బాబూ.. మోహన్‌బాబూ.. ఫీజులపై పోరాటం ఏమాయె?

649

   ( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏదైనా.. పాత సినిమాలో మోహన్‌బాబు చెప్పినట్లు మంచు ఫ్యామిలీ రూటే సెపరేటు.మోహన్‌బాబు తాజాగా ఢిల్లీకి సకుటుంబ సపరివారంగా వెళ్లి, ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్‌షాను కలసి ఫొటోలు కూడా దిగారు. అయితే, మీరేమైనా బిజెపిలో చేరతారా అని విలేకరులు అడగటం..అబ్బెబ్బే నేను జగన్ పార్టీ నుంచి బయటకు రానని,ఆయనకు చెప్పే వారిద్దరినీ కలిశానని సెలవిచ్చారు. సుపుత్రుడు,పుత్రికారత్నమేమో..మోదీ గారికి దక్షిణ-ఉత్తరభారత వివక్షేమీ లేదని, తాను దక్షిణాది నటులతోనిర్వహించే భేటీకి హాజరవుతానని హామీ ఇచ్చారంటున్నారు. మంచురత్నమేమో ఈసారి తిరుపతి వచ్చినప్పుడు మీ స్కూలుకు వస్తానని మోదీ హామీ ఇచ్చారంటున్నారు. మనోహన్‌బాబేమో మోదీ తనను బిజెపిలోకి ఆహ్వానించడంపై ఇప్పుడే చెప్పలేనంటారు. మరి మంచుఫ్యామిలీ అంతదూరం వెళ్లి మోదీని ఎందుకు కలిసినట్లు? మొన్నీమధ్య చిరంజీవి తన సినిమా మార్కెటింగ్ కోసం మాదిరయితే, ఇప్పట్లో వారిసినిమాలేవీ లేదు. అసలు మోదీనే మోహన్‌బాబును బిజెపిలో చేరమని అడిగినట్లు.. అందుకు తాను ఇప్పుడే చెప్పలేనని మోహన్‌బాబు చెప్పడం ఎవరికీ అర్ధం కాదు.
అది సరే..మోహన్‌బాబు అంటే సినిమా ఇండస్ట్రీకి భయం. సీతయ్య అన్న పేరు. ఎవరినైనా ఏదైనా అనేస్తారు. కోపమొస్తే ఏకిపారేస్తారు. క్రమశిక్షణ బాగా పాటిస్తారు. నచ్చితే ముద్దు పెట్టించుకుంటారు (మొన్న చిరంజీవిని చూశారుగా..అలాగన్నమాట). మోహన్‌బాబు అటు చంద్రబాబు నాయుడుకూ, ఇటు జగన్మోహన్‌రెడ్డికీ బంధువు. ఆయనకు టిడిపి హయాంలోనే రాజ్యసభ పదవి దక్కింది. ఎర్టీఆర్-లక్ష్మీపార్వతి ఎపిసోడ్‌లో ఆయన బాబు వెంటే నిలిచారు. అంతేనా? ఆ సమయంలో టిడిపి ఎమ్మెల్యేలు బసంత్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి తన మిత్రుడైన ర జనీకాంత్‌ను కూడా తీసుకువచ్చారు. ఆ తర్వాత బాబుతో వచ్చిన విబేధాల వల్ల ఆ పార్టీకి దూరమయ్యారు. వైఎస్ సోదరుడి కుమార్తెతో.. కుమారుడి పెళ్లి తర్వాత, జగన్ ఫ్యామిలీతో కొత్త చుట్టరికం కలవడం, ఎన్నికల ముందు జగన్ ఎన్నికల్లో గెలవాలని షిర్డీసాయినాధుడిని కోరుకున్నానని చెప్పటం తెలిసిందే.
అయితే.. గత ఎన్నికల ముందు ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌పై మోహన్‌బాబు టిటిపి సర్కారుపై అగ్గిరాముడయ్యారు. ప్రభుత్వం పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు ఇంబర్స్‌మెంట్ కాలేజీలకు ఇవ్వకపోతే, కాలేజీలు ఎలా బతకాలని రోడ్డెక్కి దీక్ష నిర్వహించారు. ప్రభుత్వంనుంచి నిధులు విడుదల కాకపోవడంతో యాజమాన్యాలు అప్పులపాలవుతున్నాయని, సిబ్బందికి జీతాలు ఎలా ఇవ్వాలని నానా యాగీ చేశారు. తనతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఆ తర్వాత ఎన్నికల్లో బాబుకు వ్యతిరేకంగానే ప్రచారంచేశారు. ‘19 కోట్లు ఫీజు రీఇంబర్స్‌మెంట్ ఇవ్వకుండా దాన్ని పసుపు-కుంకుమ పేరిట తరలించారు. పిల్లలపై ఎందుకు కక్ష చంద్రబాబు? వారి ఉసురు తగిలితీరుతుంది? పదవిపై ఎందుకింత ప్రేమ. అది శాశ్వతమా? మనిషే శాశ్వతం కాదు.నన్ను చంద్రబాబు ఎంత మోసం చేశాడో చెబితే అది ఇంకోలైనులో వెళుతుందని’ బాబును దునుమాడారు.
మరి చంద్రబాబు అధికారంలో ఉండగా, ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ నిధుల విడుదల కోసం నానా యాగీ చేసిన మోహన్‌బాబు.. తాను చేరిన పార్టీ అధికారం లోకి వచ్చి ఏడు నెలలవుతున్నా, ఇప్పటివరకూ నిధులు ఎందుకు విడుదల చేయలేదని, గత ఏడాది మాదిరిగా సర్కారుకు వ్యతిరేకంగా ధర్నా ఎందుకు చేయటం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి గత ప్రభుత్వం విడుదల చేయాల్సిన బకాయిలు కూడా అలాగే ఉన్నాయని, గత రెండేళ్ల నుంచి 4200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సిఉండగా, ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో, ఇప్పటిదాకా విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఏబివిపి రాష్ట్ర నేత చిన్నా ఇటీవలే విరుచుకుపడ్డారు. అయినా మోహన్‌బాబు దానిపై ఇప్పటివరకూ పెదవి విప్పకపోవడంబట్టి, సినీ ఇండ్రస్టీలో అందరూ మోహన్‌బాబును చూసిభయపడుతుంటే.. మోహన్‌బాబు మాత్రం జగన్‌ను చూసి భయపడుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు. ధైర్యం, ముక్కుసూటితనంపై మంచు వారు వేదిలెక్కి దంచే లెక్చర్లన్నీ ఉత్తిత్తేనన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. నిజంగా ఫీజు రీఇంబర్స్‌మెంట్‌పై మోహన్‌బాబుకు ఎన్నికల ముందు ఉన్న ఫైర్ ఇప్పుడు ఉన్నట్టయితే.. ఇప్పుడు కూడా ధర్నాకు దిగేవారు కదా?!