అవంతి..అప్పుడే చేతులెత్తేశారా?

559

స్థానిక సమరం రెఫరెండం కాదన్న మంత్రి శ్రీనివాస్
మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఆగ్రహం
విపక్షాలకు ఆయుధాలిచ్చారని అసంతృప్తి

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీని ఇరుకున పడేశాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గెలుపు మాదేనని ధీమాగా చెప్పాల్సిన మంత్రి.. అవి పాలనకు రెఫరెండం కాదని చెప్పడం ద్వారా, యుద్ధానికి ముందే చేతులెత్తేసినట్లు ఉందన్న ఆగ్రహ ం వైసీపీ వర్గాలలో వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్న పార్టీ సహజంగా ఎప్పుడూ ఆవిధంగా చెప్పదని, అందులోనూ అధికారంలోకి వచ్చి ఇంకా ఏడు నెలలు కూడా కానందున, తమలో ధీమా ఎక్కువగా ఉంటుందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
మంత్రి అవంతి తాజాగా చేసిన ప్రకటన పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని నీరుగార్చేలా ఉందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో అవినీతి గణనీయంగా తగ్గిపోయిందని, మునుపటి మాదిరిగా ఎమ్మెల్యేలపై ఎక్కడా అవినీతి ఆరోపణలు లేవని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వీటికి మించి.. అమ్మఒడి, మహిళలకు రిజర్వేషన్లు, ప్రైవేట్ వైన్ షాపుల రద్దు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆరోగ్యశ్రీ బలోపేతం, రోగులకు వివిధ రాష్ర్టాల్లో చికిత్స చేయించుకునే వెసులుబాటు, దాదాపు 4 లక్షల కొత్త ఉద్యోగాలు వంటి సాహసోపేత నిర్ణయాలు ఈ ఏడు నెలల కాలంలోనే తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. వాటితోపాటు..హిందువులలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, మసీదు-చర్చిలో పనిచేసే మతపెద్దలకు వేతనాలతో ముస్లిం-క్రైస్తవులలో,నామినేటెడ్ పదవులలో బీసీ,దళితులకు రిజర్వేషన్ నిర్ణయంతో ఆ రెండు వర్గాలకు జగన్ ప్రభుత్వం చేరువయిందని గుర్తు చేస్తున్నారు. కేవలం 7 నెలల పాలనలోనే ఇన్ని సానుకూలతలు అస్ర్తాలుగా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలు రెఫరెండం కాదని మంత్రి ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. మంత్రి ప్రకటనతో, వైసీపీకి గ్రామస్థాయిలోబలంలేదని ముందుగానే విపక్షాలకు సంకేతం ఇచ్చినట్టయిందని వైసీపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. 151 స్థానాల్లో విజయంసాధించడం, నియోజకవర్గాల స్థాయిలో చాలాచోట్ల అసలు టిడిపి నేతలు పోటీ చేసేందుకే వెనుకంజవేస్తుంటే..మంత్రి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడి, వారిలో కొత్త ధైర్యం తీసుకువచ్చారని మండిపడుతున్నారు.
తెలుగుదేశంలో మాదిరిగా ఇష్టానుసారం మాట్లాడితే పార్టీ నష్టపోతుందని, ఒకవేళ మంత్రి శ్రీనివాస్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగుండకపోయి ఉండవచ్చంటున్నారు. అంతమాత్రాన తన నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేక వాతావరణం, రాష్ట్రమంతా ఉందని మంత్రి అంచనా వేయడం ఆయన అవగాహనా రాహిత్యమంటున్నారు. మంత్రి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు ఆయుధం అందించినట్టయిందని చెబుతున్నారు. ‘రేపు విపక్షాలు మంత్రి మాటలనే ప్రధానాంశంగా తీసుకుంటాయి. మీకు ఎన్నికల్లో గెలిచే సత్తాలేకనే అవి రెఫరెండం కాదన్నారంటారు. మీకు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు మీ పనితీరుకు రెఫరెండమని అంగీకరించాలని సవా చేస్తారు. అప్పుడు మేమేం చెప్పాలి’ అని వైసీపీ సీనియర్ నేత ఒకరు వాపోయారు.