పాదయాత్ర హామీలతో జనం ముందుకు జగన్

641

ప్రజా సంకల్ప యాత్ర’ పూర్తయి సంవత్సరం
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3,648 కి.మీ.ల సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్ర
పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలతోనే మేనిఫెస్టో రూపకల్పన
ఏడాది కాకముందే ఇచ్చిన హామీలు శరవేగంగా అమలు
(శ్రీనివాస్)

ప్రజాసమ్యలను చూసి, ప్రజల కష్టాలు విని చలించి, నేను ఉన్నాను.. నేను విన్నాను..అంటూ ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా జనం మధ్యలోకి వచ్చి.. జనం గుండె చప్పుడు వింటూ..నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ.. 3,648 కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన నాటి విపక్ష నేత,ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చరిత్రాత్మకమైన పాదయాత్రకు జనవరి 9 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది.పాదయాత్రలో ఏమైతే ప్రజల కష్టాలు, కన్నీళ్ళను చూసి చలించిపోయారో.. ఏ వర్గాలైతే అసమానతలకు.. అన్యాయాలకు గురయ్యారో.. వారందరికీ న్యాయం చేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించి… అధికారంలోకి వచ్చిన తొలి గంట నుంచే.. ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేయటమే లక్ష్యంగా జగన్ మోహన్ రెడ్డిగారు అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలోనే మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో 80-90 శాతం అమలు చేసి చూపారు. ఏ వర్గాలైతే సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కబడ్డాయో.. ఆ వర్గాల ప్రజలు తలెత్తుకునేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టాలు చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా.. ఆ వర్గాల ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు.వీటితోపాటు ప్రతి 2 వేల జనాభాకు గ్రామ సచివాలయాలు.. దశల వారీ మద్యపాన నిషేధం, మగాళ్ళ పాలిట మరణ శాసనంగా ఏపీ- దిశ చట్టం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం… రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతిపై యుద్ధం.. కొద్ది నెలల్లోనే వందల కోట్ల ప్రజా ధనం ఆదా.. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విప్లవాత్మక మార్పులు.. ఇలా ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు, చట్టాలు తొలి ఏడు నెలల పాలనలోనే చేశారు.మానవత్వమే నా మతం.. మాట నిలబెట్టుకోవడమే నా కులం.. అని చాటిన జగన్ మోహన్ రెడ్డి .. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ.. అన్ని వర్గాల సంక్షేమం- అభివృద్ధే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. పాదయాత్రలో చేనేతన్న కష్టం.. ఆటో అన్న కన్నీళ్ళు.. మత్స్యకారుల జీవితాలు.. చూసి చలించిపోయిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కష్టాలు తీర్చారు. పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం.. పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి రూ. 15 వేలు అమ్మ ఒడి పథకం కింద ఇస్తానని మాట ఇచ్చి.. పాదయాత్రకు ఏడాదైన సందర్భంగా చిత్తూరులో జగనన్న అమ్మ ఒడిి కార్యక్రమానికి చిత్తూరులో శ్రీకారం చుడుతున్నారు. 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి ద్వారా భరోసా ఇస్తున్నారు.
నాటి పాదయాత్రను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే..

ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు, వారిలో ఒక భరోసా కల్పించేందుకు వైయస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత మహానేత వైయస్సార్ సమాఎధి వద్ద 2017, నవంబరు 6వ తేదీన వైయస్ జగన్మోహన్రెడ్డి మొదలుపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్థానం.. 2019 జనవరి 9తో ఇచ్ఛాపురంలో ముగిసింది. ఈ పాదయాత్రతో వైయస్.జగన్ దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్ర సృష్టించారు.శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వేదికగా, సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున, అంటే జనవరి 9వ తేదీన జననేత ఆ ప్రస్థానాన్ని ముగించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదో లాంగ్ మార్చ్ గా నిలిచిపోయింది.
ఆయన నడకలో ఒక విశ్వాసం. వేస్తున్న ప్రతి అడుగు.. అవినీతి, అన్యాయంపై ఓ వెనుదిరగని అస్త్రం. నిరంతరం ప్రజల కోసమే ఆయన తపన. వారి జీవితాల్లో వెలుగు చూడాలన్నదే ఆయన లక్ష్యం. వారికి మరింత చేరువ కావాలని, వారి కష్టాలు దగ్గరగా చూడాలని తలంచిన జగన్ సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అదే యాత్ర తర్వాత కాలంలో విజయ సంకల్ప యాత్రగా పరిణమించింది. ఇడుపులపాయ వేదికగా 2017, నవంబరు 6వ తేదీన ప్రారంభమైన వైయస్ జగన్ సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర’ రాష్ట్రమంతటా 13 జిల్లాలలో 341 రోజులు కొనసాగి, 2019, జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది.
వైయస్‌ఆర్ జిల్లాలో..
ఇడుపులపాయలో 2017, నవంబరు 6న ప్రారంభమైన వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర, వైయస్సార్ జిల్లాలో అదే నెల 13వ తేదీ వరకు కొనసాగింది. జిల్లాలో 5 నియోజకవర్గాలలో 7 రోజుల పాటు 93.8 కి.మీ నడిచారు. 5 చోట్ల బహిరంగ సభలతో పాటు, 3 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. జిల్లాలో యాత్ర చివరి రోజున మైదుకూరులో బీసీల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.
కర్నూలు జిల్లాలో..
అదే ఏడాది నవంబరు 13వ తేదీన (యాత్ర 7వ రోజు) ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగలమర్రి వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశించిన వైయస్ జగన్ 18 రోజుల పాటు 263 కి.మీ నడిచారు. మొత్తం 7 నియోజకవర్గాలలో పర్యటించిన జననేత, 8 బహిరంగ సభలతో పాటు, 6 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.
అనంతపురం’లో..
ఆ తర్వాత 2017, డిసెంబరు 4వ తేదీన (యాత్ర 26వ రోజు) అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టిన వైయస్ జగన్, 20 రోజులు పర్యటించి 9 నియోజకవర్గాలలో మొత్తం 279.4 కి.మీ నడిచారు. 10 చోట్ల బహిరంగ సభలతో పాటు, 4 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాలో..
పాదయాత్రలో 46వ రోజున (2017, డిసెంబరు 28) ఎద్దులవారికోట వద్ద చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన వైయస్ జగన్, 23 రోజుల పాటు 10 నియోజకవర్గాలలో పర్యటించి మొత్తం 291.4 కి.మీ నడిచారు. జిల్లాలో 8 బహిరంగ సభలతో పాటు, 9 చోట్ల ముఖాముఖి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
కోస్తా’ లోకి ప్రవేశం
వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 2018, జనవరి 23వ తేదీన (యాత్ర 69వ రోజున) కోస్తాలోకి ప్రవేశించింది. నెల్లూరు జిల్లా పీసీటీ కండ్రిగ వద్ద ఆయన కోస్తా ప్రాంతంలోకి అడుగు పెట్టారు. నెల్లూరు జిల్లాలో 20 రోజుల పాటు 9 నియోజకవర్గాలలో యాత్ర చేసిన జననేత 266.5 కి.మీ నడిచారు. 9 బహిరంగ సభలతో పాటు, 6 చోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో..
2018, ఫిబ్రవరి 16వ తేదీన (యాత్ర 89వ రోజు) కందుకూరు నియోజకవర్గం, లింగ సముద్రం మండలంలోని కొత్తపేట వద్ద ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన వైయస్ జగన్, 21 రోజులు పర్యటించారు. జిల్లాలో 9 నియోజకవర్గాలలో ఆయన 278.1 కి.మీ నడిచిన ఆయన, 9 బహిరంగ సభలు, సమావేశాలతో పాటు, 2 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాలో..
మార్చి 12వ తేదీన (యాత్ర 110వ రోజు) బాపట్ల నియోజకవర్గం, అదే మండలంలోని స్టూవర్టుపురం వద్ద గుంటూరు జిల్లాలోకి అడుగు పెట్టిన వైయస్ జగన్, 12 నియోజకవర్గాలలో 26 రోజులు పర్యటించారు. జిల్లాలో 281 కి.మీ నడిచిన ఆయన, 11 బహిరంగ సభలతో పాటు, 3 చోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాలో..
ఆ తర్వాత ఏప్రిల్ 14వ తేదీన (యాత్ర 136వ రోజు) కనకదుర్గమ్మ వారధి వద్ద ప్రజా సంకల్ప యాత్ర కష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. వారధి వద్దకు అశేష జనవాహిని తరలి రావడంతో ఒక దశలో ఆ వంతెన కుంగి పోతుందా? అన్నట్లుగా మారింది. దీంతో పోలీసులు వంతుల వారీగా ప్రజలను వంతెనపైకి అనుమతించారు. జిల్లాలో 24 రోజుల పాటు 239 కి.మీ నడిచిన వైయస్ జగన్, 12 నియోజకవర్గాలలో పర్యటించారు. 10 బహిరంగ సభలు సమావేశాలు, 5 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి’ లో..
మే 13వ తేదీ (యాత్ర 160వ రోజున) దెందులూరు నియోజకవర్గం, కలకర్రు వద్ద పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టిన వైయస్ జగన్, 13 నియోజకవర్గాలలో పర్యటించారు. జిల్లాలో 27 రోజుల పాటు 316.9 కి.మీ నడిచిన జననేత, 11 బహిరంగ సభలతో పాటు, 5 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.
తూర్పు గోదావరి’ లో..
జూన్ 12వ తేదీ (యాత్ర 187వ రోజు)న కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి మాతకు హారతి, ప్రత్యేక పూజల అనంతరం గోదావరి రైల్ కమ్ రోడ్ వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్న వైయస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టారు. జిల్లాలో సరిగ్గా రెండు నెలలు సాగిన వైయస్ జగన్ పాదయాత్ర ఆగస్టు 13న ముగిసింది. జిల్లాలో 50 రోజులు పాదయాత్ర చేసిన ఆయన 17 నియోజకవర్గాలలో 412 కి.మీ నడిచారు. 15 బహిరంగ సభలు, సమావేశాలతో పాటు, 2 చోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.
విశాఖ’ జిల్లాలో..
2018, ఆగస్టు 14వ తేదీ (యాత్ర 237వ రోజు)న నర్సీపట్నం నియోజకవర్గం, నాతవరం మండలంలోని గన్నవరం మెట్ట వద్ద వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలో 32 రోజుల పాటు, 12 నియోజకవర్గాలలో పర్యటించిన శ్రీ వైయస్ జగన్, 277.1 కి.మీ నడిచారు. 9 సభలు, సమావేశాలతో పాటు, 2 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.
విజయనగరం’ లో..
అనంతరం సెప్టెంబరు 24వ తేదీ (యాత్ర 269వ రోజు)న ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస మండలంలోకి అడుగు పెట్టిన వైయస్ జగన్ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు.
విశాఖలో జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం
అక్టోబరు 25వ తేదీన జిల్లాలో 294వ రోజు యాత్ర పూర్తి చేసుకున్న వైయస్ జగన్, హైదరాబాద్ వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడి విఐపీ లాంజ్లో ఆయనపై హత్యా ప్రయత్నం జరిగింది. దీంతో ప్రజా సంకల్పయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 17 రోజుల విరామం తర్వాత నవంబరు 12వ తేదీన యాత్ర తిరిగి మొదలైంది. విజయనగరం జిల్లాలో మొత్తం 36 రోజుల పాటు 9 నియోజకవర్గాలలో పర్యటించిన వైయస్ జగన్ 311.5 కి.మీ నడిచారు. 9 బహిరంగ సభలతో పాటు, 2 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు.
శ్రీకాకుళం’ జిల్లాలో..
నవంబరు 25వ తేదీ (యాత్ర 305వ రోజు)న పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలోని కడకెల్ల వద్ద వైయస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించారు. కాగా, ఇదే జిల్లాలో యాత్ర 341వ రోజున, అంటే జనవరి 9, 2019న జననేత సుదీర్ఘ పాదయాత్ర.. ప్రజా సంకల్ప యాత్ర ముగిసింది. జిల్లాలో మొత్తం 37 రోజుల పాటు 10 నియోజకవర్గాలలో పర్యటించిన వైయస్ జగన్ 338.3 కి.మీ నడిచారు. ఇచ్ఛాపురం సహా మొత్తం 10 చోట్ల బహిరంగ సభలతో పాటు, 6 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు.
ప్రజా సంకల్ప యాత్ర విశేషాలు
– నవంబరు 6, 2017న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభం
– మొత్తం రోజులు 429
– పాదయాత్ర రోజులు 341
– 13 జిల్లాలు
– నియోజకవర్గాలు 134
– 231 మండలాలు
– 2516 గ్రామాలు
– 54 మున్సిపాలిటీలు
– 8 కార్పొరేషన్లలో పాదయాత్ర
– 124 సభలు, సమావేశాలు
– 55 ఆత్మీయ సమ్మేళనాలు
– 3648 కి.మీ నడక
– జనవరి 9, 2019న ఇచ్ఛాపురంలో ముగింపు