జగన్.. ఆడు మగాడ్రా బుజ్జీ!

474

ఆర్టీసీ విలీనంతో ఆనందోత్సాహాలు
51 వేలకు పైగా ఉద్యోగుల కుటుంబాల్లో భరోసా
ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేర్చిన జగన్
దేశంలోనే తొలిసారిగా రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వంలో విలీనం
ఆర్ధికంగా భారమైన లెక్కచేయని జగన్

( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్.. మొండోడేకాదు. మగాడు కూడా! ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత చాలామంది నోటి నుంచి వచ్చిన మాట ఇది. రాష్ట్రంలో ఏ సీఎంకూ సాధ్యం కాని ఆర్టీసి విలీనాన్ని సుసాధ్యం చేసిన తర్వాత మరికొందరు ఆశ్చర్యపోతూ చేసిన వ్యాఖ్యలివి! తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉత్తర్వులిచ్చిన జగన్ ధైర్యాన్ని చూసి, 51 వేల ఆర్టీసీ కుటుంబాలు ఆనందంతో ఇచ్చిన కితాబు ఇది! జగన్ ఎలాంటివాడైనా అతనిలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే దమ్ముంది. ఇది ఆయన తీరు నచ్చని వారు సైతం చేసిన వ్యాఖ్యలు. మొత్తంగా జగన్‌ను ఆడు మగాడ్రా బుజ్జీ అనేస్తున్నారు.
‘మీరు చూస్తూ ఉండండి. మూడు నెలల్లో ఆంధ్రాలో ఏం జరుగుతుందో’- తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనంచేయాలంటూ సమ్మె కట్టినప్పుడు మీడియాతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు
‘ఇదంతా ఆర్టీసీ కార్మికులను మోసం చేసేందుకే. ఆచరణలో సాధ్యంకాదు.దీనివల్ల ఆర్టీసీ ఉనికి కోల్పోతుంది. బస్సుల అమ్మకాలు,భూముల లీజులను తన పార్టీ వారికి ఇచ్చుకునేందుకు జగన్ వేసిన ఎత్తు ఇది’- ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న జగన్ ప్రకటనపై విపక్షాలు చేసిన విమర్శలు.
జనవరి 1, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన రోజు. ప్రజలందరికీ అది మామూలుగా వచ్చే కొత్త సంవత్సరమయితే.. 51 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు మాత్రం అది పండగ సంవత్సరం. ఎందుకంటే ఇప్పటివరకూ కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉన్న వారందరూ, ఇకపై ప్రభుత్వ ప్రజారవాణా శాఖ ఉద్యోగులయ్యారు కాబట్టి. అందుకే ఆరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంబరాల్లో కుటుంబసభ్యులతో సహా తమ ఆనందం పంచుకున్నారు. తమ బతుకులకు భద్రత ఇచ్చిన జగన్‌కు కృతజ్ఞత చెబుతూ పాలాభిషేకాలు చేశారు. నిజంగా దేశవ్యాప్తంగా కార్పొరేషన్ల నీడలో ఉన్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి, చరిత్ర సృష్టించిన ఘనత జగన్‌కే దక్కింది. నేనున్నాను.. నేను విన్నానని పాదయాత్రలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని ఏడు నెలలలోనే నెరవేర్చిన సీఎంగా వారి హృదయాల్లో నిలిచిపోయారు. ఆ రకంగా ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను జగన్ నెరవేర్చారు.నిజానికి జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఖజానాపై భారం పడేదే అయినప్పటికీ, ఆయన దానిని లెక్కచేయకుండా తాను ఇచ్చిన హామీ నిలబెట్టుకుని అందరి ప్రశంసలు పొందారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే రూ.6,400 కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నప్పటికీ సంస్థ విలీనం కొనసాగింది. దీనికి తోడు ఏటా రూ.3,600 కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వం తన భుజాన వేసుకుంది. విలీనం వల్ల సంస్థలోని అన్ని విభాగాల్లో పని చేస్తున్న 51,488 మందికి లబ్ధి చేకూరనుంది. వారికి చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణా శాఖలో విలీనమైన వెంటనే చెల్లించనుంది.
నాటి హామీ అది
పాదయాత్రలో పలు చోట్ల ఆర్టీసీ కార్మికుల కష్టాలు స్వయంగా నాటి విపక్షనేత జగన్ వారి బాధలు విన్నారు. తమను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న సంస్థ ఉద్యోగులు, కార్మికుల కోరిక సమంజసమన్నారు. తాను అధికారంలోకి వస్తే మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పభుత్వం ఆర్టీసి విలీనానికి సంబంధించి సమగ్ర అధ్యయనం చేశారు. ఆ సంస్థకు గతంలో ఎండీగా పని చేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. 90 రోజుల పాటు అన్ని అంశాలు, అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన ఆ కమిటీ, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేశారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ఈ శాఖ కిందకు వచ్చారు. మరో వైపు సంస్థలో ఇప్పుడున్న పదవీ విరమణ వయసును మరో రెండేళ్లు పెంచి 60 ఏళ్లు చేశారు. ఇంకా బస్సు చార్జీలు నిలకడగా ఉండేలా ట్రాన్స్‌పోర్టు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఇదో మంచి నిర్ణయం.
కనుమరుగైన ఏపీఎస్‌ఆర్టీసీ
ఏపీఎస్ ఆర్టీసి. దీనికి దేశంలో మంచి పేరుంది. 75 ఏళ్లకు పైబడి సుధీర్ఘ సేవలందిస్తూ, అతి పెద్ద సంస్థగా గిన్నిస్ బుక్‌లోనూ స్థానం సంపాదించుకుంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ప్రతి రోజూ దాదాపు 85 లక్షల మందిని గమ్యస్ధానాలకు చేరుస్తూ, అందరి అవసరాలు తీరుస్తోంది. ఇప్పుడు సీఎం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో ఇక నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వంలో ప్రజా రవాణా విభాగంగా మారనుంది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కూడా వర్తిస్తాయి. సంస్థలో గత ఐదేళ్లుగా కార్మికులు ఎదురు చూస్తున్న కారుణ్య నియామకాలకు కూడా జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందు కోసం తొలి విడతలో 2015 డిసెంబరు 31 వరకు 237 మందితో కూడిన జాబితాను ఆమోదించారు. అదే విధంగా కండక్టర్ల అభ్యర్థుల ఎత్తును 153 సెంటీమీటర్ల నుంచి 145 సెంటీమీటర్లకు తగ్గిస్తూ నిబంధనలు సవరించారు. అలాగే డ్యూటీకి గైర్హాజరైన మొత్తం 135 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఇంకా కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసు క్రమబద్ధీకరించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. దానితోపాటు ఆర్టీసీలో సుమారు 54 వేల మందికి ముందస్తుగా అన్ని రకాల వైద్య పరీక్షలు అందనున్నాయి. ఇప్పటివరకు ఇలా కంటి పరీక్షలు మాత్రమే నిర్వహించే వారు. ఇక నుంచి కార్మికులు, ఉద్యోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటన్నింటిపై సంస్థలో కార్మిక సంఘాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ని సౌకర్యాలు సమకూర్చినందుకే వాళ్లంతా జగన్‌ను.. ఆడు మగాడ్రా బుజ్జీ అంటున్నారు.