సిని‘మా’కు తప్పని రాజధాని సెగ

471

రాజధానికి మద్దతు ప్రకటిస్తేనే ‘సంక్రాంతి సినిమాలు’
లేకపోతే సినిమాల బహిష్కరణే
బాంబు పేల్చిన సుంకర పద్మశ్రీ
కాదంటే జనంతో..కలసిసొస్తే జగన్‌తో తంటా
సినిమా పెద్దల సంకటం

(మార్తి సుబ్రహ్మణ్యం)

ఎంకి పెళ్లి సుబ్బిచావు కొచ్చినట్లు.. అమరావతి రాజధాని తరలింపు వ్యవహారం తెలుగు సినిమా పరిశ్రమపెద్దలను ఇరకాటంలోపడేసింది. రాజధాని తరలింపునకు నిరసనగా రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనపై ఇప్పటివరకూసినిమా పెద్దలెవరూ పెదవి విప్పని వైనంపై ఆగ్రహించిన రాజధాని రైతులు, సినిమా పరిశ్రమ పక్కలో బాంబు లాంటి హెచ్చరిక జారీ చేశారు. కాగా, రాజధాని ఆందోళనపై సినిమా పరిశ్రమ పెదవి విప్పకపోవడంపై ‘సూర్య’లోఇటీవలే వార్తా కథనం వెలువడిన విషయంతెలిసిందే.రాజధానిపై సినిమా స్టార్లు మాట్లాడరేం?
తాజాగా రాజధాని పరిరక్షణ సమితి నేత, పిసిసిఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ.. సినిమా పరిశ్రమకు చేసిన హెచ్చరికలు సంక్రాంతి సినిమాలకు గండంలా మారేప్రమాదం తెచ్చిపెట్టింది. ఇటీవల జగన్‌కు చెప్పు చూపించి సంచలనం సృష్టించిన పద్మశ్రీ ఈసారి సినిమా పరిశ్రమకు చేసిన హెచ్చరిక ఫిలింనగర్‌ను ఇరకాటంలో పడేసింది. ఏపీ నుంచి 75 శాతం ఆదాయం పొందుతూ, ఇక్కడే ఆస్తులు సంపాదించుకున్న హీరో, దర్శక, నిర్మాతలెవరూ రాజధాని రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించని వైనంపై పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ సినిమాలకు, సంపాదనకు,భూముల కొనుగోళ్లకు, సినిమా హాళ్ల లీజులకు ఆంధ్రాజనం కావాలా? కానీ ఆంధ్రులకు ఆత్మగౌరవంలా నిలిచిన అమరావతి రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తుంటే, అది మీకు అవసరంలేదా? రైతులు నిద్రాహారాలు మాని రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు.మహిళలను పోలీసులు అమానవీయంగా కొడుతున్నారు. అవి మీడియాలో మీరు చూడటం లేదా? మహిళలపై దాడులు జరుగుతుంటే హీరోయిన్లు ఏమయ్యారు. ఇవన్నీ మీకు పట్టవా? ఏం మీరు ఆంధ్రరాష్ట్రంలో పుట్టలేదా? మీకు ఆత్మాభిమానం లేదా? ఆంధ్రా రైతులపై పోలీసులు లాఠీ చార్జి చేస్తుంటే కళ్లప్పగించి చూస్తారా? మీ ఆస్తులు హైదరాబాద్‌లో ఉన్నందున మాకేం కాదనుకుంటారా? అందుకే ఆంధ్రా ప్రజలు, రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణం రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించకపోతీ, మీ సంక్రాంతి సినిమాలు చూడవ ద్దని పిలుపునిస్తున్నాం. అంతేకాదు, మద్దతు ప్రకటించని హీరోల సినిమాలు చూడవద్దని పిలుపునిస్తాం. ఏం? మహేష్,నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్,రామ్ గుంటూరు-కృష్ణా-ప్రకాశం జిల్లాల వాళ్లే కదా? ఎందుకు స్పందించరు? ఎన్నికల ముందు జగన్‌కు జైకొట్టిన రచయిత పోసాని మురళీకృష్ణ ఎందుకు మాట్లాడరు?ఆయనెక్కడున్నారు? సినిమా పరిశ్రమలో ఉన్న గోదావరి జిల్లా వాళ్లకు ఏమయింది? అందుకే మేం దీనిపై సినిమా పరిశ్రమ పెద్దలు, ‘మా’కు బహిరంగ లేఖలు రాస్తున్నాం. వాటిని మళ్లీ వారికి పోస్టు చేస్తాం. దానిపై ఒకరోజులో స్పందించకపోతే సంక్రాంతి సినిమాల బహిష్కరణే’నని పద్మశ్రీ హెచ్చరించారు.
ఈ పరిణామాలు సినిమా పరిశ్రమ పెద్దలకు సంకటంలా పరిణమించింది. ఒకవేళ ప్రాంత అభిమానంతో రైతులకు మద్దతునిస్తే, ప్రభుత్వపరంగా జగన్‌తో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటివరకూ కొత్త సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. రైతులకు మద్దతునిస్తే ఆ వెసులుబాటు ఉండదు. సినిమాహాళ్లు దక్కవు. జగన్ కక్ష సాధిస్తే ఎలా ఉంటుందో వారికి తెలుసు. పోనీ, ప్రభుత్వానికి మద్దతునిస్తే ప్రజలు సినిమాలు చూడరు. వారు చూడకపోతే ఆదాయం రాదు. సినిమాలకు సగానికిపైగా ఆదాయం ఏపీ నుంచే వస్తోంది. అందులోనూ సంక్రాంతి సినిమాలంటే బోలెడు అంచనాలు. కోట్లు ఖర్చు పెట్టి సంక్రాంతి సినిమాల పోటీకి రంగంలో దిగుతున్నారు. వాటిని జనం బహిష్కరిస్తే పెట్టిన పెట్టుబడి గోవిందా. ఇదీ సినీ పరిశ్రమ సంకటం.ఇది కూడా చదవండి:రాజధానిపై సినిమా స్టార్లు మాట్లాడరేం?