మోదీని అవమానిస్తున్నా,కమలంలో అవే కలహాలు

646

కమలంలో కట్టుదాటుతున్న క్రమశిక్షణ
రాజధానిపై నేతల మధ్య రాద్ధాంతం
అమరావతేనంటున్న కన్నా, సుజనా, సీఎం రమేష్
జగన్ నిర్ణయానికి నిరసనగా మౌనదీక్ష చేసిన కన్నా
అక్కడే ఉంటుందని రైతులకు భరోసా
కేంద్రం, పార్టీ మాట కూడా అదేనన్న సుజనా చౌదరి
అది కేంద్రానికి సంబంధం లేదని బాంబు పేల్చిన జీవీఎల్
అదంతా వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్న వాదన
తాను చెప్పిందే ఫైనలంటున్న జీవీఎల్‌పై పార్టీ నేతల గరం
ఏపీలో ఎవరి దారి వారిదేనంటున్న కమలదళం
అయినా జాతీయ పార్టీది ప్రేక్షకపాత్రనే

(మార్తి సుబ్రహ్మణ్యం)

బిజెపి.. క్రమశిక్షణకు మారుపేరు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఉదయం ఒకమాట, రాత్రికోమాట ఉండదు. రాష్ర్టానికో విధానం ఉండదు. ఆ పార్టీ నాయకులూ అంతే. పార్టీ ఒక విధానం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అందుకు పూర్తి రివర్సు. ఏపీలో బిజెపి నేతలపై ఎవరి నియంత్రణా లేదు. పార్టీ చీఫ్ కంటే తామే అధికులమన్నది కొద్దిమంది నేతల భావన. ఏపీలో బిజెపి బలం అత్యల్పం. అయితేనేం.. ఒక్కో నేత ఒక్కో వాజపేయి, ఒక్కో అద్వానీ, ఒక్కో అమిత్‌షా, ఒక్కో మోదీలా ఫీలవుతుంటారు. ఇప్పుడే వాళ్లతో మట్లాడినట్లు ఫోజులుకొడుతుంటారు. కానీ వాళ్లకు క్షేత్రస్థాయిలోనే.. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంటి పక్కనే ఓట్లు రాలవు. కానీ, అలాంటి వారంతా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు. అయితేనేం..? ఒక్కోరు తన మాటలే పార్టీ పాలిసీ అని చెబుతుంటారు. టివి చర్చల్లో పార్టీ విధానానికి భిన్నంగా వాదిస్తుంటారు. సోషల్ మీడియాలో ప్రచారం కోసం చీప్ ట్రిక్స్‌కు వెంపర్లాడుతుంటారు. అత్యంత కీలకమైన రాజధాని తరలింపు అంశంలోనూ బిజెపి నేతలది ఏపీలో మూడు ముక్కలు, నాలుగుస్తంభాలాటనే! అసలు దానిపై అగ్రనేతల మధ్యనే సమన్వయం లేదు. ఒకరు అవునంటే, ఇంకొకరు కాదంటారు. ఇదీ.. రాష్ట్రంలో బలం లేని, స్వయంప్రకాశమూ కాని బిజెపి నేతల మన్‌కీ బాత్!
మోదీని అవమానించినా అంతేనా?
అమరావతిలోనే రాజధాని ఉండాలని, కర్నూలులో హైకోర్టు ఉండాలన్నది ఏపీ బిజెపి విధానం. ఎందుకంటే.. ప్రధాని నరేంద్ర మోదీ గంగ, యుమున వంటి జీవనదుల నుంచి పవిత్ర జలం, మట్టి తీసుకువచ్చి అమరావతి నగర శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో కలిపారు కాబట్టి! అంటే అది మోదీకి సైతం ప్రతిష్ఠ అనే కదా అర్ధం? స్వయంగా తమ పార్టీ ప్రధాని చేతుల మీదుగా జరిగిన శంకుస్థాపన జరిగిన నగరాన్ని తరలించడమంటే ఆయనను అవమానించడమే కదా అర్ధం? మరి అలాంటి ప్రయత్నాలు జరుగుతుంటే ఆ పార్టీకి చెందిన నేతలు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎలా స్పందించాలి? ఒక్క గళంతో కదా పోరాడాలి? ఏకకంఠంతో కదా అడ్డుకోవాలి? దేశ ప్రధాని శంకుస్థాపన చేసిన నగరాన్ని ఎలా తరలిస్తారని కదా సర్కారుతో సమరం సాగించాలి? దేశ ప్రధానిని అవమానిస్తారా అని కదా కళ్లెర్ర చేయాల్సింది? అసలు తమ పార్టీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తారని కదా వాదించాల్సింది? ఢిల్లీ నుంచి గల్లీ వరకూ నేతలంతా ఆ కోణంలోనే స్పందించాలి కదా?

కమలదళాల దారులు వేరయా..
మరి… రాష్ట్ర బిజెపి మహానుభావులేమిటి తలా ఒకరకంగా స్పందిస్తున్నారు? రాజధాని అక్కడే ఉంటుందని, కేంద్రం, పార్టీతో మాట్లాడిన తర్వాతనే ఈ విషయం చెబుతున్నానని ఒక ఎంపి అంటే.. అసలు దానితో కేంద్రానికి సంబంధం లేదని, తాను పార్టీ-కేంద్ర ప్రభుత్వ విధానమే చెబుతున్నానని మరో ఎంపీ అంటారు. స్వయంగా పార్టీ అధ్యక్షుడేమో ప్రధాని శంకుస్థాపన చేసిన చోట రాజధాని తరలింపును నిరసిస్తూ మౌన దీక్ష చేస్తారు. మరో ఎంపీ ఏమో రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటారు. ఇంకో ఎంపీ ఏమో రాష్ట్ర అధ్యక్షుడి మాటే ఫైనలంటారు. ఇంకో సీమ ప్రముఖుడేమో దానికి మద్దతుగా రాసిన లేఖలో సంతకం పెడతారు. ఇంకో సీమ నేతేమో కర్నూలులో హైకోర్టు కావాలంటూనే, మళ్లీ అక్కడ హైకోర్టు పెడితే నాలుగు జిరాక్సు షాపులుతప్ప ఏం వస్తాయంటారు. ఇటీవలే పార్టీలో చేరిన కర్నూలు నేత కూడా ప్రత్యేక సీమ కావాలంటారు. ఈవిధంగా పొంతన లేని మాటలు, సమన్వయం లేని ప్రకటనలతో బిజెపి శ్రేణులను గ ందరగోళంలోకి నెడుతున్న వైచిత్రి ఏపీ బిజెపిలో దర్శనమిస్తోంది. ఫలితంగా రాజధాని తరలింపు అంశం బిజెపిలో చీలికలకు కారణమవుతోంది.
జగన్ మైండ్‌గేమ్‌తో టిడిపికి షాక్
జగన్ ఆడుతున్న మైండ్‌గేమ్ ఫలితంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో మూడు ప్రాంతాల వారు మూడు దారులయ్యారు. ఉత్తరాంధ్ర తమ్ముళ్లు విశాఖలో రాజధానికి జై కొడుతున్నారు. సీమ తమ్ముళ్లు కొందరు తమ రాష్ట్రం తమకిచ్చేయాలని గళం విప్పుతున్నారు. విశాఖ తమకు చాలా దూరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోస్తా నేతలు అమరావతికే కట్టుబడి ఉంటామంటున్నారు. చివరకు బాలకృష్ణ చిన్నల్లుడు కూడా విశాఖకే జై అన్నారు. అంటే టిడిపిలో తెలంగాణ ఉద్యమ సమయం మాదిరిగా కేసీఆర్ ప్రాంతాల చిచ్చు తీసుకువచ్చినట్లే.. జగన్ కూడా విభజిత ఏపీలో టిడిపిని ప్రాంతీయ వాదనతో దెబ్బతీసే వ్యూహానికి పదునుపెడుతున్నారని స్పష్టమవుతోంది. అది ఉత్తరాంధ్ర వరకూ సక్సెస్ అయినట్లేనని టిడిపి నేతల ప్రకటన ద్వారా అర్ధమవుతోంది.
విభజన సమయంలోనూ మారని బిజెపి వైఖరి
టిడిపి అంటేనే ప్రాంతీయ పార్టీ. కాబట్టి నేతలు ఎవరి ప్రాంత మనోభావాల మేరకు వ్యవహరిస్తారంటే అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో టిడిపి.. తెలంగాణ-ఆంధ్ర నేతల మనోభావాలు గౌరవించి, రాష్ర్టాన్ని చీల్చాలని కేంద్రానికి రెండుసార్లు లేఖ రాసింది. చిదంబరం నిర్వహించిన అఖిలపక్షానికి రెండు ప్రాంతాల నేతలను పంపి, రెండు వాదనలు వినిపించింది. రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ అదే వాణి వినిపించింది. దీనిపై దమ్ముంటే అసెంబ్లీలో తీర్మానం చేయమని సవాల్ విసిరింది.కానీ.. బిజెపి జాతీయ పార్టీ. దానికో స్పష్టమైన విధానం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బిజెపి విధానం స్పష్టంగానే ఉంది. ఏపీలో కూడా ఉద్యమాలు జరుగుతున్నా (తెలంగాణ అంత తీవ్రంగా కాకపోయినా) బిజెపి రెండు రాష్ర్టాల విధానానికే కట్టుబడి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేని దయనీయంపై నాటి బిజెపి ప్రచార కమిటీ చైర్మన్‌గా నరేంద్ర మోదీ తల్లిని చంపి బిడ్డను అనాధను చేశారని ఆవేదన వ్యక్తం చేసి, దానిని తాము ఆదుకుంటామని, అవినీతిపరులకు అవకాశం ఇవ్వవద్దని, టిడిపి-బిజెపి కూటమికి ఓటేస్తే.. ఏపీని అభివృద్ధి పరంగా పంచకల్యాణ గుర్రంలా పరుగులు తీయిస్తామని హామీ ఇచ్చారు.
ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామన్న మోదీ
ఎన్నికలలో టిడిపి-బిజెపి కూటమి సర్కారు అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత, అక్కడ జరిగిన శంకుస్థాపనకు వచ్చి ఢిల్లీని తలదన్నేలా రాజధాని నగరాన్ని నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. తమంతట తాము రాజధానికి భూములిచ్చిన రైతులను కొనియాడారు. వారికి పన్ను మినహాయింపులూ ఇచ్చారు. కొన్ని దేశ రాజధానులను చూసి రమ్మని స్వయంగా బాబుకు సూచించారు. రాజధాని కోసం 2500 కోట్లు రాష్ర్టానికి విడుదల చేశారు. దానితో అమరావతి పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కూడా కేటాయించారు. హైకోర్టు నిర్మాణం కోసం సుప్రీంకోర్టు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, అక్కడ జరిగిన శంకుస్థాపన, ఆ తర్వాతి భవన ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా అమరావతికి తరలివచ్చారు. ఇదీ.. అమరావతి కోసం బిజెపి చేసిన కృషికి సంబంధించిన కీలక అంశాలు.
జగన్ ఉచ్చులో బిజెపి పడిందా?
అయితే.. రాజధానిని మూడు ముక్కలు చేసేందుకు ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు బిజెపిలో కొందరు నాయకులు అంతర్గతంగా ఆయన విధానానికి మద్దతు ప్రకటిస్తుంటే, మరికొందరు మాత్రం పార్టీ నిర్ణయానికి, ఇంకొందరు సొంత నిర్ణయాలు ప్రకటిస్తుండటం బట్టి.. జగన్ మైండ్‌గేమ్ జాతీయ పార్టీ అయిన బిజెపిపైనా పనిచేస్తోందని స్పష్టమవుతోంది. రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని జగన్, చివరకు జాతీయ పార్టీలో కూడా చిచ్చు పెట్టడం గొప్ప విషయమే. నిజానికి జగన్ నిర్ణయం టిడిపిని దె బ్బతీసేందుకే అయినప్పటికీ, ఆ ఉచ్చులో బిజెపి కూడా పడుతుందని బహుశా జగన్ కూడా ఊహించి ఉండకపోవచ్చు!
కన్నా-సుజనా వైఖరితో బిజెపిలో ఊపు
రాజధానిని తరలించవద్దని భూములిచ్చిన అమరావతి రైతులు బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను కలసి అభ్యర్ధించారు. ఆ మేరకు ఆయన అక్కడ గ్రామాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి వాస్తవాలు గ్రహించి వారి పోరాటానికి మద్దతు ప్రకటించారు. ప్రధాని శంకుస్థాపన చేసిన నగరాన్ని తరలించేందుకు తామెట్టి పరిస్థితిలోనూ అంగీకరించమని, రాజధాని అక్కడే ఉంటుందని, ఉండాలన్నది తమ పార్టీ విధాన నిర్ణయమని కన్నా విస్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా, ప్రధాని శంకుస్థాపన చేసిన స్థలంలోనే ఆయన గంట సేపు మౌనదీక్ష కూడా చేశారు. దానికి రైతులంతా పెద్ద సంఖ్యలో హాజరయి, మోదీ-అమిత్‌షా ఫొటోలున్న మాస్కులు ప్రదర్శించారు.ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి, ఎంపి సుజనా చౌదరి కూడా అమరావతిలో పర్యటించి రైతులకు మద్దతు ప్రకటించారు. సుజనా కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు రాష్ర్టానికి రావలసిన కేంద్ర నిధులతోపాటు, అమరావతి నగరానికి కేంద్ర నిధులను తీసుకువచ్చేందుకు ప్రధాని కార్యాలయంపై నిరంతరం ఒత్తిడి చేశారు. అసలు రాష్ట్ర పార్టీ ఇన్చార్జి సునీల్ దియోధర్ కూడా అమరావతిని తరలించేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఆ సందర్భంగా దియోధర్, కన్నా, సుజనా గతంలో అమరావతిపై చంద్రబాబు చేసిన తప్పిదాలను తూర్పారపట్టారు. బాబు ఆలస్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని దునుమాడారు. ప్రధాని శంకుస్థాపన చేసిన నగరాన్ని తరలించడమంటే ప్రధానిని అవమానించడమేనని స్పష్టం చేశారు.
రైతులకు సుజనా భరోసా
తాజాగా విజయవాడ వచ్చిన సుజనా.. ఆందోళనతో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు. రాజధాని ఎక్కడికీ తరలిపోదని, తాను కేంద్రప్రభుత్వం-బిజెపి నాయకత్వంతో చర్చించిన తర్వాతనే ఈ మాట చెబుతున్నానన్నారు. ఒకవేళ జగన్ సర్కారు రాజధానిని తరలిస్తే రైతులకు లక్షన్నర కోట్లు చెల్లించాలని, అంత డబ్బు ప్రభుత్వం వద్ద ఉందా? ఒక్క రాజధానే కట్టలేని వాళ్లు మూడు రాజధానులు కడతారా? అని విరుచుకుపడ్డారు. ఆ తర్వాత అదే బెజవాడకు వచ్చిన బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో చిచ్చుకు, కొత్త గందరగోళానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలు రెండు పెద్ద పత్రికలు లోపల పేజీల్లో వేస్తే.. రాజధాని తరలింపుపై పట్టుదలతో ఉన్న జగన్‌కు చెందిన పత్రికలో మాత్రం మొదటిపేజీలో, పతాక శీర్షికగా వచ్చిందంటే, ఆయన ప్రకటన వైసీపీకి ఎంత ఆనందం ఇచ్చిందో స్పష్టమవుతుంది.
మాకేం సంబంధం లేదన్న జీవీఎల్
‘రాజధాని తరలింపు అంశంతో కేంద్రానికి సంబంధం లేదు.అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమే. దీనిని నేను కేంద్రం-పార్టీతో మాట్లాడిన తర్వాతే చెబుతున్నా. ఐదు దక్షిణాది రాష్ర్టాలకు చెందిన ఏకైక జాతీయ అధికార ప్రతినిధిగా చెబుతున్నా. ఇతర ఎంపీలు, నేతల ప్రకటనలు వారి వ్యక్తిగతం. ఐదేళ్లు జాతీయ అధికార ప్రతినిధిగా నేనేం చెప్పినా మా పార్టీ నాయకత్వం కాదనలేదు. మా పార్టీలో పార్లమెంటుసభ్యులు కాని వారు చాలామంది ఏం మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం. దీనిపై మా పార్టీ నేతలు ఒకే మాట మీద లేరంటున్నారు. మరి టిడిపిలో కూడా ఎవరూ ఒక మాట మీద లేరు కదా’ అని జీవిఎల్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఆయన తన ప్రసంగంలో ఆద్యంతం శివరామన్‌కృష్ణన్ కమిటీ నివేదిక గురించే చెప్పడం ప్రస్తావనార్హం. అయితే.. ఈ విషయంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణనూ లౌక్యంగా ఇరికించే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. ‘రాజధానిని మార్చే విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు కదా’ అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
బిజెపి పోరాటంతో రాజధానిలో మారిన వైఖరి
నిజానికి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష, సుజనా చౌదరి పర్యటనల తర్వాత.. రాజధాని రైతుల ఆలోచనా ధోరణిలో మార్పు ప్రారంభమయింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు సైతం.. జగన్ మొండి వైఖరి, చంద్రబాబు నాయుడు, టిడిపి తమ కోసం పోరాడుతున్నా ఆ పార్టీతో ఇప్పటి రాజకీయ పరిస్థితుల ప్రకారం ఏమీ కాదన్న భావన, అనుకోని విధంగా బిజెపి మద్దతుతో ఊరట చెందారు. తమకు జాతీయ పార్టీ దన్ను దొరికిందని సంబరపడ్డారు. తమకు కేంద్రంలో ఉన్న పార్టీ మద్దతుగా నిలిచినందున, రాజధాని తరలింపును అడ్డుకునే శక్తి బిజెపికి మాత్రమేనన్న నిర్ణయానికి వచ్చారు. నిజానికి కన్నా దీక్షకు రైతులు వేలాదిగా తరలివచ్చారు. బిజెపికి అక్కడ కనీస స్థాయిలో కూడా బలం లేకపోయినా, తమ కోసం బిజెపి పోరాడుతోందన్న కృతజ్ఞతతో, వేలాది మంది రైతులు కన్నా దీక్షకు హాజరయ్యారు. అలాగే సుజనా వచ్చినప్పుడు కూడా రైతులు ఆశతో అక్కడికి వచ్చి, తమను ఆదుకోవాలని అభ్యర్ధించారు. ఫలితంగా రాజధాని ప్రాంతంలో బిజెపికి సానుకూల వాతావరణం స్పష్టంగా కనిపించింది. టిడిపికి సంప్రదాయ ఓటర్లుగా ఉన్న వారు సైతం.. చంద్రబాబు నాయుడు చేసిన ఆలస్యం వల్లనే ఈ దుస్థితి వచ్చిందన్న భావనతో ఉన్నారు. అక్కడ రాజధాని ఏర్పాటుచేసినందుకు చంద్రబాబుపై కృతజ్ఞత, అభిమానం ఉన్నప్పటికీ, సకాలంలో పూర్తి చేస్తే అసలు జగన్ అలాంటి నిర్ణయానికి వచ్చేవారు కాదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు బిజెపికి అనుకూలంగా మారాయి.
సానుకూలతను జీవీఎల్ చెడగొట్టారా?
అలాంటి సానుకూల రాజకీయ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటున్న సమయంలోనే.. బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్య, బిజెపి అందివచ్చిన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నట్టయింది. పైగా అమరావతిపై సర్కారును దునుమాడుతున్న బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి సుజనాచౌదరి, సీఎం రమేష్‌పై వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నా ఆ స్థాయిలో ఎదురుదాడి కనిపించడం లేదని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో పార్టీ నేతలకు దన్నుగా నిలవాల్సిన జీవీఎల్.. పార్టీ అధ్యక్షుడు, ఇద్దరు ఎంపీల వాదనకు భిన్నంగా మాట్లాడటంపై విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో హైదరాబాద్ లోని కన్నా నివాసంలో జరిగిన భేటీలో జీవీఎల్ వ్యవహారశైలిపై పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసి, ఆయనను అదుపులో ఉంచాలని రాంమాధవ్‌కు సూచించారు.ఒకవైపు పార్టీ అధికార ప్రతినిధులు పురిఘళ్ల రఘురాం, లక్ష్మీపతిరాజా, విల్సన్ వివిధ చర్చల్లో పార్టీ విధానాన్ని సమర్ధిస్తూ రాజకీయ ప్రత్యర్ధులపై సమర్ధవంతంగా ఎదురుదాడి చేస్తున్నారు. దానితో అధికార పార్టీ ప్రతినిధులు చాలా సందర్భాల్లో నోరెళ్లబెట్టాల్సిన సందర్భాలు కనిపించాయి. అలాంటిది జాతీయ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీలో ఎంపీలు కాని వారు వ్యక్తం చేసే అభిప్రాయాలకు విలువలేదన్నట్లు జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా, యుపి ఎంపిగా ఉన్న జీవీఎల్‌కు రాష్ట్ర రాజకీయాలతో ఏం సంబంధం అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా పట్టు లేని ఆయన చేసే వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వానికి అస్ర్తాలిస్తున్నాయని, పలువురు మంత్రులు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తమకు మద్దతుగా ఉటంకిస్తూ తమపై ఎదురుదాడి చేస్తుంటే ఏం మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
రాష్ట్ర ఇన్చార్జి కంటే జీవీల్‌కు ఎక్కువ తెలుసా?
రాష్ట్ర పార్టీ ఇన్చార్జి సునీల్ దియోధర్ కంటే జీవీఎల్‌కు పార్టీ విధానాలు తెలుసా? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ నాయకత్వానికి తెలియకుండానే మౌనదీక్ష చేస్తారా? అని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ఎంపి టిజి వెంకటేష్ కూడా పార్టీ విధానాన్ని కాదని ప్రత్యేక రాయలసీమను డిమాండ్ చేస్తుంటే, మరో ఎంపి సీఎం రమేష్ రాష్ట్ర అధ్యక్షుడు నాయకత్వం అనుమతితోనే దీక్ష చేశారు కాబట్టి, రాజధానిపై అదే పార్టీ నిర్ణయంగా భావించాల్సి ఉంటుందన్నారు. ఇంకోవైపు ప్రత్యేక రాయలసీమ కావాలంటూ సీమ నేతలు రాసిన లేఖలో బిజెపి నేత దినేష్‌రెడ్డి కూడా సంతకం చేశారు. దీన్ని బట్టి.. పార్టీలో క్రమశిక్షణ కట్టుదాటుతుందన్న విషయం స్పష్టమవుతోందని సీనియర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో సానుకూల వాతావరణాన్ని జీవీఎల్ తన వ్యాఖ్యలతో చెడగొడుతున్నారన్న భావన మెజారిటీ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘అసలు జీవీఎల్ బెజవాడకు వచ్చినది పౌరసత్వ చట్టం, జాతీయ గణన గురించి ప్రజలకు వివరించడానికి. రాష్ట్రంలో అమరావతి రాజధానిపై రచ్చ జరుగుతోందని ఆయనకు తెలుసు. అలాంటప్పుడు మీడియా సహజంగానే దానిపై ప్రశ్నలు వేస్తుందని ఆయనకు తెలియదా? అన్నేళ్లు జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన, రాజధాని అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ప్రస్తుతం మేం జాతీయ స్థాయిలో తీసుకున్న ఈ రెండు నిర్ణయాలపై ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే ఇక్కడకు వచ్చాం. రాజధాని అంశాన్ని రాష్ట్ర పార్టీ చూసుకుంటుంది అని కదా చెప్పాల్సింది? ఆ పాటి లౌక్యం, అనుభవం కూడా లేకుండా, అమరావతిపై ఆయన చేసిన వ్యాఖ్యలతో కీలకమైన జాతీయ స్థాయి అంశాలను మీడియా పక్కకు పెట్టి, రాజధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇచ్చింద’ని జాతీయ స్థాయి నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
జాతీయ నాయకత్వమే కారణమా?
అయితే, దీనికి జాతీయ నాయకత్వమే కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బిజెపి కూడా కాంగ్రెస్ మాదిరిగా అందరినీ ప్రోత్సహించడమే దీనికి కారణమంటున్నారు. దీన్నిబట్టి తమ పార్టీ కూడా కాంగ్రెస్ మాదిరిగా ముఠాలను ప్రోత్సహిస్తోందని అనుమానించాల్సి వస్తోందని రాయలసీమకు చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు. అసలు బిజెపి జాతీయ నాయత్వానికి దక్షిణాదిపై సరైన అవగాహన, అంచనా లేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని మార్చాలన్న ప్రయత్నాలపై రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం జరుగుతూ, సొంత పార్టీ నేతలే ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే.. ఇప్పటివరకూ జాతీయ నాయకత్వం స్పందించి విధాన ప్రకటన చేయకపోవడం బట్టి.. ఏపీపై తమ పార్టీ కూడా గందరగోళంలో ఉందన్న విషయం స్పష్టం చేస్తోందంటున్నారు. ఒకవైపు అమరావతి మార్పుపై బిజెపి సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే, ఇటీవల రాష్ర్టానికి వచ్చిన సురేష్ ప్రభు సీఎం జగన్ ఇంటికి విందుకు వెళ్లడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్లాయంటున్నారు. గతంలో కూడా టిడిపి సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సమయంలో, కేంద్రమంత్రులు చంద్రబాబు నివాసానికి వెళ్లి భోజనం చేయడం వల్ల శ్రేణుల్లో తప్పుడు సంకేతాలు వెళ్లాయని గుర్తు చేస్తున్నారు.