జగన్‌కు కడప రాజధాని జంజాటం

556

కడపలోనే రాజధాని పెట్టాలని కొత్త డిమాండ్
ఉంటే అమరావతి లేదంటే కడపలో పెట్టండి
సొంత జిల్లాలోనే సీఎంకు సంకటం
రాజధానిపై టిడిపి ప్రతివ్యూహం

( మార్తి సుబ్రహ్మణ్యం)

మూడు రాజధానుల ప్రతిపాదనతో టిడిపిని దెబ్బతీయాలన్న సీఎం జగన్ వ్యూహానికి తెలుగుదేశం ప్రతివ్యూహం రచించింది. ఇప్పటికే కర్నూలు కేంద్రంగా రాజధాని ఏర్పాటుచేసి, తమ పాత రాజధానిని తమకు ఇచ్చేయాలంటూ రాయలసీమ ప్రముఖులు సీఎంకు లేఖ రాశారు. దానికి కొనసాగింపుగా..జగన్‌ను ఇరికించేందుకన్నట్లు, జగన్‌కు సొంత జిల్లాపై ఏ మాత్రంఅభిమానం ఉన్నా కడపలోనే రాజధాని ఏర్పటు చేయాలన్న కొత్త డి మాండ్‌ను, టిడిపి ఆధ్వర్యాన నిర్వహించిన అఖిలపక్షం తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశమయింది.
కాంగ్రెస్ నుంచి తెరాస చేతిలోకి తెలంగాణ ఉద్యమం
ప్రాంతీయ భావనను ఒకసారి కదిపితే, అది ఎటు తిరిగి ఎటువెళుతుందో ఎవరికీ తెలియదు. చివరకు అలాంటి భావన పుట్టించిన వారి చేతుల్లో కూడా నియంత్రించే అధికారం,అవకాశం ఉండదు. తెలంగాణ ఉద్యమమే అందుకు ఉదాహరణ. టిడిపిని దెబ్బతీయడానికి వైఎస్ సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆధ్వర్యాన ఎమ్మెల్యేలంతా కలసి తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుచేయాలన్న డిమాండును తెరపైకి తీసుకువచ్చారు. నిజానికి వైఎస్ పూర్తి సమైక్యవాది అయినప్పటికీ, టిడిపిని రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆ వ్యూహానికి తెరలేపారు. అయితే తెలంగాణ డిమాండ్ ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నప్పటికీ, చిన్నారెడ్డి బృందం మళ్లీ దానిని తెరపైకి తెచ్చిన తర్వాతనే ఆ డిమాండ్ మరింత ఊపందుకుంది. చివరకు అది తెలంగాణ వాదనను తెరపైకి తెచ్చిన కాంగ్రెస్ చేతిలో కాకుండా, కేసీఆర్ చేతుల్లోకి వెళ్లింది.
నాడు కేసీఆర్ నిర్ణయాన్నీ సహించని తెలంగాణవాదులు
కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడే అనేక జేఏసీలు ఏర్పడ్డాయి.అందులో విద్యార్ధి జెఏసీ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. అయితే, కొన్ని జెఏసీలు, ఉద్యమ సంస్థల నేతలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాయి. అప్పటికే ఉద్యమం పతాకస్థాయికి చేరుకోవడంతో, కేసీఆర్ కూడా వాటిని నియంత్రించకలేకపోయారు.అంతెందుకు? ఖమ్మంలో కేసీఆర్ దీక్ష విరమించారంటూ వార్తలు వెలువడిన వెంటనే, తెలంగాణ ఉద్యమ సంస్థలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి, చాలాచోట్ల ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అంటే భావోద్వేగాల అంశాలను స్పృశించిన సందర్భాల అనంతరం జరిగే ఘటనలు, నాయకుల చేతిలోనూఉండవని స్పష్టమయింది.
ఇప్పుడు అదే దారిలో ఆంధ్రప్రదేశ్
ఇప్పుడు ఏపీలోనూ అలాంటి అంశమే తెరపైకి వచ్చి,అలాంటి ప్రతిపాదన తెచ్చిన నేతకు ఇరకాటంలా పరిణమించింది. పరిపాలనా సౌలభ్యం, పాలనా వికేంద్రీకరణ కోసం అమరావతిలో ఉన్న రాజధానిని విశాఖకు, అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించాలని జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై సీఎం జగన్ ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయకపోయినా, మంత్రులు మాత్రం అదే అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు.కమిటీలు,దానిపై మరో హైపవర కమిటీ ఏర్పాటుచేశారు.పైగా రాజధానిని విశాఖ మారుస్తామని సీఎం గానీ, మేంగానీ ఎప్పుడైనా చెప్పామా? అని కొన్నిసార్లు… చంద్రబాబు బంధువులు,టిడిపి నేతలు కొన్న భూముల రేట్లు పెరగడానికి మేం అక్కడ రాజధానిని ఉంచాలా అని మరికొన్ని సార్లు మంత్రులు చేస్తున్న ప్రకటనలతో, రాజధాని విశాఖకు వెళుతుందన్న భావన అందరిలోనూకనిపిస్తోంది. పైగా సచివాలయాన్ని విశాఖకు తరలించేందుకు ఫలానా తేదీలోగా ఏర్పాట్లు చేయాలన్న మౌఖిక ఆదేశం వచ్చిందన్న లీకు వార్తలు కూడా ఈ ఆందోళన,ప్రచారానికి కారణమవుతున్నాయి.
విశాఖ రాజధానపై రాయలసీమలోనే వ్యతిరేకత
ఆ ప్రకారంగా..విశాఖలో రాజధానిని ఏర్పాటుచేయాలన్న సీఎం ప్రతిపాదనపై రాయలసీమలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖకు తమకు 900 కిలోమీటర్లు దూరమని, దానికంటే అమరావతి బెటరంటూ సీమ ప్రముఖులు గళంవిప్పుతున్నారు. తమ ప్రధమ డిమాండ్ కర్నూలు కేంద్రంగా రాజధాని ఏర్పాటుచేయాలని, లేకపోతే అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కడప జిల్లాకు చెందిన ప్రతిపక్షపార్టీలు, సంఘాలు ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో వినిపించిన కొత్త గళం సీఎం జగన్‌కు స్థానిక సంకటం తెచ్చింది.
కడపలో రాజధాని డిమాండ్‌తో కొత్త సంకటం
సీఎం జగన్‌కు ఏమాత్రం కడపపై ప్రేమ ఉన్నా, విశాఖలో కాకుండా డపలోనే రాజధానిని ఏర్పాటుచేయాలన్న కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. శుక్రవారం కడపలో ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న టిడిపి, ఇతర నేతలు ఈ డిమాండును తెరపైకి తీసుకువచ్చారు. టిడిపి,బిజెపి, కాంగ్రెస్, సీపీఐ, ఆర్‌సీపీ, జనసేన,జనతాదళ్ పార్టీ నేతలు దానికి హాజరయ్యారు. మొదటి ఆప్షన్‌గా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని, రెండో ఆప్షన్ ఉంటే కడపలో రాజధానిని ఏర్పాటుచేయాలని తీర్మానించారు. ఆ మేరకు జగన్ కడపలో రాజధానిని ఏర్పాటుచేస్తే తామంతా పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతునిస్తామని భరోసాఇచ్చారు. నిజంగా జగన్‌కు కడపపై ప్రేమ ఉంటే, కడపలోనే రాజధానిని ఏర్పాటుచే యాలని డిమాండ్ చేయడంతో రాజధాని తరలింపు అంశంకొత్త మలుపు తిరిగినట్టయింది.
టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చంగల్రాయుడు మాట్లాడుతూ.. రాజధాని ఏర్పాటుకు కావలసిన వనరులు కడపలోనే ఉన్నాయని, 6 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయని, ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ కనెక్టివిటీ ఉందన్నారు. రైల్వేకోడూరు-తిరుపతి మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలని తాను గతంలో శాసనమండలిలో డిమాండ్ చేస్తే, జగన్ అప్పుడెందుకు మద్దతునివ్వలేదని చంగల్రాయుడు ప్రశ్నించారు.
టిడిపి ప్రతివ్యూహం
తమ మధ్య, ముఖ్యంగా ప్రాంతాల మధ్య స్పర్ధలు సృష్టించేందుకే జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని అనుమానిస్తోన్న తెలుగుదేశం పార్టీ.. అందుకు విరుగుడుగా జగన్ సొంత జిల్లా నుంచే ఆయనపై ప్రతి వ్యూహానికి సిద్ధమవుతున్నట్లు, తాజాగా కడప నేతల డిమాండ్ స్పష్టం చేస్తోంది. దీనితో జగన్ సంకటంలో పడతారని టిడిపి అంచనాగా కనిపిస్తోంది. ఎలాగూ కడపలో రాజధాని డిమాండ్‌ను జగన్ పట్టించుకోరు కాబట్టి, మళ్లీ అదే అంశంపై ఎదురుదాడి చేయడం ద్వారా..సీఎంను సొంత జిల్లా ప్రజల ముందే ముద్దాయిగా నిలబెట్టాలన్నది టిడిపి వ్యూహంగా కనిపిస్తోంది.