసి, మళ్లీ పార్టీనే తిట్టినా ఆయనకే చెల్లింది. మళ్లీ జగన్‌తో కలసి పాదయాత్ర చేసి, బాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా, ఏపీలో ఆధార్‌కార్డు లేనివాళ్లంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి, ఉతికి ఆరేసినా పోసానికే చెల్లింది.

‘ప్రస్తుతానికి’ పోసాని జగన్‌కు వీరాభిమాని. మరి ఆయనకూ వైసీపీ తీరుపై యమా కోపమొచ్చేసింది. అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులని సాటి నటుడు, వైసీపీ నేత పృధ్వీరాజ్ అన్నందుకు పోసాని అగ్గిరాముడయ్యారు. మరి రైతుల పట్ల పోసాని పాటి పౌరుషం, చిత్తశుద్ధి తెలుగు హీరోలకు ఏమయింది అన్నదే ప్రశ్న. ఈ అంశంపై ‘సూర్య’ వెబ్‌సైట్‌లో “సిని‘మా’కు తప్పని రాజధాని సెగ“… “రాజధానిపై సినిమా స్టార్లు మాట్లాడరేం? “కథనాలు వెలువ డిన విషయం తెలిసిందే.
ఇంతకూ ఏం జరిగిందంటే… రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తోంది. రోజుకో రూపంలో చేస్తున్న ఆందోళన హింసాత్మక దిశగా సాగుతోంది. చివరకు ఊళ్లలో పోలీసులకు పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులని స్పీకర్ తమ్మినేని సీతారాం నుంచి సినీ నటుడు పృధ్వీరాజ్ వరకూ నిందిస్తున్నారు. అది స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళీకి అస్సలు నచ్చలేదు. దానితో రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న సాటి నటుడు పృధ్వీరాజ్‌పై ఇంతెత్తున ఎగిరిపడ్డారు. తక్షణం వారికి సారీ చెప్పాలని హెచ్చరించారు. పృధ్వీరాజ్ ప్రభుత్వం తరఫునే మాట్లాడారని చెబితే, నా నిర్ణయం నేను తీసుకుంటానని పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. అంటే ఒకవేళ ఇది ప్రభుత్వ వైఖరి అయితే బయటకు వస్తానని చెప్పకనే చెప్పినట్లు అన్నమాట! ఇప్పటివరకూ కమ్మ వారిని ఏమన్నా పట్టించుకోని పోసాని, అమరావతిలో ఆందోళన చేస్తున్న కమ్మ రైతులు, ఇతర సామాజిక వర్గాల రైతులను పెయిడ్ ఆర్టిస్టులని సొంత పార్టీ నేతలు నిందిస్తుండటం నచ్చినట్లు లేదు. రైతులను కూలివారిగా చూడటమే ఆయనకు మండినట్లుంది. ఈ కథనం కూడా చదవండి.. సిని‘మా’కు తప్పని రాజధాని సెగ

‘ పృధ్వీ ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులన్నారు? కమ్మరైతులు, కమ్మ ఆడపడచులునుద్దేశించి అన్నారా? మొత్తం రాజధాని రైతులను అన్నారా? ఎన్టీఆర్, బాబు వల్ల కమ్మవాళ్లు బతకటం లేదు. పొలం పనులు చేసుకుని గౌరవంగా బతుకుతున్న వారిని, పృధ్వీ రోడ్డుమీదకు లాగారు. అక్కడ మూడు పంటలు పండుతాయి. చాలామంది రైతుల పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. రైతులు కార్లు, ఖరీదైన సెల్‌ఫోన్లు కొనుక్కోకూడదా? రాజధానిపై ప్రేమతో 33 వేల ఎకరాలిచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటారా? జగన్‌ను, ప్రభుత్వాన్ని నాశనం చేయడానికే పృధ్వీరాజ్ లాంటి వాళ్లు పుట్టారు. ఇలాంటి వాళ్ల వల్లే సోషల్‌మీడియాలో జగన్‌ను తిడుతున్నార’ని పోసాని చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. అమరావతి రాజధానిపై, దానికోసం ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా మంత్రులు, నేతలు ముద్రవేస్తున్న జగన్ సర్కారు వైఖరి.. సొంత పార్టీ వారికే రుచిండం లేదని స్పష్టమవుతోంది.

సరే.. పోసాని అంటే నటుడు. రచయిత. ఆయన అందరికీ తెలియకపోవచ్చు. కానీ, తెరపైన హీరోయిజం ప్రదర్శించే పెద్ద హీరోలు, నిర్మాతలు, దర్శకుల దమ్ము ఏమయింది? ఏపీలోనే పుట్టిన పెద్ద పెద్ద హీరోలకు పోసానికి ఉన్న దమ్ము, ధైర్యం లేదా? అంటే పెయిడ్ ఆర్టిస్టులని అమరావతి రైతులపై రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని తెలుగు సినిమా పరిశ్రమ అంగీకరిస్తోందా? ఆమేరకు వారి మౌనం అంగీకారమేనా? నందమూరి, ఘట్టమనేని, అక్కినేని, దగ్గుబాటి బాపతు కమ్మ హీరోలకు రైతుల గోడు పట్టదా? ‘కమ్మ’దనం కనిపించని పోసానికి ఉన్న పౌరుషంలో, ‘కమ్మ’దనం కనిపించే ఈ హీరోలలో లేశమాత్రమైనా కనిపించదేం? సినిమా టికెట్ల కోసం మాత్రం రైతులు కావాలా? వారు రోడ్డెక్కితే మాత్రం పట్టించుకోరా? ఇవీ ఫిలింనగర్‌పై వస్తున్న విమర్శలు.

కాస్త ఆలస్యంగా అయినా హైదరాబాద్‌లో ఉన్న సినిమా హీరోలకు రాజధాని సెగ తగలటం ఆసక్తికరంగా మారింది. తెనాలికి చెందిన హీరో మహేష్ ఇంటి వద్ద జై ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి, యువజన పోరాట సమితి కార్యకర్తలు ధర్నా నిర్వహించడం సంచలనం సృష్టించింది. రాజధానిపై మహేష్ స్పందించాలని, సినిమా పరిశ్రమ ఎందుకు మౌనంగా ఉంటుందని నిలదీశారు. ఈరోజు నుంచి 19 రోజులు హీరోల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అమరావతి పరిసర ప్రాంతాల్లోని సినిమా ధియేటర్లను మూసేశారు. తమ ఆందోళనకు హీరోలు మద్దతునివ్వకపోతే సంక్రాంతి సినిమాలు చూడకూడదని తీర్మానించడంతో సినీ పరిశ్రమకు రాజధాని సెగ తగిలినట్టయింది.అన్నట్లు.. సినిమా విప్లవకారులు, రాయలసీమ రామన్న చౌదరి మంచు మోహన్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ అమరావతి రాజధాని తరలింపుపై పెదవి విప్పరేమిటి చెప్మా!? ఈ కథనం కూడా చదవండి.. ‘రాజధానిపై సినిమా స్టార్లు మాట్లాడరేం?’