అనుకున్నట్లే.. అమరావతికి హిందూదళం వచ్చేసింది!

622

క్రైస్తవం, రాజధాని మార్పుపై గళమెత్తిన నేతలు
జగన్ మతమేంటో చెప్పమని జంధ్యాల సవాల్
ఇది హిందువుల రాజధాని అని స్పష్టీకరణ
రాజధానిని మారిస్తే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిక

( మార్తి సుబ్రహ్మణ్యం)

అది ముంబయి మహానగరం. ఎక్కడో పాక్ కలుగులో దాక్కున్న అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను చూసి భయపడి, ఆ డాన్ వాడిన కారును కూడా కొనే దమ్ములేని జనం. ఎక్కకోఉన్న దావూద్ చేసే ఫోన్ల బెదిరింపులకే పెద్ద పెద్ద నేతలు పంచెలు తడిపేసుకునే సమయమది. ఆ పరిస్థితిలో ఆ కారును 32 వేల రూపాయలకు వేలంలోపాడి, తనకు ఎన్ని బెదిరింపులు వచ్చినా లెక్కచేయకుండా.. ఆ కారుపై దావూద్ ఫొటో పెట్టి, ముంబయి మహానగరం చూస్తుండగా తగులపెట్టి, ముంబయి మారణహోమంలో మృతిచెందిన వారికి నివాళి ప్రకటించిన హిందూమత నాయకుడాయన.పేరు స్వామి చక్రపాణి మహరాజ్. హోదా అఖిల భారత హిందూమహాసభ అధ్యక్షుడు. అయితే సహజంగానే ఆయన గురించి మన జాతీయ మీడియా ఎప్పుడూ చెప్పలేదు. ఆ ఘటనకు పెద్దగా ప్రాధాన్యమూ ఇవ్వలేదు. తాజాగా రాహుల్‌గాంధీని స్వలింగ సంపర్కుడిగా బహిరంగ ఆరోపణ చేసిన దమ్మున్న హిందూవాది ఆయన. మరి ఆ సంస్థ కార్యకలాపాలు, కార్యక్రమాలు, ఆ సంస్థల నేతలు ఇంకెంత దూకుడుగా ఉంటారో ప్రత్యేకించి చెప్పనవ సరం లేదు.
అనుకున్నట్లుగానే.. కొద్దిరోజుల క్రితమే ‘సూర్య’ వెబ్‌సైట్‌లో వెలువడిన కథనం ప్రకారమే.. అమరావతికి హిందూ దళం! వచ్చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిడి, అమరావతి తరలింపు అంశాలపై తెలుగు రాష్ర్టాల హిందూమహాసభ బాధ్యుడు, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ నేతృత్వంలో శనివారం హిందూవాదులు పెద్దసంఖ్యలో హాజరయి, అమరావతిలో భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా ఏపీ రాజధానిలో తన ఉనికి ప్రదర్శించడం చర్చనీయాంశమయింది. గతకొద్దిరోజుల క్రితమే అమరావతికి హిందూ దళం! పేరుతో వార్తాకథనం వెలువడిన విషయం తెలిసిందే.
రాష్ర్టానికి వచ్చిన హిందూమహాసభ నేత జంధ్యాల రవిశంకర్ నేరుగా సీఎం జగన్‌పై మతంకోణంలో విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టి, రాష్ట్రంలో మత యుద్ధానికి తెరలేపారు. పైగా అమరావతి హిందువుల రాజధాని అని, హిందువులకు అక్కడ రాజధానిగా ఉండటం ఈ ప్రభుత్వానికి ఇష్టంలేదా అని ప్రశ్నల వర్షం కురిపించడం చర్చనీయాంశమయింది. ఇక సీఎం జగన్‌పైఆయన చేసిన సవాల్ సంచలనం సృష్టిస్తోంది.ఆయన నేరుగా జగన్ మతమేమిటో చెప్పాలనే సవాల్ చేయడం విశేషం. ‘జగన్ గారూ..మీ మతమేమిటో ప్రజలకు చెప్పండి. మీ మతంపేరు చెప్పుకునేందుకు ఎందుకు భయపడుతున్నారు? మీ భయంచూస్తుంటే అంత తప్పు చేసే మతంలోమీరు ఉన్నారనిపిస్తుంది.మేమంతా ధైర్యంగాచెబుతున్నాం. మేం హిందువులమని. మరి మీరెందుకు మీ మతం పేరు చెప్పరు. ఈనెల 10 తర్వాత మీ పరిస్థితి ఏమిటో మీకు తెలియదు. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధాని నగరాన్ని మారుస్తారా? తిరుమలలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలతో హిందువులమనోభావాలు గాయపడుతున్నాయి.హిందూ వ్యతిరేకవిధానాలు తీసుకుంటున్న మీ ప్రభుత్వ నిర్ణయాలను ఇకపై చూస్తూ సహించం. గత మూడు వారాలుగా, రాజధానిపై రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. డిసెంబర్ 22న అఖిలభారత హిందూ మహాసభ నేషనల్ మీట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించాము. మా అఖిల భారత హిందూ మహాసభ నాయకులు ప్రధానమంత్రి, అమిత్ షాకి లెటర్ లు వ్రాయడం జరిగింది. త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తామ’ని రవిశంకర్ చేసిన హెచ్చరిక చర్చకు తెరలేచింది.
ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో జంధ్యాల రవిశంకర్ ఏం మాట్లాడారంటే.. ‘అఖిలభారతహిందూ మహాసభతరుపున హిందువులు మనోభావాలకు విరుద్ధంగా మీరు తీసుకునే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. రాబోయే కాలంలో 20 వేలమంది హిందువులతో అమరావతిలో రాజధానిగా కొనసాగాలని ర్యాలీ చేస్తాం. అందుకు సంబంధించిన పర్మిషన్ తీసుకుంటాం. అందుకు రావడానికి హిందువులు సిద్దంగా ఉన్నారు. దీనిపై మా అధ్యక్షుడు స్వామి చక్రపాణి గారు కేంద్రపెద్దలతో మాట్లాడుతున్నారు. తిరుపతిలో హిందూ మనోభావాలను కించపరిచే విధంగా జరిగే సంఘటనలు కూడా వ్యతిరేకిస్తున్నాము. అమరావతి హిందువులు రాజధాని. ఈ ప్రభుత్వానికి హిందువుల రాజధానిగా అమరావతి కొనసాగడానికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. మేము ఐక్యరాజ్యసమితికి హిందువులు రక్షణకోసం లెటర్ వ్రాశాము. ప్రపంచ హిందువులారా ఏకం కండి అనేది మా నినాదం. అమరావతి రాజధానిని ఇక్కడ నుండి తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నాము’ అన్నారు.

‘ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అమరావతిలో రాజధాని ఉండాలని అసెంబ్లీలో ఆమోదం తెలిపి, ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అనేక కట్టడాలు పూర్తి అయిన తరువాత రాజధానిని తరలిస్తామని చెప్పడం హాస్యాస్పదం. ఇది ఒకచారిత్రాత్మక రాజధాని. దీనికి రైతులు భూములు ఇచ్చారు. రైతుల భూములను డీ నోటిఫికేషన్ చేసి, వారికి అగ్రిమెంట్ లు అయిన తర్వాత కౌలుకూడా ఇచ్చిన తరువాత, రాజధాని తరలిస్తామని చెబుతున్నారు. ఇప్పటి వరకు 10 వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇంకా 1 లక్షకోట్లుకావాలి అని చెబుతున్నారు. హైకోర్టు కూడా అమరావతిలో ఉండాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.శివరామకృష్ణన్ కమిటీ 4800 మంది ఎగ్జామిన్ చేసి, ప్రజల అభిప్రాయాలను సేకరించారు. మీరు ఇప్పుడు వేసే బోగస్ కమిటిలు ఎవరిని సంప్రదించారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత రాజధానిపై మరల ఈ గందరగోళం ఎందుకు నెలకొంది? అమరావతిలో ప్రభుత్వానికి ఉన్న భూములతో మీకు 1.60 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. హైకోర్టు ఎక్కడపెట్టాలో మరల మార్చాలంటే మీకు అధికారం లేదు. అమరావతి ఇప్పటి వరకు ములిగిపోలేదు. ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంది.

అమరావతి కోసం చట్టప్రకారం ముందుకు వెళతాం..ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అమరావతి బాండ్లు, షేర్ మార్కెట్ లో పెట్టారు. ఈ విషయంలో కూడా కోర్టులు ఎక్కే అవకాశం ఉంద’ని జంధ్యాల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన హిందూ మహాసభ నేత రవిశంకర్‌కు రాష్ట్ర నేతలు కమలనాధ్. సుధీర్,రమేష్. సురేంద్ర తో పాటు విజయవాడకు చెందిన వందలాది మంది హిందూవాదులు స్వాగతం పలికారు. కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.