రాజధాని కోసం టిడిపి ఎమ్మెల్యేల సామూహిక రాజీనామాలు?

567

అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టే రోజునే ప్రకటన?
ఢిల్లీలో బాబు దీక్ష చేసే యోచన?
జాతీయ స్థాయికి అమరావతి రాజధాని అజెండా
రాజధాని అజెండాతో వైసీపీకి ‘మళ్లీ ఎన్నికలకు’ సవాల్
రాజధానిపై రాజీనామాకు జయదేవ్ రె‘ఢీ’
వైసీపీకి నైతిక సంకటం
‘సూర్య’కు ప్రత్యేకం
( మార్తి సుబ్రహ్మణ్యం)
రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు జగన్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు టిడిపి బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా టిడిపికి చెందిన ఎమ్మెల్యేలందరూ తమ పదవులకు సామూహిక రాజీనామాలతో వైసీపీని నైతిక సంకటంలోపడవేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే సమయంలో అమరావతి రాజధాని అజెండాగా వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకురానున్నట్లు తె లుస్తోంది. ఆ మేరకు గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడగా,కొందరు సీనియర్లు వారించినట్లు తెలుస్తోంది.
తనను చూసి 33 వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చిన రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా టిడిపి అడుగులు వేస్తోంది. కేవలం ఒక సామాజికవ ర్గంపై కక్షతోజగన్ అమరావతి రాజధానిని విశాఖకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పోరాడుతున్న టిడిపి, తాజాగా కొత్త వ్యూహంతో వైసీపీ సర్కారును ఇరుకున పెట్టేందుకు కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం. అందులో భాగంగా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, అమరావతిలోనే రాజధాని ఉండాలన్న అజెండాతో తిరిగి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో రాజధాని అజెండాతోనే వైసీపీ తిరిగి ప్రజాతీర్పు కోరాలని జగన్‌కు సవాల్ చేయనుంది. విశాఖను రాజధానిగా రాయలసీమ వాసులు కూడా వ్యతిరేకిస్తున్నారని, కోస్తా ప్రజలు కూడా ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న సర్వే నివేదికల ఆధారంగానే టిడిడి నాయకత్వం ఈ వ్యూహానికి పదును పెడుతున్నట్లు చెబుతున్నారు.

సీనియర్లు కూడా అదే సరైన వ్యూహమంటున్నారు. ‘ఇప్పుడు మా పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు చివరి వరకూ ఉంటారో మాకే తెలియదు. ఇప్పటికి ఇద్దరు వెళ్లారు. ఇంకొందరు ఉండీ లేనట్లున్నారు. ఒకవేళ వాళ్లు వెళ్లినా మేమేం చేయలేం. వాళ్లు పార్టీలో ఉండి లాభమేమిటి? అయినా కొడాలి నాని లాంటి చంద్రబాబును తిడుతుంటే చూస్తూ ఉండాల్సిన పరిస్థితి.అది మనకు అవసరమా? అందుకే సామూహిక రాజీనామాలు చేసి, రాజధాని అంశంపై ప్రజల్లోకి వెళ్లడం మంచింది. రాజధానిని మార్చేందుకు ఎవరూ అంగీకరించడంలేదు. వైజాగ్ ప్రజలు ఒకవేళ రాజధాని తమకు వస్తే పులివెందుల,కడప గ్యాంగులు తిష్టవేస్తాయని భయపడుతున్నారు. రాయలసీమ నేతలు అమరావతి కాకపోతే గ్రేటర్ రాయలసీమ అడుగుతున్నారు. కాబట్టి రాజధాని అంశంపై మళ్లీ ఎన్నికలకు వెళితే, ప్రజలే తీర్పు ఇస్తార’ని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. మరికొందరు ఎమ్మెల్యేలు వీడేముందే, రాజధాని అజెండాతో సామూహి రాజీనామాలకు వె ళ్లడం మంచిదంటున్నారు.
ఇప్పుడున్న 23 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు వెళ్లిపోయారని, మరికొందరు అంటీ ముట్టనట్లు ఉండగా, ఇంకొందరు గోడ దూకేందుకు సిద్ధంగాఉన్నారని చెబుతున్నారు. అందువల్ల వారితో సభకు వెళ్లడం కంటే, రాజధాని కోసం రాజీనామా చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వెళ్లిపోకముందే, రాజధాని అజెండాతో రాజీనామా చేయడమే బెటరంటున్నారు. ఒకవేళ కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయకపోతే, ఇక వారికి ఇదే చివరి ఎన్నికలవుతాయంటున్నారు. ఈ విషయంలోగతంలో తెలంగాణ అంశంపై టిఆర్‌ఎస్ అనుసరించిన వ్యూహాన్ని వారు గుర్తు చేస్తున్నారు. విభజనకు ముందు.. వైఎస్ మరణించిన తర్వాత, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఉప ఎన్నికలు పెడితే వైసీపీ అభ్యర్ధులే ఎక్కువమంది గెలిచారని గుర్తు చేస్తున్నారు. భావోద్వోగ అంశాలే ఎప్పుడూవిజయం సాధిస్తాయనడానికి ఆ ఎన్నికలే ఉదాహరణ అంటున్నారు.
కాగా తాజాగా జరిగిన టిడిపి అంతర్గత సమావేశంలో, రాజధాని అజెండాగా తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ చేసిన ప్రతిపాదనపై లోతుగా చర్చ జరిగింది. తన పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నారని, ఆందోళనలోపాల్గొనని మిగిలిన నియోజకవర్గ ప్రజలు కూడా జగన్ సర్కారు నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. తన రాజీనామాతో ప్రజలు ఎటు వైపు ఉన్నారని తేలిపోతుందని గల్లా స్పష్టం చేయగా, ఓ మాజీ మంత్రి జోక్యంచేసుకుని,ఈ ప్రజలను నమ్మి రాజీనామా చేయడం ఎంతవరకూ కరెక్టని వారించినట్లు సమాచారం. అయినా సరే, రాజీనామా చేసేందుకే గల్లా జయదేవ్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే… రాజధాని కోసం సామూహిక రాజీనామా చేయటం వల్ల కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదని టిడిపి సీనియర్లు విశ్లేషిస్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలున్న తమ పార్టీని, జగన్ పార్టీ ఎమ్మెల్యేలు సభలో రోజూ అవమానిస్తున్నారని, కొందరు మంత్రులు తమ అధినేత బాబును ఏకవచనంతో మాట్లాడి దూషిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. వ్యాపారాలున్న కొందరు ఎమ్మెల్యేలను జగన్ సర్కారు బెదిరించి, టిడిపి నుంచి బయటకు వచ్చేలా ఒత్తిళ్లు చేస్తోందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని మార్పు అవకాశాన్ని జగన్ తనంతట తానే మనకు ఇచ్చారంటున్నారు. రాజధానిని మార్చినందున గుంటూరు-కృష్ణా జిల్లాల్లో పార్టీ నష్టపోయినా ఫర్వాలేదన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నందున.. తిరిగి ఉప ఎన్నికలకు వెళితే, ఆ రెండు జిల్లాల్లో పార్టీ విజయభేరి మ్రోగిస్తుందంటున్నారు. అదే సమయంలోవైసీపీని కూడా రాజధాని అజెండాగా రాజీనామాలకు సవాల్ చేస్తే.. ఆ పార్టీ చిత్తశుద్ధి ఏమిటన్నది ప్రజలకు తెలిసిపోతుందని చెబుతున్నారు. ఒకవేళ రాజీనామాలకు వెనుకడుగు వేస్తే, అది కూడా తమకు లాభమేనంటున్నారు.

‘ మా రాజీనామాలు స్పీకర్ ఆమోదిస్తే సంతోషం. లేకపోతే ఇంకా సంతోషం. రాజీనామాల కోసం పోరాడతాం. దానితో రాజధానిపై మా పార్టీ వైఖరేమిటో ప్రజలకు స్పష్టమవుతుంది. గతంలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఏమయిందో అందరికీ తెలుసు. తమకు 20 ఎంపీ సీట్లు ఇస్తే హోదా సాధిస్తామన్న జగన్ మాటలు ప్రజలు నమ్మారు. ఇప్పుడు ప్రజలు మూడ్ విశాఖ రాజధానికి వ్యతిరేకంగా ఉంది. ఆంధ్రావాళ్లు తెలంగాణ వాళ్ల మాదిరిగా వెంటనే రోడ్లపైకి రారు. ఎన్నికల సమయంలోనే తీర్పునిస్తారు. అందువల్ల రాజధాని తరలింపుపై ప్రజలు మౌనంగా ఉన్నారంటే, వారంతా దానిని ఆమోదిస్తున్నట్లు కాదు. అందుకే రాజధాని మార్పు అజెండాతో, వైసీపీ తిరిగి ప్రజాతీర్పు కోరాలని సవాల్ చేయడమే కరెక్టు. ఒకవేళ దానిని ఆ పార్టీ స్వీకరిస్తే మంచిది.లేదంతా వారు సవాలుకు పారిపోయారని జనం ముందు ముద్దాయిలుగా నిలబె ట్టవచ్చ’ని ప్రకాశంజిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత విశ్లేషించారు.

అయితే.. రాజధాని అంశం ఇప్పటికే సర్వత్రా చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో..చంద్రబాబు నాయుడు అదే అంశంపై మునుపటి మాదిరిగా ఢిల్లీలో దీక్ష చేయాలని పలువురు సీనియర్లు సూచిస్తున్నారు. రాష్ట్ర విభజన ముందు.. ఢిల్లీ ఏపీ భవన్‌లో బాబు దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.దానితోనే చంద్రబాబుపై ఏపీ ప్రజల్లోమరింత నమ్మకం పెరిగిన వాస్తవం విస్మరించకూడదని చెబుతున్నారు. పైగా ఈ అంశంలో బిజెపి నాయకత్వం దాగుడుమూతలు ఆడుతున్నందున, బాబు దీక్ష చేస్తే రాజధానిపై బిజెపి వైఖరేమిటన్నది కూడా స్పష్టమవుతుందంటున్నారు. దీక్ష ఫలితంగా రాష్ట్రంలో మూడు రాజధానులుండాలన్న జగన్ విచిత్ర వైఖరి, దేశ ప్రజలకూ తెలుస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా… బాబు దీక్ష చేసినందువల్ల జాతీయ మీడియా మాత్రమే కాకుండా,జాతీయ నేతలు, ప్రాంతీయ పార్టీల దృష్టితోపాటు, వారి మద్దతు కూడా కూడగట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే కొందరు సీనియర్లు బాబుకు తమ అభిప్రాయాలు చెప్పినట్లు సమాచారం. ఏదేమైనా రాజధాని తరలింపు అంశంపై ప్రభుత్వం అధికారికంగా ఒక నిర్ణయం తీసుకునే ముందే టిడిపి సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో దీనిపై ప్రకటన వెలువడే సమయంలోనే సామూహిక రాజీనామాలు ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.