రాజధాని ఇన్‌సైడర్‌పై లోకాయుక్త?

274

సీబీఐ కంటే అదే మేలని భావిస్తున్న వైసీపీ
సీబీఐ కేంద్ర అధీనంలోఉండటమే దానికి కారణమా?
ఏడు నెలలయినా ఆరోపణలకే పరిమితంపై నేతల అసంతృప్తి

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ రాజధాని అమరావతిని రాజధానిగా ప్రకటించకముందు.. అక్కడ టిడిపి నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటూ, విపక్షంలో ఉన్నప్పటి నుంచీ ఆరోపిస్తున్న వైసీపీ ఇప్పుడు దానిపై విచారణకు సిద్ధమవుతోంది. ఆ కొనుగోల్‌మాల్‌పై లోకాయుక్తతో విచారణ చేయించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బాబు, ఆయన సహచరులు బినామీల పేరుతో నాలుగువేల ఎకరాలకు పైగా కొనుగోలు చేశారంటూ మంత్రి వర్గఉపసంఘం క్యాబినెట్‌కు నివేదిక సమర్పించింది. దానిపై న్యాయశాఖ అధికారులతో సమీక్షించిన జగన్.. ఒకటి రెండు రోజుల్లో, లోకాయుక్తతో విచారణకు ఆదేశించాలని భావిస్తున్నట్లు సమాచారం.
రాజధాని భూదందాపై రచ్చ చేసిన వైసీపీ
వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు రాజధాని భూములపై భారీ ఆరోపణలు చేసింది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే వైసీపీ అధికార మీడియా సాక్షిలో.. దానికి సంబంధించి వరస కథనాలు వెలువరించింది. రాజధాని ఎక్కడో ముందుగానే తెలిసిన టిడిపి ప్రభుత్వం, అమరావతిలో రాజధానిని ప్రకటించేముందు తన పార్టీకి చెందిన ప్రముఖులతో అక్కడి పరిసర ప్రాంతాల్లో వేల ఎకరాలు కొనుగోలు చేయించిందని, అందులో మంత్రులు, ఎమ్మెల్యేలున్నారని ఓ జాబితా కూడా ప్రకటించింది. అందులో నాటి మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు,స్పీకర్ కోడెల తనయుడు శివరాం, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, బాలకృష్ణ వియ్యంకుడు వంటి ప్రముఖులతోపాటు, నాటి కేంద్రమంత్రి సుజనా చౌదరి, టిడిపికి మద్దతునిచ్చిన పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారని.. వీరంతా కలసి దాదాపు 4056 ఎకరాలు కొనుగోలు చేశారని వైసీపీ, దాని అధికార మీడియా ఆరోపించింది. దానిపై అసెంబ్లీలో వాగ్యుద్ధం నడిచింది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కుపాల్పడిందని తాజాగా మంత్రులు కూడా ఆరోపించారు. అయితే దానిని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ఖండించారు. సుజనా చౌదరి అయితే, ఎలాంటి దర్యాప్తు అయినా చేసుకోవచ్చని, తనకు సెంటు భూమి కూడా అక్కడ లేదని సవాల్ చేశారు. అక్కడికి వెళ్లిన సీఐడి అధికారులు ఏమీ దొరక్క ఉత్తి చేతులతో వెనక్కివచ్చారన్నారు. తాజాగా రావెల కిశోర్‌బాబు కూడా, తనపై ఆరోపణలను నిరూపించకపోతే వందకోట్లకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
విచారణకు ముందే డిమాండ్ చేసిన కన్నా
అటు రాజధాని తరలింపు అంశంపై ఆందోళన చేస్తున్న బిజెపి కూడా భూముల కోనుగోలులో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలే తప్ప, ఆ సాకుతో రాజధాని నిర్మాణాన్ని ఆపి, దానిని మరొక చోటకు తరలించటం ఏమిటని విరుచుకుపడింది. బిజెపిచీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కూడా.. ‘అక్రమాలు జరిగితే విచారణ జరిపి దోషులను జైలుకు పంపించవద్దని మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? ఒకవేళ చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని మీరు నిరూపించి ఆయనను జైలుకు పంపించండి. అధికారంలోకి వచ్చిన 7 నెలలలో మీరు ఏమీ నిరూపించకుండా, గాలి మాటలు మాట్లాడితే ఉపయోగం ఏమిట’ని ధ్వజమెత్తారు.
నాన్చుడుపై వైసీపీలోనూ అసంతృప్తి
నిజానికి అటు వైసీపీలో కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమరావతి భూములపై విపక్షంలో ఉన్నప్పుడు, తాము చేసిన ఆరోపణలపై అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ విచారణ జరపకపోవడం వల్ల.. తాము కేవలం టిడిపితోపాటు, ప్రముఖులపై బురద చల్లేందుకే ఆరోపణలు చేస్తున్నామన్న భావన ప్రజల్లో బలపడే ప్రమాదం ఉందంటున్నారు. నిజంగా తమ వద్ద ఆధారాలు ఉంటే అసలు అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే విచారణకు ఆదేశించి ఉండేవారన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని చెబుతున్నారు. ఇంతకాలం ఏ స్థాయిలోనూ కనీసవిచారణకు ఆదేశించకపోవడం వల్ల తాము చేసిన ఆరోపణలన్నీ రాజకీయపరమైనవేతప్ప, అందులో నిజంలేదని ప్రజలు భావించే ప్రమాదం లేకపోలేదని స్పష్టం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు సహా టిడిపి నేతలు దమ్ముంటే విచారణ చేసుకోవాలని సవాల్ చేస్తున్నా.. తాము మౌనంగా ఉన్నామంటే, తమ ఆరోపణల్లో పసలేదన్న విషయం అర్ధమవుతోందని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. అందువల్ల తక్షణం విచారణజరిపిస్తే తప్ప, తమ ఆరోపణలకు విశ్వసనీయత ఉండదని స్పష్టంచేస్తున్నారు.
అందుకే లోకాయుక్త విచారణ?
నేతల మనోభావాలు, విపక్షాల సవాళ్లు పరిగణనలోకి తీసుకున్న సీఎం జగన్ కూడా దానిపై విచారణకు ఆదేశించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే కొందరు మంత్రులు సీబీఐ విచారణకు లేఖ రాయాలని సూచించినప్పటికీ, దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వైసీపీ మెజారిటీ నేతలు చెబుతున్నారు. సీబీఐకేంద్ర పరిథిలో ఉండటం, జగన్ సర్కారుకు కేంద్రం సహకరించకపోవడం, రాష్ట్రంలో బిజెపి వైసీపీకి శత్రుపక్షంగా మారిన నేపథ్యంలో.. లోకాయుక్తతో విచారించడమే మంచిదని స్పష్టం చేస్తున్నారు. దీనితో అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణకు ఆదేశించాలని, జగన్ నిర్ణయించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.