అమరావతికి అమ్మవారి సెంటి‘మంట’

257

భక్తులను అడ్డుకున్న తీరు బూమెరాంగ్
ఇది హిందువుల మనోభావాలపై దాడి అన్న బిజెపి
క్రైస్తవ రాజ్యంలో హిందువులకు స్థానమేదన్న హిందూ మహాసభ
కలత చెందిన కమలానంద భారతి స్వామి
భక్తులపై దాడి మతం దిశగా మళ్లుతోందా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజధానిని తరలించ వద్దంటూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన చివరకు మతం రంగు పులుముకునే ప్రమాదం కనిపిస్తోంది. శుక్రవారం అందునా పౌర్ణమి, వీటికి మించి సంక్రాంతి పండుగకు ముందు బెజవాడ కనకదుర్గ గుడికి ప్రసాదం వండి పాదయాత్రగా వెళుతున్న మహిళా భక్తులపై లాఠీచార్జి చేసిన వైనం బూమెరాంగయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి హిందువుల మనోభావాలపై జరిగిన దాడిగా కొత్త మలుపు తిరగడం ఆసక్తికరంగా మారింది.
అమరావతిలోనే రాజధానిని ఉంచాలని డిమాండ్ చేస్తూ 29 గ్రామాల రైతులు రోజుకో విధంగా చేస్తున్న ఆందోళన శుక్రవారం సెంటిమెంటు దిశగా వెళ్లి, కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో ప్రధాని మోదీ శ ంకుస్థాపన చేసిన స్థలం నుంచి, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకూ వేలాదిమంది మహిళా భక్తులు తాము వండిన నైవేద్య ప్రసాదాలతో పాదయాత్రగా వెళ్లారు. అయితే ఆ పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో పాటు, ముందుకెళ్లకుండా ఇనుక కంచెలు ఏర్పాటు చేశారు. అయినా లెక్క చేయని మహిళా భక్తులు వాటిని దాటి ముందుకు వెళ్లారు. ఆ క్రమంలో లాఠీచార్జిలో మహిళలకు గాయాలు అవగా, ప్రసాదం చెల్లాచెదురయింది. అయినప్పటికీ కొందరు మహిళలు పోలీసు వలయం ఛేదించి దుర్గ గుడికి చేరుకుని మొక్కులు చెల్లింకోవడం సంచలనం సృష్టించింది.
అయితే, ఈ ఘటన జరిగిన రోజు శుక్రవారం కావడం, దానికి పౌర్ణమి తోడవడం, సంక్రాంతి పండుగ మరో మూడు రోజులే ఉండటం ఈ వ్యవహారం అందరినీ ఆకర్షించింది. మొక్కులు చెల్లించుకునేందుకు వెళుతున్న మహిళా భక్తులను అడ్డగించి, కంచెలు వేయడం మరో కోణంలోకి దారి తీసింది. దీనిని అందిపుచ్చుకున్న బిజెపి, హిందూ సంస్థలు ఇది హిందువుల మనోభావాలపై జరిగిన దాడిగా అభివర్ణించడంతో, ఇదంతా మతం రంగు పులుముకునే దిశగా వెళ్లింది. మతస్వేచ్ఛను అడ్డుకుంటున్నారని, భక్తులకు అమ్మవారే రక్షణగా ఉంటారని అమరావతి జాక్ స్పష్టం చేసింది. అమ్మవారికి సారె, నైవేద్యం చెల్లించేందుకు వెళుతున్న మహిళా భక్తులను అడ్డుకుని లాఠీచార్జి చేయడం అనాగరికమని హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. మరోవైపు గ్రామ దేవత పోలేరమ్మ ఆలయానికి నైవేద్యం పెట్టేందుకు వెళుతున్న మహిళా భక్తులను, స్ధానిక పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది.
భక్తులపై దాడి అంశంపై భువనేశ్వరి పీఠాథిపతి స్వామి కమలానంద భారతి కలత చెందారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకునేందుకు వెళుతున్న అశేష భక్త జనవాహినిని అడ్డుకుని, ముళ్లకంచెలు వేయడం అమానుషం. జరిగిన ఘటనతో కలత చెందా. దీన్ని ధర్మం అంగీకరించదు. ఈ రాష్ట్రంలో హిందువులకు గుళ్లకు వెళ్లి నైవేద్యం పెట్టే హక్కు కూడా లేదా? అసలు ఈ రాష్ట్రంలో ఏ మత సంప్రదాయాలు అమలవుతున్నాయి? భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే అది అది హిందూమత సంస్కృతి, సంప్రదాయాలను అవమానించినట్లే. నైవేద్యాన్ని రోడ్డుపాలు చేయడం రాష్ట్రానికి అశుభం. ఒక పీఠాథిపతిగా జరుగుతున్న పరిణామాలకు కలత చెందుతున్నా. ప్రభుత్వం సంయమనం పాటించాలి. భక్తుల విశ్వాసాలు గౌరవించాలి. ఇది హిందూ దేశమన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల’ని హితవు పలికారు.
భక్తులను దేవాలయాలకు వెళ్లకుండా జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్క హిందువు ఖండించాలని అఖిల భారత హిందూ మహాసభ తెలుగు రాష్ట్రాల బాధ్యుడు, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ పిలుపునిచ్చారు. ‘జగన్ ప్రభుత్వం క్రైస్తవులు సమావేశాలు నిర్వహించుకోవడానికి, మతమార్పిళ్లు చేయడానికి అనుమతి ఇస్తుంది. వాటికి టెంట్లు కూడా వేయిస్తుంది. కానీ, హిందువులు పండగ రోజుల్లో నైవేద్యం, మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం అడ్డుపడటం దారుణం. ఇది హిందువులపై జగన్ ప్రభుత్వం చేస్తున్న మతపరమైన దాడి. అసలు మనం హిందూదేశంలో ఉన్నామా? క్రైస్తవ దేశంలో ఉన్నామా? ఇండియాలో ఉన్నామా? ఇజ్రాయల్‌లో ఉన్నామా? దీనిపై పీఠాథిపతులు, స్వాములు, హిందూమత సంస్థలు ఒకే వేదికపైకి, ఒకే తాటిపైకి రాకపోతే ఏపీలో హిందువులు ఉండరు. హిందూ ధర్మం మిగలదు. హిందువులలో ఐక్యత ఇంకా లోపిస్తే, ఇంటికి వచ్చి మతమార్పిడి చేయడం ఖాయం. దీన్ని నిలువరించేందుకు మేం దీనిపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం. అమరావతిలో మహిళా భక్తులపై చేయి చేసకున్న పోలీసులపై చర్య తీసుకోవాలి. దీనిని కోర్టులో కూడా సవాల్ చేస్తామ’ని జంధ్యాల హెచ్చరించారు.
భక్తులపై జరిగిన దాడిని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోట శేష సాయి, బిజెపి ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తూములూరి చైతన్య ఖండించారు. హిందూ దేవాలయాలకు మొక్కులు చెల్లించుకునేందుకు వెళుతున్న మహిళా భక్తులను అడ్డుకోవడమంటే, హిందువుల మనోభావాలు దెబ్బతీయడమేనని ఆరోపించారు. ఇది హిందూ దేశమా? క్రైస్తవ దేశమా? ఈ రాష్ట్రంలో హిందువులకు స్వేచ్ఛ లేదా? పోలీసుల దురుసు ప్రవర్తనతో నైవేద్యం చెల్లాచెదరవడం అశుభ సూచికమని, ప్రభుత్వం హిందువులపై కక్ష సాధిస్తుందనడానికి ఇంతకంటే ఆధారం ఇంకేం కావాలని ప్రశ్నించారు. ఈ ఘటనను తాము ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ‘సంక్రాంతి ముందు పంటలు చేతికి వచ్చే సమయంలో దేవతలకు నైవేద్యం పెట్టి, ముడుపులు చెల్లించుకోవడం హిందువుల ఆచారం. నేడు జరిగింది కచ్చితంగా హిందు సంప్రదాయాలపై దాడి. హిందు సంప్రదాయాలు, మత విశ్వాసాల పట్ల జగన్ ప్రభుత్వ నిరంకుశ ధోరణిని ప్రతి ఒక్క హిందువు ఖండించాలి. రాజధాని ప్రాంతంలో జరిగే ఆందోళనకు బిజెపి పూర్తి మద్దతునిస్తుంది. హిందూ సమాజ మనోభావాలను జగన్ ప్రభుత్వం కావాలనే గాయపరుస్తోంది. ఇది ఎక్కువ కాలం సాగద’ని వారు హెచ్చరించారు. తాజా పరిణామాలు మతం రంగు పులుముకోవడం ఆసక్తిరేపుతోంది. దానికి కారణం కోట్లాదిమంది పూజించే కనకదుర్గ దేవాలయానికి వెళ్లే మహిళలను అడ్డుకోవడంగానే కనిపిస్తోంది. సెంటిమెంట్‌పరమైన ఈ భావన రాను రాను ఎటు వైపు తీసుకువెళుతుందో చూడాలి.