జగన్ కోర్టుకు వెళతారా?

533

హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశం
సీఎంగా హాజరయితే నైతిక విలువల మాటేమిటి?
గతంలో పివి, జయలలిత, లాలూ హాజరు
పైకోర్టుకు వెళతారా?
నైతిక సంకటంలోజగన్

( మార్తి సుబ్రహ్మణ్యం)

అక్రమాస్తుల కేసులో గతంలో అరెస్టయి, బెయిల్‌పై విడుదలయిన ఏపీ సీఎం జగన్‌కు ఇప్పుడు నైతిక సంకటం వచ్చి పడింది. విపక్ష నేతగా ఉన్నంతవరకూ ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరైన జగన్, సీఎం అయిన తర్వాత హాజరుకావడంలేదు. ఆ సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలు, ఢిల్లీ పర్యటనలుండేవి. పైగా తాను సీఎం హోదాలో ప్రతివారం కోర్టుకు హాజరవుతే 60లక్షల ప్రజాధనం ఖర్చవుతుందని ఆయన న్యాయవాది కోర్టులో వాదించి, జగన్‌కు హాజరుపై మినహాయింపు ఇవ్వాలని అభ్యర్ధించారు.
అయితే, జగన్‌పై నమోదైన కేసుల సమయంలో ఆయన సీఎంగా లేరని, కోర్టుకు వ్యక్తుల స్థాయితో సంబంధంలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తాజాగా సీబీఐ కోర్టు.. జగన్, ఎంపి విజయసాయిరెడ్డి ప్రతి వారం కోర్టుకు హాజరుకావలసిందేనని ఆదేశించారు. నేరానికి,హోదాకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ప్రతిసారి వాయిదాలు కోరడంపై అసహనం వ్యక్తం చేస్తూ..ఈ నెల 10వ తేదీన తప్పనిసరిగా వారిద్దరూ కోర్టుకు హాజరుకావలసిందేనని ఆదేశించారు.
సీబీఐ కోర్టు తాజా ఆదేశంతో రాష్ట్ర రాజకీయాలు ఏ దిశగా పయనిస్తాయన్న చర్చకు తెరలేచింది. సీబీఐ కోర్టు తీర్పుపై జగన్-విజయసాయిరెడ్డి పైకోర్టుకు అప్పీలు లేదా స్టేకు వెళతారా? లేకపోతే తీర్పునకు కట్టుబడి కోర్టుకు హాజరవుతారా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఒ వేళ పైకోర్టు స్టే ఇస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. న్యాయంకోసం పైకోర్టులకు వెళ్లడాన్ని ఎవరూ ఆక్షేపించరు. గతంలో చంద్రబాబు సహాపెద్ద నేతలంతా పైకోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న వారే. కానీ, పైకోర్టు కూడా జగన్ హాజరు విషయంలో సీబీఐ కోర్టు ఆదేశాన్నే సమర్ధిస్తే, అప్పుడు తలెత్తే నైతిక సంకటంపైనే పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
గతంలో బాబు స్టేలపై మంత్రుల విసుర్లు..
ఎందుకంటే.. ఇప్పటికే టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్లు.. తమకు చంద్రబాబు మాదిరిగా స్టేలు తెచ్చుకునే అలవాటు లేదని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ఏదైనా సరే కోర్టులోనే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని బొత్స అనేకసార్లు చెప్పారు. ముఖ్యంగా బొత్స కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచీ బాబుపై ఇదేరకంగా దాడి చేస్తున్నారు. ఆ ప్రకారంగా.. ఇప్పుడు జగన్ స్టే కోసం పై కోర్టును ఆశ్రయిస్తే, టిడిపి, బిజెపి, జనసేనకు జగన్-బొత్స లక్ష్యం కావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కోర్టుకు హాజరవుతారా?లేదా?
అదీకాకుండా, ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కోర్టుకు హాజరైతే, అది కచ్చితంగా నైతిక వ్యవహారమే అవుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి వారం కోర్టుకు హాజరయ్యే వ్యక్తి కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నారని, ఇప్పటికే విపక్షాలు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నాయి. ఇక జగన్ నేరుగా కోర్టుకు హాజరైతే, నైతిక విలువలుంటే ఆయన తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకురావడం ఖాయం. ఆ ప్రకారం తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. నిజంగా అదే జరిగితే తన స్ధానంలో మరొకరిని సీఎంగా ప్రతిష్ఠించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భవిష్యత్తు పరిణామాలపై ఏం చేయాలన్న ప్రశ్న జగన్ ముందు కనిపిస్తోంది.
ఎందుకంటే.. సీఎం అయిన తర్వాత ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో, నైతిక విలువల గురించి మాట్లాడిన జగన్.. తమ పార్టీలో ఏ ఎమ్మెల్యే చేరాలన్నా, నైతిక విలువలు అనుసరించి, ఆ పార్టీకి రాజీనామా చేసి రావాలని విస్పష్టంగా చెప్పారు. ఎవరు పార్టీ ఫిరాయించినా వారిపై అనర్హత వేటు వే యాలని స్పీకర్‌ను నిండు సభలో కోరారు. ఆ ప్రకారమే ఇప్పటికి ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు తనను కలసినప్పటికీ, వారిని నేరుగా వైసీపీలోకి చేర్చుకోలేదు. కాకపోతే వారిని టిడిపికి దూరం చేసే వ్యూహానికే పరిమితమవుతున్నారు. మరి ఆ స్థాయిలో నైతిక విలువలు పాటించే జగన్..కోర్టుకు హాజరయినప్పడు తన పదవికి రాజీనామా చేస్తారా? లేక పాత సంప్రదాయాలు పాటించి కోర్టు తీర్పును గౌరవిస్తారా అన్నది చూడాలి.
గతంలో దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు, జార్ఖండ్ సీఎం శిబూసోరెన్, జయలలిత, లాలూ ప్రసాద్ కూడా కోర్టు విచారణకు హాజరయిన విషయం తెలిసిందే.కర్నాటకలో సీఎంగా పనిచేసిన యడ్యూరప్ప లోకాయుక్తకు హాజరయ్యారు. ఆ ప్రకారంగా సీఎం హోదాలోనే జగన్ కోర్టుకు హాజరవుతారా అన్నది చూడాలి. ఏదేమైనా వారం రోజుల పాటు విపక్షాలకు ఈ అంశం ఆయుధం కానుంది. ఆ సందర్భంలో వైసీపీ కూడా బాబు ఎన్ని కేసుల్లో స్టే తెచ్చుకున్నారన్న అంశాన్నీ మరోసారి తెరపైకి తెచ్చి ఎదురుదాడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది.