చంద్రబాబును రాష్ట్ర బహిష్కరణ చేయాలి:వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

374

విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ వద్ద చంద్రబాబు అరాచకాల్ని టీవీల్లో చూసిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలెవ్వరూ చంద్రబాబుకు పట్టడంలేదని, మూడు ప్రాంతాల్లోనూ సమతుల్యం పాటించాలన్న బుద్ధి చంద్రబాబుకు ఇప్పటికీ రాలేదని, ఇంత చిత్తుగా ఓడిన తర్వాత కూడా ఆయనకు జ్ఞానం కలగలేదని బాగా అర్థం అయ్యింది. ఉత్తరాంధ్రకు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద నగరం విశాఖ… ఈ నగరానికున్న అడ్వాంటేజెస్‌ అనేకం ఉన్నాయి. ఒక పక్క చంద్రబాబు మన ఆర్థిక వ్యవస్థను 2.5 లక్షల కోట్లకుపైగా అప్పుల పాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకల్పంతో నవరత్నాలను, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తాను చెప్పినదానికంటే మిన్నగా అమలు చేస్తోంది. భారతదేశం చరిత్రలోనే ఒక ఏడునెలల కాలంలో ఇంత భారీగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన చరిత్ర మరెవ్వరికీ లేదు. అయినా ఇవేమీ ప్రజల కంటపడకుండా ఆపాలన్న దిగజారుడు ప్రయత్నాన్ని చంద్రబాబు మొదలుపెట్టాడు. ఉత్తరాంధ్రమీద, విశాఖపట్నం మీద చంద్రబాబుకు ఇంత వ్యతిరేకత ఉందా? అన్న విషయం మా ప్రాంత ప్రజలందరికీ బాగా అర్థం అయ్యింది. విశాఖపట్నంలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించినందుకు ఇప్పుడు విశాఖ వాసులే బాధపడుతున్నారు. అసలు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టే హక్కులేని నాయకుడిగా చంద్రబాబు తయారయ్యాడు. మేం ఏం అడిగామండి? నవ నగరాలు తెచ్చి విశాఖపట్నంలో పెట్టమని అడిగామా? మీరు పట్టిసీమ కట్టుకుంటే అడ్డుకున్నామా? మీరు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ముట్టుకోకపోయినా, మాకు అన్యాయం జరుగుతున్నా మౌనంగా భరించాం కదా? ఈ రాష్ట్రంలో అత్యంత వెనకబడ్డ జిల్లాల్లో 13లో 7 ఉన్నాయని, అందులో మా 3 జిల్లాలు ఉన్నాయని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. దాని ప్రాతిపదికమీదే విభజన చట్టంలో మా ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. రాయలసీమకు కూడా న్యాయం చేయాలన్నారు. ఇప్పుడు జరుగుతున్నది చంద్రబాబు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడం మాత్రమే. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఈ మూడు ప్రాంతాలూ ముగ్గురు అన్నదమ్ములు అనుకుంటే ఒకరికి హైకోర్టు, ఒకరికి సచివాలయం ఇస్తే చంద్రబాబు కొంపేం మునిగిపోతుంది. జరిగేది న్యాయమే కదా? విజయవాడ ప్రజలకు విశాఖపట్నం ఎంతదూరమో, విశాఖపట్నం ప్రజలకు విజయవాడ అంతే దూరం కదా? అసెంబ్లీ సమావేశాలకు మేం గతంలో హైదరాబాద్‌ వెళ్లిన వాళ్లమే కదా? ఇప్పుడు విజయవాడకూడా వస్తున్నాం కదా? అలాగే కర్నూలు విజయవాడకు ఎంతదూరమో, విజయవాడకు కర్నూలు కూడా అంతే దూరం కదా? మరి కర్నూలుకు హైకోర్టు ఇవ్వాలని ప్రతిపాదన చేస్తే ఎందుకు ఏడుపు. మీరు నవ నగరాలు, టెంపరరీ షెడ్లు అంటూ చేసిన అన్యాయాలు వల్లే కదా… మిమ్మల్ని 23 సీట్లతో అక్కడ కూర్చోబెట్టింది. 151 సీట్లు వచ్చిన పార్టీ ప్రాంతాల పరంగా జరిగిన ఈ అన్యాయాన్ని ఈ రోజు సరిదిద్దకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ప్రాంతాలు ఎలా రగులుతాయి? అక్కడ ఎలాంటి ఉద్యమాలు వస్తాయన్న బుద్దీ, జ్ఞానం కూడా లేదు కాబట్టే ఈరోజు బెంజిసర్కిల్‌లో రోడ్డుమీద కూర్చుని డ్రామా చేశాడు. ఒకప్పుడు అదే బెంజ్‌ సర్కిల్‌లో నవ నిర్మాణ దీక్ష అంటూ డ్రామాలాడి ఈరోజు అదే∙బెంజ్‌ సర్కిల్‌లో నేలమీద కూర్చునే పరిస్థితి వచ్చిందంటే.. ఇదంతా చంద్రబాబు స్వయం కృతం కాదా. ఇటువంటి అసాంఘిక శక్తిని, ప్రజల మధ్య సామరస్యాన్ని చెడగొడుతున్న వ్యక్తిని రాష్ట్ర బహిష్కరణ చేయాలి? తెలంగాణ వాళ్లుకూడా రానివ్వం అంటే.. చంద్రబాబు దేశబహిష్కరణ చేయడం మంచిది.