సీఎంకు సీమ నుంచే చుక్కెదురు

459

విశాఖ వద్దంటున్న సీమ నేతలు
ఉంటే అమరావతి లేదా కర్నూలు
విశాఖ మాకు చాలా దూరమంటున్న సీమ జనం
మైసూరా లేఖతోమరోసారి రాష్ట్ర వాదన తెరపైకి
ఆరు జిల్లాలతో గ్రేటర్ సీమ కావాలన్న కోట్ల
మంత్రాలయం,అనంతను కర్నాటకలో కలపాలని మరో వాదన
రాజధాని రచ్చలో మరో ట్విస్టు
జగన్ వ్యూహం రివర్సవుతోందా?

(మార్తి సుబ్రహ్మణ్యం)

రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న ఏపీ సీఎం జగన్ వ్యూహం సొంత రాయలసీమలోనే బెడిసికొడుతోంది. రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేసి, మూడు రాజధానుల ఏర్పాటుతో అభివృద్ధిని పంచకల్యాణి గుర్రంలా పరుగులు తీయిస్తానన్న జగన్ ఆలోచనా ధోరణిని, రాయలసీమ ప్రజలే అంగీకరించకపోవడం ఆసక్తికరంగా మారింది. రెండురోజులు ప్రయాణించేంత దూరంలో ఉన్న రాజధాని తమకు అవసరం లేదని సీమ జనం కుండబద్దలు కొడుతున్నారు. ఉంటే అమరావతిని లేదా కర్నూలులో రాజధానిని ఏర్పాటుచేయాలని నిర్మొహమాటంగా చెబుతున్నారు. దీనితో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేసి, సీమ వాసుల మెప్పు పొందాలన్న జగన్ వ్యూహంఫలించకపోగా, వికటించేలా కనిపిస్తోంది.
జగన్ ఆలోచన సమ్మతం కాదంటున్న సీమ జనం
విశాఖలో రాజధాని ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజలను, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ద్వారా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లా వాసులను ఏకకాలంలో సంతృప్తి పరచడంద్వారా, వైసీపీనిబలోపేతం చేయాలన్న సీఎం జగన్ వ్యూహానికి సొంత ప్రాంతంలోనే చుక్కెదురవుతోంది. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని, సీమ హక్కులను పరిరక్షించాలంటూ దశాబ్దాల నుంచి పోరాడుతున్న సీమ ప్రముఖులే… విశాఖను రాజధానితోపాటు, కర్నూలులో హైకోర్టు పెట్టాలన్న జగన్ ప్రయత్నాన్ని వ్యతిరేకించటం విపక్షాలకు కొత్త అస్త్రం ఇచ్చినట్టయింది. పైగా.. రాష్ట్ర విభజన తర్వాత నిద్రాణంగా ఉన్న రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తుట్టెను మరోసారి కదిలించినట్టయింది. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డయితే ఆరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ రాష్ట్ర వాదనను తెరపైకి తీసుకురావటం చర్చనీయాంశమయింది. తాజాగా మంత్రాలయం, అనంతపురం వాసులు తమకు విశాఖ కంటే బెంగళూరు దగ్గర కాబట్టి, తమను కర్నాటక రాష్ర్టంలో విలీనం చేయాలన్న కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు.నిజానికి అనంతపురం వాసులు విభజన సమయంలో తమను తెలంగాణలోనే ఉంచాలని కోరుకున్నారు. ఇప్పుడు బెంగళూరు దగ్గరకాబట్టి ఆ రాష్ట్రంలోవిలీనంచేయాలన్న డిమాండుకు తెరలేపారు. బెంగళూరు ఎయిర్‌పోర్టు హిందూపురానికి ఎంత దూరం ఉంటుందో, బెంగ ళూరు సిటీకీ అంతే దూరం ఉంటుందని చెబుతున్నారు. ‘మంత్రాలయానికి విశాఖ వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది. దానికంటే బెంగుళూరు వెళ్లడం తేలిక. పైగా మాకు కర్నాటక నుంచే నీళ్లువస్తాయి. అయినా కర్నూలుకు హైకోర్టు వస్తే మా ప్రజలకు లాభమేంట’ని టిడిపి నేత తిక్కారెడ్డి ప్రశ్నించారు.
మైసూరా లేఖతో మళ్లీ తెరపైకి సీమ రాష్ట్ర డిమాండ్
సీమ ప్రముఖులైన డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి, శైలజానాధ్, మధుసూదన్‌గుప్తా, మాజీ డిజిపి దినేష్‌రెడ్డి, ఆంజనేరెడ్డి, డాక్టర్ శివరామకృష్ణ వంటి నేతలు ఇటీవల జగన్‌కు రాసిన లేఖలో శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రస్తావించారు. సీమను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని, కర్నూలునుంచి తరలించిన రాజధానిని, తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియర్ నేత మైసూరారెడ్డి, డాక్టర్ ఎం.వి.రమణారెడి ్డవంటి నేతలు దశాబ్దాల నుంచి సీమ హక్కులను ప్రస్తావిస్తున్నారు. పోరాడుతున్నారు. విభజనకు ముందు జెసి దివాకర్‌రెడ్డి సహా చాలామంది ప్రముఖులు అనంతపురంజిల్లా సహా మూడు జిల్లాలను తెలంగాణలో విలీనంచేసి గ్రేటర్ తెలంగాణ /గ్రేటర్ రాయలసీమ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. సీమ ప్రజలను ఆంధ్రా ప్రజలతో కలవరని వాదించారు.
కోట్లది గ్రేటర్ రాయలసీమ డిమాండ్
తాజాగా సీనియర్ నే త, కర్నూలు జిల్లా టిడిపి నేత, మాజీ ఎంపి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి మరోఅడుగు ముందుకేసి, గ్రేటర్ రాయలసీమ రాష్ట్ర వాదన వినిపించారు. విశాఖలో రాజధానిని అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. ‘ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు,కడపతో కలిపి గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఏర్పాటుచేయాలి. లేకపోతే ఇప్పుడున్న అమరావతినే కొనసాగించాలి. ఈ రెండూ కాకుండా విశాఖకుతరలిస్తామంటే ఒప్పుకునేదిలేద’ని కోట్ల ఖరాఖండీగా చెప్పారు. జగన్ ప్రత్యేక విమానంలో,కార్లలో కాకుండా అనంతపురం,కడప నుంచి బస్సులో విశాఖకు వెళ్లిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవాలని వ్యంగ్యాస్త్రం సంధించారు.
నాడు బిజెపిదీ సీమ వాదనే
నిజానికి టిడిపినుంచి బిజెపి విడిపోయిన తర్వాత, ఎన్నికల ముందు బిజెపి కూడా రాయలసీమ హక్కులను తెరపైకి తెచ్చింది. బాబు సర్కారు సీమకు అన్యాయం చేసిందని, తమ పార్టీ అధికారంలోకివస్తే, సీమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. సీమ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలని కోరింది. తర్వాత జగన్ తీసుకున్న కర్నూలులో హైకోర్టు నిర్ణయాన్ని మాత్రమే సమర్థించి, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని స్పష్టం చేసింది.
అంతదూరం ఎలా వెళతాం?
ఈ నేపథ్యంలో విశాఖలో రాజధాని, కర్నూలులో హైకోర్టును ప్రతిపాదించిన జగన్‌ను సీమ వాసులు వ్యతిరేకిస్తుండటం చర్చనీయాంశమయింది. విశాఖకు రాయలసీమ దాదాపు 900 కిలోమీటర్ల దూరం ఉంటుందని, అక్కడికి వెళ్లాలంటే ఒకటి, రెండు రోజులు ప్రయాణించాల్సి ఉంటుందని వాదిస్తున్నారు. విశాఖకు చిత్తూరు 830 కిలోమీటర్లు, కడప నుంచి 730, కర్నూలు నుంచి700, అనంతపురం నుంచి దాదాపు 900 కిలోమీటర్లదూరం ఉంటుందని, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అన్ని వందల కిలోమీటర్ల దూరంలో రాజధానికి వెళ్లడం అవసరమా అన్న ప్రశ్నలు రాయలసీమ వాసుల నుంచి వినిపిస్తున్నాయి. దీనికంటే తమకు హైదరాబాద్, బెంగళూరు,చెన్నై దగ్గర అంటున్నారు. విశాఖకు వెళ్లాలంటే దాదాపు 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందని, బస్సులో అయితే రెండురోజులు ప్రయాణానికే పోతుందన్న వాదన వినిపిస్తోంది. కడప నుంచి అయితే బస్సులో 14 గంటలు పడుతుందని, అదే భారీ వాహనాల్లో అయితే ఒక ఐదుగంటలు తగ్గుతుందంటున్నారు. కానీ వాహనాలో ్లవెళ్లే శక్తి సీమలో ఎంతమందికి ఉంటుంది? అంతదూరంలోఉండే విశాఖ దగ్గరా? లేక 300 కిలోమీటర్ల నుంచి 450 కిలో మీటర్ల దూరం ఉన్న అమరావతి దగ్గరా? అమరావతికి అయితే రాత్రి బస్సెక్కితే తెల్లవారున బెజవాడలో దిగవచ్చు. అదే విశాఖకు వెళ్లాలంటే దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది? దీనివల్ల మా ప్రాంతంవారికి ఏంఉపయోగం? ఒకవేళ అంత వ్యయ ప్రయాసలకోర్చి విశాఖకు వెళితే, సంబంధిత అధికారి ఆరోజు సెలవు పెడితే మా పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు సీమ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
రాజధాని అడిగితే హైకోర్టు అంటారేం?
తాము కర్నూలు రాజధానిగా కావాలని డిమాండ్ చేస్తుంటే, జగన్ ప్రభుత్వం హైకోర్టు ఇస్తామనడంవల్ల తమకేం ఒరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. రాజధాని తమకు ఇచ్చి, కావాలంటే హైకోర్టు ఎక్కడైనా పెట్టుకోమని చెబుతున్నారు. హైకోర్టు వల్ల న్యాయవాదులు, దాని పరిసర ప్రాంతాల్లో వెలిసే జిరాక్సు షాపులు, డిటిపి సెంటర్లు, క్యాంటిన్లకే ఉపయోగమని వాదిస్తున్నారు. కేవలం కేసులు ఉన్న వారే అక్కడికి వెళతారంటున్నారు. బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి సైతం ఇటీవల ఇదే వ్యాఖ్య చేశారు. అయినా కర్నూలులోనే ఉన్న రాజధానినే తిరిగి ఏర్పాటుచేయాలని కోరుతున్నామే తప్ప, అందులో కొత్త డిమాండేమీ లేదని సీమ నేతలు స్పష్టంచేస్తున్నారు. గతంలో కర్నూలు రాజధానికి పొలాలిచ్చి నష్టపోయిన తమను ఇప్పటి అమరావతి రైతుల మాదిరిగా ఎవరూపట్టించుకోలేదని, ప్రాజెక్టుల నిర్మాణంలోభూములు పోయిన తమకు పరిహారం గురించి ఎవరూ నినదించలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా అమరావతి రైతులకు కౌలు, ప్లాట్లు ఇస్తున్నారని..కర్నూలు రాజధానిగాఏర్పాటయినప్పుడు తమకు ఇలాంటి సౌకర్యాలు ఇవ్వలే దని చెబుతున్నారు.
అయితే కర్నూలు.. లేదంటే అమరావతి
ఈ నేపథ్యంలో సీమ వాసుల నుంచి రెండే ప్రధాన డిమాండ్లు వినిపిస్తున్నాయి. కర్నూలులో రాజధానిని ఏర్పాటుచేయాలని, లేకపోతే ఇప్పుడు ఉన్న అమరావతినే కొనసాగించాలని రాయలసీమ వాసులు స్పష్టం చేస్తున్నారు. తాము విశాఖ కంటే అమరావతికే ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నారు. ఈ రెండూ కాకుండా.. విశాఖలో ఏర్పాటుచేస్తే అంగీకరించే సమస్య లేదని, రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలని వాదిస్తున్నారు.