ప్రతి విద్యార్ధి తల్లికి నేరుగా ఏడాది 15 వేలు
81,72,224 మంది విద్యార్థులకు లబ్ధి
విద్యార్ధి కుటుంబంలో చేరిన జగన్

(మార్తి సుబ్రహ్మణ్యం)

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఏది చేసినా సంచలనమే. ఏదైనా,ఎందులోనయినా తన మార్కు ఉండాల్సిందే. ప్రసంశలు, విమర్శల జడివానలో జగన్ తాను అనుకున్నవి చేసుకుంటూ వెళుతున్నారు. అందులో కొన్నింటిపై విమర్శలు. మరికొన్నింటిపై ప్రశంసలు. ఇప్పుడు వినూత్నంగా ప్రవేశపెట్టిన ‘అమ్మ ఒడి’ కూడా అంతే. స్కూలు, కాలేజీలకు వెళ్లే విద్యార్ధుల తల్లులకు నేరుగా ఏడాదికి 15 వేలు వారి ఖాతాలో వేసే ఈ పథకంతో, ఏపీ సీఎం జగన్ నేరుగా విద్యార్ధి కుటుంబంలో ఒకరిగా చేరిపోయారు. జనవరి 9 నుంచి చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు.
ఇచ్చిన మాట నెరవేర్చిన సీఎం
ఎన్నికల సమయంలో జగన్ నవరత్నాల హమీలలో ఇచ్చిన మరో కీలక హమీ నెరవేర్చనున్నారు. చదువుకు పేదరికం ఎప్పుడూ ఆటంకం కాకూడదన్న ఆలోచనతో జగన్ ప్రకటించిన, అమ్మఒడి కార్యక్రమానికి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 6455.80 కోట్ల భారీ నిధులు కేటాయించింది. ‘జగనన్న అమ్మఒడి’ పథకంగా పిలవబడే ఈ స్కీమ్ నవరత్నాల్లో కీలకమైనది. పిల్లలను బడికి పంపే ప్రతి అమ్మ బ్యాంక్ అకౌంట్లో ,సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నట్లుగానే ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకాన్ని ముందుగా 1-10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. ఇంటర్ వరకు వర్తింపజేయాలని మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థుల సంఖ్య 72,77,387 కాగా, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 8,94,837. అన్ని ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలకూ వర్తించేలా మళ్లీ నిర్ణయించారు. కాగా మొదటి విడతలో ఇప్పటివరకూ 42,80,823 మంది తల్లుల గుర్తింపుతో వారికి ప్రయోజనం చేకూరనుంది.
సంక్షోభంలో ఉన్నా భారీబడ్జెట్ కేటాయింపు
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క చిన్నారి బడికి దూరం కాకూడదన్న ఆశయంతో, జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం బడ్జెట్లలో ఈ పథకానికి ఏకంగా రూ.6,455.80 కోట్లు కేటాయించారు. ఓవైపు ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, ఇన్ని భారీ నిధులు కేటాయించటం సాహసోపేతమే. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రయివేట్ జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా జనవరిలో నేరుగా అన్ ఇన్ కంబర్డ్ బ్యాంక్ అకౌంట్లలో జమచేయనున్నారు. ఈ పథకం వల్ల డ్రాపౌట్లు తగ్గుతాయని.. పేద కుటుంబంలోని ప్రతి పిల్లాడికి విద్య అందడం ద్వారా, ఆయా కుటుంబాలు వృద్ధి చెందుతాయన్నది ప్రభుత్వ అంచనాగా కనిపిస్తోంది.
తక్కువయినా… చేయూత ఎక్కువే
నిజానికి ఏటా 15 వేల రూపాయలు తక్కువ మొత్తంగా కనిపిస్తున్నప్పటికీ, అది ఒకటి నుంచి ఐదవతరగతి వరకూ చదివే పేద, మధ్య తరగతి పిల్లల తల్లిదండ్రులకు ఇది ఆసరా. ఇక పదవతరగతి వరకూ చదివే మధ్య తరగతి పిల్లల తలిదండ్రులకు ఓ వరం. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు చదివే వారికి ఎంతో కొంత ఊతమిస్తుండగా, ప్రభుత్వ స్కూళ్లు,కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్లు,కాలేజీలు చదివే విద్యార్ధులకు ఇదో వరంగామారనుంది. ఇప్పటి వరకూ తమ పిల్లలను చదవించే ఆర్ధిక స్తోమత లేక చాలామంది తలిదండ్రులు తమ పిల్లలను సగంలో చదువు ఆపివేయించి, తమతోపాటు పనులకు పంపిస్తున్నారు. తాజాగా ప్రారంభం కానున్న అమ్మఒడితో ఈ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు లేకపోలేదు. దీనివల్ల సీఎం జగన్ కొన్ని లక్షలమంది విద్యార్ధుల కుటుంబాల్లో సభ్యుడుగా మారే అవకాశం లభించింది. పేద,మధ్య, సామాన్య కుటుంబాలకు మేలు జరిగినప్పుడు ఎవరైనా స్వాగతించాల్సిందే. సమాజానికి మంచి జరిగినప్పుడు సమర్ధించడం, పథకాలు జనం వద్దకు చేరనప్పుడు, చెడు జరిగే నిర్ణయాలను వ్యతిరేకించి సద్విమర్శలు చేయడం మీడియా విధి.

By admin

Close Bitnami banner